గాడిదలతోనే బతుకుదెరువు

గాడిదలతోనే బతుకుదెరువు

అత్యాధునిక వాహనాలతో దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా ఈ ప్రాంతంలోని వారికి ఆ పాత పద్దతులనే సాగిస్తున్నారు. పొలం పనులకు, వస్తువులను మోయడానికి దేనికైనా ఇక్కడ గాడిదలే దిక్కు.. రాష్ట్ర సరిహద్దు మండలాలైన నాగల్ గిద్దా, కంగ్టిలలో ప్రతి ఊరిలో గాడిదలు కనిపిస్తాయి.

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో గాడిదల పెంపకం కామన్ గా కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న గాడిదలను వీరు వదలడం లేదు. ఇక్కడ పెంచడంతో పాటు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లలేని వ్యవసాయ పొలాల్లోకి వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సీజన్‌లో వీటి ద్వారా ఉపాధి లభిస్తుంది. మనూరు, నాగల్‌గిద్ద, కంగ్టి మండలాల్లో గాడిదల పెంపకం సాదారణంగా కనిపిస్తుంది. గాడిదల ద్వారా కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. గతంలో కుండలు చేయడం, బట్టలు ఉతకడం కులవృత్తిగా ఉన్న వారు.. ప్రస్తుతం తమ రూటు మార్చి గాడిదల పెంపకాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న మంజీర నదీ తీర ప్రాంత గ్రామాల్లో వీటి సేవలను వినియోగించుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర జిల్లాలకు గాడిదలను తీసుకపోయి పనులు చేయిస్తూ సంపాదిస్తున్నారు. 

తీరప్రాంత వ్యవసాయ క్షేత్రాలు నల్లమట్టి నేలలు కావడం, మరోవైపు రాళ్ళు రప్పలతో కూడినవి కావడంతో రైతులు అడుగు తీసి అడుగు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు పొలాలకు దారి లేకపోవడం, దారి ఉన్నా రేగడి నేలల మీదుగా విత్తనాలు, ఎరువులు మోసుకెళ్లడం అసాధ్యం. దీంతో ఎరువులు, విత్తనాలను వ్యవసాయ క్షేత్రాలకు చేరవేసేందుకు గాడిదలను వినియోగిస్తుంటారు. వారి పనులతో పాటు ఇతరుల అవసరాలకు దూరం, బరువును బట్టి డబ్బులు వసూలు చేస్తారు.

వ్యవసాయ సీజన్‌లో రోజుకు కనీసం 500 వరకు గాడిదల ద్వారా సంపాదిస్తున్నారు. ధాన్యం దిగుబడి సమయంలోనూ గాడిదలను రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో గాడిద ధర రూ.15 నుండి ఇరవై వేలకు పైనే పలుకుతుండగా, వీటి కొనుగోలుకు సంబంధించి స్థానికంగా మార్కెట్‌ లేదు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఘోడే మాలేగావ్‌ నుంచి కొనుగోలు చేస్తారు. మాలేగావ్‌లో ప్రతి ఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో సుమారు 30 రోజుల పాటు అతిపెద్ద సంత నిర్వహిస్తారు. ఇక్కడి జనం అక్కడికి వెళ్లి కావాల్సినవి కొనుక్కొచ్చుకుంటారు. ఎన్ని అత్యాధునిక వాహనాలు వచ్చినా పాత తరం వాడిన గాడిదలను మాత్రం వదల లేక పోతున్నారు. తమకు గాడిదలు కొనుక్కోవడానికి లోన్లు ఇవ్వాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గాడిదలు అస్వస్థతకు గురయైతే వైద్యం అందించే వైటర్నరి డాక్టర్లు ఈ ప్రాంతాల్లో లేక గాడిదలు చనిపోతున్నాయని... ఈ ప్రాంతాల్లో పశువుల ఆసుపత్రులను పెట్టి డాక్టర్లను నియమించాలని కోరుతున్నారు.