నవంబరు 15న ట్రంప్ కీలక ప్రకటన.. మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ?

నవంబరు 15న ట్రంప్ కీలక ప్రకటన.. మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ?

అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబరు 15న ఫ్లోరిడాలో చాలా పెద్ద ప్రకటన చేస్తానని ఆయన వెల్లడించారు. ఒహియో ప్రాంతంలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈవిషయాన్ని ట్రంప్ తెలిపారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉంటాననే అంశాన్ని ఆ రోజున ట్రంప్ ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.  మధ్యంతర ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేయకుంటేనే  మంచిదని ఆయనకు సన్నిహిత వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది.  ట్రంప్‌ మాత్రం వీలైనంత త్వరగా తన రాజకీయ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

2016, 2020 సంవత్సరాల్లో..

2016 సంవత్సరంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2020లో రెండోసారి పోటీ చేయగా.. డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్‌ చేతిలో ఓడిపోయారు. దీంతో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి పోటీ చేయాలని ట్రంప్ డిసైడ్ అయినట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

గంపెడు ఆశలు పెట్టుకున్న ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగేళ్ల పదవీకాలంలో రెండేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఇవాళ మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో వచ్చే ఫలితాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత బైడెన్ మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు మధ్యంతర ఎన్నికలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా సీరియస్ తీసుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ట్రంప్.. మధ్యంతర ఎన్నికల కోసం జోరుగా ప్రచారం చేశారు. జో బైడెన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. దీంతో అమెరికా రాజకీయం రంజుగా మారింది. ఈ మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిని నిర్ణయిస్తాయి.