త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలే

త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలే

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో త్రీ ఫేజ్ కరెంట్‌ ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో రైతులకు అస్సలు తెలుస్తలేదు. దీంతో రైతన్నలు మోటర్ల కాడనే కాపలా ఉంటున్నారు. 24 గంటల ఉచిత కరెంట్‌‌ అంటూ గొప్పలకు పోయిన సర్కారు కోతల షెడ్యూల్ ప్రకటించడం లేదు. విద్యుత్‌‌ సంస్థలు టైమింగ్స్‌‌ లేకుండా త్రీఫేజ్‌‌ కరెంట్‌‌ సప్లై చేస్తున్నాయి. కరెంట్‌‌ వస్తే నీటితో తమ పంటలను తడపడానికి పొలాల దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడే ఇట్ల అయితే మార్చి, ఏప్రిల్‌‌లో పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5 లేదా 6 గంటలు 

తెలంగాణ స్టేట్‌ ‌నార్తర్న్ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌‌(టీఎస్‌‌ ఎన్‌‌పీడీసీఎల్‌‌) పరిధిలో ఉమ్మడి వరంగల్‌‌, కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, ఖమ్మం జిల్లాలు, తెలంగాణ స్టేట్‌ సదరన్‌‌ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ ‌(టీఎస్‌‌ ఎస్‌‌పీడీసీఎల్‌‌) పరిధిలో ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, మెదక్‌‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌‌ జిల్లాలలో సాగుకు త్రీ ఫేజ్​కరెంట్‌‌ సప్లయ్‌‌ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగిలో వరి సాగు గణనీయంగా పెరిగింది. దీంతో కరెంటుకు ఒక్కసారిగా డిమాండ్​ మొదలైంది. ఈ క్రమంలో గడిచిన రెండు, మూడు వారాలుగా కరెంట్ కోతలు తీవ్రమయ్యాయి. రైతుల అవసరానికి అనుగుణంగా కరెంట్ సప్లై జరగడం లేదు. చాలా జిల్లాల్లో పొద్దటి పూట 5, 6 గంటలకు మించి సప్లయ్‌‌ కావట్లేదు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ సప్లై చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కోతలను అధికారికంగా ప్రకటించడం లేదు. గతంలో కోతలను అధికారికంగా ప్రకటిస్తే అందుకు అనుగుణంగా ఏఈలు, లైన్​మన్లు వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు త్రీ ఫేజ్‌‌ కరెంట్ సప్లై చేసేవారు. ఆ ప్రకారం రైతులు మోటర్లు ఆన్​చేసి నీళ్లు పారించుకునేవారు. ఇప్పుడు పై నుంచే అంతా ఆపరేట్ చేస్తుండడంతో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్తున్నారు. ఆటోమెటిక్‌‌ స్టార్టర్లను కరెంటోళ్లు పీకేయడంతో పొద్దంతా వ్వయసాయ బోర్లు, బావుల దగ్గరే కాపలా ఉంటున్నారు. జిల్లా, మండలాల వారీగా వాట్సాప్‌ ‌గ్రూపు‌లు క్రియేట్‌‌ చేసి డైలీ ఏ సమయంలో ఏ ఫీడర్‌‌కు కరెంట్‌ ‌ఇవ్వాలి.. ఎప్పుడు బంద్‌ ‌చేయాలి అనే విషయం నేరుగా పైఆఫీసర్లే మెస్సేజ్​ చేస్తున్నారని, మెస్సేజ్ వస్తేనే కరెంట్‌ ‌సప్లయ్‌ ‌చేస్తున్నామని, లేదంటే లేదని ఏఈలు, లైన్‌‌మన్లు వాపోతున్నారు.

కొన్నిచోట్ల అర్ధరాత్రి సప్లై

ఈసారి వ్యవసాయ బావులు, బోర్లు, చెరువుల్లో నీళ్లు ఉండడంతో రైతులు యాసంగిలో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. లక్షలాది ఎకరాల్లో వరి, మక్క, మిర్చి, కూరగాయలు వేశారు. కానీ పంపిణీ సంస్థలు పొద్దటి పూట త్రీఫేజ్ కరెంట్ రోజుకు 5 నుంచి 6 గంటలకే పరిమితం చేశాయి. గడిచిన నాలుగు రోజులుగా నీళ్లు పారిస్తున్నా నా రెండెకరాల మక్కపంట తడవలేదని హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన దుంపల రవీందర్‌‌ తెలిపాడు. రాత్రిపూట పంటకు నీరు పెట్టడానికి పోదామంటే టైమింగ్స్‌‌ ఏంటో తెల్వక వెళ్లలేని పరిస్థితి ఉందని వాపోయాడు. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రంతా 12 గంటల పాటు కరెంట్‌‌ ఇచ్చారు. ఈ విషయం తెల్వక నీళ్లు పారించడానికి రైతులెవ్వరూ పొలాల దగ్గరికి పోలేదు. ఇలా ఏ టైంలో కరెంట్​వస్తదో, ఏ టైంలో పోతదో తెలియక పంటలను కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడ్తున్నారు. మిగితా పనులు అన్నీ బంద్​ పెట్టి బావులు, బోర్ల దగ్గరే ఉంటున్నారు. సర్కారు పొద్దున 5, 6 గంటలు కరెంట్ ఇచ్చినా ఏ టైంలో ఇస్తున్నామో చెప్తే తాము ఆ టైంలోనే నీళ్లు పారించుకొని మిగితా సమయంలో వేరే పనులు చేసుకుంటామని
 వేడుకుంటున్నారు. 

కోతలతో మస్తు తిప్పలైతంది

నాకున్న ఆరెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. కరెంటు కోతలతో మస్తు తిప్పలైతంది. ఒక మడి పారే లోపే ట్రిప్​ అయితాంది. ఆ తర్వాత కరెంట్‌‌ఎప్పుడొస్తదో తెలుస్తలేదు. పొద్దంతా పొలం కాడనే ఉంటున్నా. కరెంటు ఆఫీసర్లను అడిగితే మాకే తెలుస్తలేదు అంటున్నరు.   నాట్లు వేయక ముందే విషయం తెలిస్తే వరి పంట వేసేటోళ్లం కాదు.

– గుజ్జుల రాజు, ములుకలపల్లి రైతు,    

మొగుళ్లపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా