గ్రేటర్​లో తాగునీటికి ఇబ్బంది రానివ్వొద్దు : పొన్నం

గ్రేటర్​లో తాగునీటికి ఇబ్బంది రానివ్వొద్దు : పొన్నం
  •  విద్యుత్ సప్లైలో అంతరాయం లేకుండా చూసుకోవాలి 
  • రంజాన్ నెలలో వాటర్ ట్యాంకర్లు 24 గంటలు తిరిగేందుకు అనుమతించాలి
  • జీహెచ్​ఎంసీలోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు

హైదరాబాద్,వెలుగు: జీహెచ్ఎంసీ​పరిధిలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. తాగునీటికి సంబంధించిన మోటార్లు 24 గంటలు నడిచేలా పవర్ కట్ లేకుండా చూసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎండాకాలంతో పాటు వానాకాలంలోనూ తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలపై మంత్రి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ, మెట్రోవాటర్​బోర్డు,  హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎండాకాలంలో హైదరాబాద్​నగర ప్రజలకు తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని, స్కూళ్లు,  హాస్టళ్లలో వాటర్ ప్రాబ్లం రాకుండా అకడమిక్ ఇయర్  ప్రారంభలోపే అధికారులు చెక్ చేసుకోవాలన్నారు. కృష్ణా, గోదావరి బ్యారేజీలలో నీటి లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. రానున్న రంజాన్ నెలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంకర్లు 24 గంటలు తిరగడానికి పర్మిషన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. మోటార్లకు సంబంధించి ఏమైనా ఆర్థిక ఇబ్బందులుంటే  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.