
ముంబై: బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్, విదేశీ నిధుల వెనక్కి పోవడం, హెచ్1బీ వీసా ఫీజులపై కొనసాగుతున్న ఆందోళనల కారణంగా బుధవారం బెంచ్‌మార్క్ స్టాక్ ఇండెక్స్ సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజూ పడిపోయింది. ఈ ఇండెక్స్ 386.47 పాయింట్లు నష్టపోయి 81,715.63 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఒక దశలో ఇది 494.26 పాయింట్లు తగ్గి 81,607.84 కనిష్ట స్థాయిని తాకింది. 50-షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 112.60 పాయింట్లు తగ్గి 25,056.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కంపెనీలలో టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్ భారీగా నష్టపోయాయి.
పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు మంగళవారం రూ. 3,551.19 కోట్లు విలువైన ఈక్విటీలను అమ్మారు. "జీఎస్టీ సంస్కరణల తర్వాత భారతీయ మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఇన్వెస్టర్లు వాల్యుయేషన్లను, మొదటి క్వార్టర్ ఆదాయ అంచనాలను మళ్లీ అంచనా వేసుకుంటున్నారు. హెచ్1బీ ఫీజు పెంపు కారణంగా ఐటీ స్టాక్స్ నష్టపోతున్నాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్వినోద్ నాయర్ అన్నారు. అధిక వాల్యుయేషన్లు, ఆదాయ వృద్ధిలో తగ్గుదల వల్ల
ఎఫ్ఐఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
సూచీల నేల చూపులు
బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.85 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.50 శాతం తగ్గాయి. సెక్టోరల్ సూచీలలో రియల్టీ అత్యధికంగా 2.47 శాతం పడిపోయింది. ఆ తర్వాత యుటిలిటీస్ (1.19 శాతం), క్యాపిటల్ గూడ్స్ (1.09 శాతం), సర్వీసెస్ (1.07 శాతం), పవర్ (1.06 శాతం), ఆటో (1.06 శాతం), కన్స్యూమర్ డిస్క్రెషనరీ (0.87 శాతం) నష్టాలపాలయ్యాయి. ఎఫ్ఎంసీజీ ఒక్కటే లాభపడింది. నాలుగు రోజులలో సెన్సెక్స్ 1.56 శాతం, నిఫ్టీ 1.44 శాతం పడిపోయాయి.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ నష్టపోగా, జపాన్ నిక్కీ 225 సూచీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీ, హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ పాజిటివ్‌గా ముగిశాయి. యూరప్ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు నెగిటివ్‌గా ముగిశాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.44 శాతం పెరిగి 67.93 డాలర్లకు చేరుకుంది.