కల్లాల వద్ద రాజకీయాలు చేయొద్దు : మంత్రి గంగుల

కల్లాల వద్ద రాజకీయాలు చేయొద్దు : మంత్రి గంగుల

ఇక్కడ పాదయాత్రలు చేయడమెందుకు?

కొత్తపల్లి, వెలుగు : ఆంధ్రా వాళ్లకు తెలంగాణలో ఏం పని అని, వారు ఇక్కడ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారని బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్​ ప్రశ్నించారు. బాగుపడ్డ తెలంగాణను మరోసారి అతలాకుతలం చేసి గరీబ్ రాష్ట్రంగా చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, కమాన్​పూర్, ఎలగందల్, ఆసిఫ్​నగర్, ఖాజీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కల్లాల వద్ద రాజకీయాలు చేయొద్దని, రైతులు సంతోషంగా ఉండడాన్ని చూసిన ప్రతిపక్ష పార్టీలు అన్నదాతలను అల్లకల్లోలం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయని, నవంబర్​చివరి నాటికి జోరందుకుంటాయన్నారు. శుక్రవారం 47 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే, శనివారం 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. ఒక్కరోజులో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పెరగడం రికార్డన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 1800 కొనుగోలు కేంద్రాలు ‌‌ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 10 వేల మంది రైతుల నుంచి 6,100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, కరీంనగర్ జిల్లాలో శనివారం వరకు 1.70 కోట్ల విలువచేసే 8,303 టన్నుల ధాన్యాన్ని సేకరించామని పేర్కొన్నారు. 

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం..

కరీంనగర్‍ సిటీ: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు గొప్ప వరాలని మంత్రి గంగుల అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 142 మంది లబ్ధిదారులకు రూ. కోటీ 42 లక్షల విలువ గల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం అమలు చేయడం లేదన్నారు. గతంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన నారు, కాలిపోయిన మోటార్లు కనిపించేవని, తెలంగాణ వచ్చాక నాణ్యమైన విద్యుత్, నీళ్లు, రైతుబంధు అందిస్తున్నందున రైతులు భూమికి బరువు అయ్యేంత పంటలు పండిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్​శ్యాంప్రసాద్​లాల్, ఎంపీపీలు  శ్రీలత-, లక్ష్మయ్య, ఏఎంసీ చైర్మన్​మధు, మేయర్​సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.