12 కి.మీ. వాసన చూసి హంతకుణ్ని పట్టుకున్న కుక్క

12 కి.మీ. వాసన చూసి హంతకుణ్ని పట్టుకున్న కుక్క

నేరం జరిగినప్పడు నేరస్థుడిని పట్టుకోవడంలో పోలీసుల దర్యాప్తులో జాగిలాలు కీలకంగా వ్యవహరిస్తాయి. వాసనను పసిగట్టి నేరస్తుల ఉనికిని కనిపెడతాయి. ఇదంతా నేరం జరిగిన పరిసరాల్లోని ఆనవాళ్లను గుర్తించడానికి మాత్రమే పనికి వస్తుంది. కానీ ఓ జాగిలం మాత్రం ఏకంగా 12 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంట్లో నక్కి ఉన్న హంతకున్ని పట్టించింది. నేరం జరిగిన ప్రాంతం నుంచి అతన్ని పట్టుకునేందుకు రెండు గంటలు పరిగెత్తి ఆచూకీ కనిపెట్టింది. కర్నాటకలో పదేళ్ల వయసున్న ‘తుంగా’ అనే కుక్క ఈ ఘనత సాధించింది.

బసవపట్టన ప్రాంతానికి చెందిన చంద్రనాయక్ అనే వ్యక్తి  ఇటీవల తుపాకీతో కాల్చడంతో హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు విచారణ జరపగా.. అతని దగ్గర రూ. 1.7 లక్షల అప్పు తీసుకున్న చేతన్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతడే చంపి ఉంటారని పోలీసులు గాలించారు. కానీ ఎక్కడా అతని ఆచూకీ లభించక పోవడంతో… మూడు రోజుల తర్వాత తుంగాను పోలీసులు రంగంలోకి దింపారు.  చేతన్ తిరిగిన ప్రాంతంలో వాసనను చూసి అక్కడి నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న ఓ ఇంటి దగ్గర ఆగింది. అక్కడ సోదాలు చేయగా దాక్కున్న హంతకుడు కనిపించడంతో కేసు దర్యాప్తు పూర్తైంది. కేసును ఛేదించిన తుంగా పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. తుంగా వయసు కేవలం పదేళ్లు మాత్రమే. ఇది ఇప్పటి వరకు 50 హత్య కేసులు, 60 దొంగతనాల కేసులను ఛేదించింది.