అదనపు ఆదాయం ధ్యాసలో.. ఈ ‘వర్క్ -ఫ్రమ్- హోమ్’ ప్రకటనలకు మోసపోవద్దు

అదనపు ఆదాయం ధ్యాసలో.. ఈ ‘వర్క్ -ఫ్రమ్- హోమ్’ ప్రకటనలకు మోసపోవద్దు

నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో విడదీయరాని భాగమైంది. సమాచారం, వినోదంతోపాటు, ఉపాధి అవకాశాలను కూడా అందిస్తోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత  ‘వర్క్-ఫ్రమ్-హోమ్’ (ఇంటి నుంచే పని) అనే భావన బహుళ ప్రజాదరణ పొందింది.  ఆఫీసులకు వెళ్లి సమయం, శ్రమ వృథా చేసుకోకుండా, ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన సమయాల్లో పనిచేస్తూ ఆదాయం సంపాదించుకునే వెసులుబాటును ఇది కల్పించింది. 

అయితే, ఈ అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లలో కనిపించే ఆకర్షణీయమైన వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగ ప్రకటనలు నిరుద్యోగులను, అదనపు ఆదాయం ఆశించే వారిని సులభంగా ఆకర్షిస్తున్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదన అంటూ ఆశ చూపించి, అమాయకులను మోసాల ఊబిలోకి నెడుతున్నాయి.

వాట్సాప్,  టెలిగ్రామ్, ఫేస్‌‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ‘రోజుకు కొన్ని గంటలు పని చేస్తే చాలు, లక్షల్లో సంపాదించవచ్చు’ అని వచ్చే సందేశాలు, ప్రకటనలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ మోసగాళ్లు ఆన్‌‌లైన్ డేటా ఎంట్రీ,  ఉత్పత్తి సమీక్షలు (product reviews), యూట్యూబ్ వీడియోలకు లైకులు/సబ్‌‌స్క్రైబ్‌‌లు, యాప్‌‌లను డౌన్‌‌లోడ్ చేయడం, లేదా సోషల్ మీడియా పోస్ట్‌‌లను షేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులను చూపించి, అమాయకులను ఆకర్షిస్తారు.  మొదట, ఈ పనులకు సంబంధించిన కొన్ని వీడియో ట్యుటోరియల్‌‌లు పంపి, ఎలా చేయాలో వివరిస్తారు. 

ఆ తర్వాత, ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని కోరతారు. ఈ పెట్టుబడి పెడితే, దానికి రెట్టింపు లాభాలు వస్తాయని, లేదా మీరు చేసే పనికి అధిక మొత్తంలో కమీషన్ వస్తుందని నమ్మిస్తారు. మొదట్లో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చి నమ్మకాన్ని పెంచుకుంటారు. ఉదాహరణకు రూ. 500 పెట్టుబడి పెడితే, రూ. 1000 తిరిగి ఇస్తారు. ఇది చూసిన బాధితులు, నిజంగానే ఆదాయం వస్తుందని నమ్మి, పెద్ద మొత్తంలో డబ్బు కట్టేస్తారు. ఆ తర్వాత ఈ మోసగాళ్లు ఫోన్ నంబర్లు మార్చుకుని, లేదా బ్లాక్ చేసి అదృశ్యమవుతారు. బాధితులు తాము 
మోసపోయామని తెలుసుకునేలోపే  వారి డబ్బును పోగొట్టుకుంటారు.

చేదు అనుభవాలు

సైబర్​ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  దేశవ్యాప్తంగా వందలు,  వేల మంది ఈ మోసాలకు బలైపోతున్నారు. మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లు 910 మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టేసినట్లు బయటపడిన వాస్తవాలు ఈ ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, అలాగే అదనపు ఆదాయం కోసం చూస్తున్న ఉద్యోగులు కూడా ఈ మోసగాళ్ల వలలో పడుతున్నారు. 

ఈ మోసాలు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు.  ప్రపంచవ్యాప్తంగా వర్క్-ఫ్రమ్-హోమ్ స్కామ్‌‌లు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి, నమ్మదగిన వెబ్‌‌సైట్‌‌లు, నకిలీ కంపెనీ ప్రొఫైల్‌‌లు, ఫోర్జరీ చేసిన పత్రాలను సృష్టిస్తున్నారు. దీంతో అమాయకులు సులభంగా మోసపోతున్నారు.

చట్టపరమైన శిక్షలు

మోసపూరిత కార్యకలాపాలు కేవలం ఆర్థిక నష్టాలకే పరిమితం కావు.  బాధితుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా మోసపోయినందుకు నిరాశ, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వర్క్ -ఫ్రమ్ -హోమ్ ఉద్యోగాల పేరుతో జరిగే ఈ సైబర్ నేరాలు సమాజంలో పెనుసవాలుగా మారాయి.  ఈ మోసపూరిత వ్యవహారాలు కేవలం నైతిక సమస్య మాత్రమే కాదు,  తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు కలిగిన నేరాలు. 

సమాచార సాంకేతిక చట్టం (Information Technology Act), 2000లోని సెక్షన్ 66D  ‘కంప్యూటర్  వనరును ఉపయోగించి వ్యక్తి మోస పూరిత చర్యలకు పాల్పడినందుకు’ ఈ సెక్షన్ కింద ఎవరైనా  మోసం చేయడానికి  కంప్యూటర్  పరికరాన్ని ఉపయోగించినట్లయితే వారికి మూడేళ్లవరకు జైలు శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.  భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita - BNS) 2023, సైబర్ నేరాల గురించి మరింత స్పష్టంగా నిర్వచిస్తుంది. BNSలోని సెక్షన్ 318 సెక్షన్ ప్రకారం ఎవరైనా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో కంప్యూటర్ వనరును ఉపయోగించి ఇతరులను మోసగిస్తే వారికి జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. 

అప్రమత్తతే రక్ష

తక్కువ శ్రమతో అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మవద్దు.  ఏ పనిలోనూ అంత సులువుగా డబ్బు సంపాదించడం సాధ్యం కాదు. కష్టపడకుండా కోట్లు సంపాదించవచ్చని చెప్పేవన్నీ మోసాలే.  గుర్తు తెలియని వ్యక్తుల నుంచి  వచ్చే అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌‌లకు స్పందించవద్దు.  వారు చెప్పే మాటలను నమ్మి మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు. 

సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌‌లైన్‌‌కు (1930) సంప్రదించండి. ఆన్‌‌లైన్ మోసాలను నివేదించడానికి www.cybercrime.gov.in వెబ్‌‌సైట్‌‌ను ఉపయోగించవచ్చు. ఈ డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా జీవించడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి అవగాహన, జాగ్రత్తే ప్రధాన ఆయుధాలు.  సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని నమ్మకుండా వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవడం మనందరి బాధ్యత.  అప్రమత్తతే రక్ష, తస్మాత్ జాగ్రత్త! 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సామాజిక మాధ్యమాలలో వచ్చే ఆకర్షణీయమైన వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగ ప్రకటనల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి.  ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా, అవాస్తవమైన వాగ్దానాలను గుడ్డిగా నమ్మకూడదు. ఏ సంస్థ అయినా ఉద్యోగం ఇవ్వడానికి ముందు డబ్బు డిపాజిట్ చేయమని అడిగితే అది కచ్చితంగా మోసం అని గుర్తుంచుకోవాలి. నిజమైన కంపెనీలు ఎప్పుడూ ఉద్యోగాలకు ముందు డబ్బు అడగవు. 

తెలియని వెబ్‌‌సైట్‌‌లలో వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను నమోదు చేయకూడదు. నకిలీ వెబ్‌‌సైట్‌‌లు మీ డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు ఆ సంస్థ గురించి పూర్తిగా పరిశోధన చేయాలి. వారి అధికారిక వెబ్‌‌సైట్, సంస్థాగత గుర్తింపు, ఆన్‌‌లైన్ సమీక్షలు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివి తనిఖీ చేయాలి. అవసరమైతే వారి హెచ్‌‌ఆర్  విభాగాన్ని  నేరుగా సంప్రదించాలి.

- డా.కట్కూరి,
సైబర్ సెక్యురిటీ & న్యాయ నిపుణుడు