విమాన టికెట్ల రేట్లు ఇష్టమొచ్చినట్లు పెంచకండి.. ప్రభుత్వం వార్నింగ్

విమాన టికెట్ల రేట్లు ఇష్టమొచ్చినట్లు పెంచకండి.. ప్రభుత్వం వార్నింగ్
  • రేట్లతో ప్రజలకు ఇబ్బందులు రావద్దు

న్యూఢిల్లీ: ఒకవైపు విమాన​ టికెట్ల రేట్లను కంట్రోల్​ చేసే ఉద్దేశమేదీ లేదని చెబుతూనే, మరోవైపు టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచొద్దని ఎయిర్​లైన్స్​కు ప్రభుత్వం వార్నింగ్​ ఇచ్చింది. ధరల రేంజ్‌‌లో ఎక్కువ తేడా లేకుండా చూడాలని సూచించింది.  గో ఫస్ట్​ఎయిర్​లైన్స్​ తన విమాన సర్వీసులను రద్దు చేసిన నేపథ్యంలో  ఆ సంస్థ విమానాలు నడిపే  రూట్లలో విమాన టికెట్ల రేట్లు బాగా పెరిగాయి. మరి  కొన్ని రూట్లలోనూ రేట్ల పెరుగుదల కనబడినా, గో ఫస్ట్​ నడిపే రూట్లలో  ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.

ఉదాహరణకు చూస్తే ఢిల్లీ – శ్రీనగర్​, ఢిల్లీ – పుణెల మధ్య విమాన టికెట్ల రేట్లు చుక్కలంటుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత విమానయానం ఇటీవలి నెలల్లోనే జోరందుకుంది. ఇలాంటి టైములో గో ఫస్ట్​ వాలంటరీ ఇన్​సాల్వెన్సీ పిటిషన్​ ఫైల్​ చేసి, సర్వీసులను రద్దు చేయడం వల్ల సీట్లకు కొరత ఏర్పడుతోంది. టికెట్ల రేట్ల నిర్ణయంలో బ్యాలెన్స్​ పాటించాలని ఎయిర్​లైన్స్​ కంపెనీలకు స్పష్టం చేసినట్లు సివిల్​ ఏవియేషన్​ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. అధిక రేట్ల వల్ల పాసింజర్లు ఇబ్బందులు పడే పరిస్థితులు రాకుండా చూడాల్సిందిగా కోరినట్లు పేర్కొన్నారు. ఇదే టైములో ఎయిర్​లైన్స్​ టికెట్ల రేట్లను నియంత్రించే ఆలోచనేదీ ప్రభుత్వానికి  లేదని  కూడా ఆ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు.

జూన్​లో పీక్​ ట్రావెల్​ సీజన్​ మొదలవనున్న నేపథ్యంలో గో ఫస్ట్​ తన సర్వీసులను మళ్లీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందుబాటులోకి తేవడం మేలని ఆయన పేర్కొన్నారు. ఎయిర్​లైన్స్​ సెక్టార్​ను డీరెగ్యులేట్​ చేసినప్పటి నుంచీ విమాన టికెట్ల రేట్లను సూచించడం లేదా వాటిని నియంత్రించడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. గ్లోబల్​గా పాటించే ప్రమాణాల ప్రకారమే మార్కెట్​ ఆధారంగా విమాన టికెట్ల రేట్లను కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. మార్కెట్, డిమాండ్​, సీజనాలిటీతో పాటు, కొన్ని ఇతర మార్కెట్​ పరిస్థితులను బట్టి విమాన కంపెనీలు తమ టికెట్ల రేట్లను ఫిక్స్​చేస్తున్నాయి.