అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌కు వచ్చిండు గదా. ఆయనకు భారత్ విజిట్ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది కేంద్రం. ‘నమస్తే ట్రంప్’ అంటూ అద్దిరిపోయే ఏర్పాట్లు చేసింది. పర్యటనకు అవాంతరాలు జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంది. రోడ్ల నుంచి తాజ్‌మహల్ వరకు అంతా కడిగించింది. యమునా నదినీ క్లీన్ చేయించింది. పాన్‌లేసుకొని రోడ్ల మీద ఉమ్మేయుకుండా పాన్ షాపుల్ని క్లోజ్ చేయించింది. కుక్కలు, కోతులు ఇబ్బంది పెట్టకుండా పట్టుకొని బోన్లల్ల పడేయించింది. స్లమ్స్ కనవడకుండా గోడలు కట్టించింది.
నమస్తే ట్రంప్ మీటింగ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ట్రంప్ రోడ్డు మార్గాన సభకు వెళ్లే రూట్‌లో ‘దేవ్‌సరన్’ మురికి వాడొకటి ఉంది. అమెరికా పెద్దన్నకు ఆ స్లమ్ కనపడకుండా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులు ఆ ఇండ్లను నాశనం చేశారు. స్లమ్ కనవడకుండా అర కిలోమీటరు మేర గోడలు కట్టారు. ఇలా చాలా ప్లేసుల్లోనే ఇండ్లు కూల్చి గోడలు కట్టారు.
- తాజ్ మహల్‌కు పోయే రూట్‌లో గోడలకు ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో మంచి మంచి పెయింటింగ్‌లు వేయించారు.
- పాన్ వేసుకొని రోడ్ల మీద ఎవరూ ఉమ్మేయకుండా, సిగరెట్లు తాగుతూ రోడ్ల మీద నిలవడకుండా అహ్మదాబాద్ పరిధిలో అన్ని పాన్ షాపులను మూసేశారు. దుకాణాలకు సీల్స్ వేశారు. సీల్స్ గనక తీసేస్తే లీగల్ యాక్షన్ తీస్కుంటామని నోటీసులిచ్చారు.
- 2015లో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఓ కుక్క తాకింది. అందుకే ట్రంప్ టూర్‌కు ఏఎంసీ అధికారులు గట్టి జాగ్రత్తలే తీసుకున్నారు. వీవీఐపీ రూట్‌లోకి కుక్కలు, కోతులు, మనుబోతులు అడ్డు రాకుండా ఎక్కడికక్కడ వాటిని పట్టుకొని బోనుల్లో పడేశారు.
- ట్రంప్ వచ్చే రూట్‌లో యమునా నదీ ఉంది. కాబట్టి దాన్ని కూడా యూపీ సర్కారు శుభ్రం చేయించింది. పొల్యూషన్ వల్ల నది లోంచి వచ్చే చెడు వాసన పోగొట్టేందుకు సుమారు 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. మరి ఆ నీళ్లతో నది ఎంతవరకు క్లీన్ అయిందో.
- ఒబామా ఇండియా వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ను చూసే షెడ్యూల్ కూడా ఉంది. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల విజిట్‌ను రద్దు చేసుకున్నారు. ఈసారి అలా జరగకుండా తాజ్ రూట్‌లో ప్రతి ఇంటినీ యూపీ పోలీసులు పక్కాగా చెక్ చేశారు. హోటళ్లలో ఉంటున్న వాళ్ల వివరాలను కూడా కలెక్ట్ చేశారు.
- తాజ్‌మహల్‌ను 300 ఏండ్ల తర్వాత ఫస్ట్ టైం పూర్తిగా కడిగారు. మహల్ మొత్తానికి క్లే ట్రీట్‌మెంట్ చేయించి తళతళ మెరిపించారు. ఇంతకుముందు కూడా తాజ్‌ను క్లీన్ చేసినా లోపలున్న సమాధులను మాత్రం శుభ్రం చేయలేదు. ఈసారి సమాధులను కూడా క్లే ట్రీట్‌మెంట్‌తో శుభ్రం చేశారు.
- వీవీఐపీ రూట్‌లో రోడ్లను మంచి మెషీన్లతో క్లీన్ చేయించారు. డివైడర్లకు కొత్త పెయింటింగ్ వేయించారు. కెరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్ వరకు రూట్‌కు కొత్తదనం తీసుకొచ్చారు.