Good Food : అతిగా తినొద్దు.. నెమ్మదిగా తినండి.. మైండ్ లెస్ ఈటింగ్ వద్దు

Good Food : అతిగా తినొద్దు.. నెమ్మదిగా తినండి.. మైండ్ లెస్ ఈటింగ్ వద్దు

అందరి ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండవు. కొంత మంది ఆకలైతేనే తింటారు. ఇంకొంత మంది టైం టు టైం తినాలనుకొని.. ఆకలిగా లేకపోయినా తినేస్తుంటారు. మరికొంత మంది ఆకలి కాకున్నా... ఏదో ఒకటి అతిగా తింటూనే ఉంటారు. అయితే, ఇలా అతిగా తినడం ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అతిగా తినే అలవాటుని నియంత్రించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేమిటంటే..

ఫుడ్ ప్రెజెంటేషన్ కూడా తినే ఆహారంపై ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా ఎదుట ఉన్న ఆహారాన్ని గమనించి, తగిన పరిమాణంలో తినాలి. పీచుపదార్థాలు, నీరు, ప్రొటీన్లు ఉన్న పదార్థాలను బాగా తినాలి. క్యాలరీలకు దూరంగా ఉండాలి. తినే విధానాన్ని గమనించడంతో పాటు ఆ అంశాలను పుస్తకంలో రాసుకోవాలి. దానివల్ల రోజూ తింటున్న ఆహార పరిమాణం, భోజన సమయాన్ని గమనించుకోవచ్చు. 'ఆకలిగా అనిపించినప్పుడు తిందాం...' అనే ఆలోచన కూడా సరికాదు. రోజులో అప్పుడప్పుడూ పోషకాహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

నెమ్మదిగా తినడం..

టైం చూసుకుని... నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. తినే ఆహారాన్ని బాగా నమలాలి. కనీసం ఇరవై నిమిషాలు తినడానికి కేటాయిస్తే మంచిది. తినే సమయంలో మనసులోకి ఎలాంటి ఆలోచనలు, ఒత్తిళ్లు రాకుండా.. చూసుకోవాలి. దీనివల్ల 'ఎంత తింటున్నాం.... ఏం తింటున్నాం..' అనే ధ్యాస ఉంటుంది. లేదంటే తక్కువగా లేదంటే అతిగా తినే ప్రమాదం ఉంది. పని ధ్యాసలో పడి నాలుగు ముద్దలు గబగబా తినడం.. లాంటిది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ ప్రభావం జీర్ణవ్యవస్థపైనా పడుతుంది. జీవక్రియల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. కంగారులో సరిగా నమలకుండా తినేస్తాం. దానివల్ల తిన్న ఆహారం అరగదు.. అదే బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలు. త్వరగా రక్తంలోకి చేరతాయి. కొంతమంది సమయానికి ఏది అందుబాటులో ఉంటే అది తింటారు. సాధ్యమైనంతవరకు భోజనం సమయంలో కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా భోజన సమయంలో తేడాలు లేకుండా చూసుకోవాలి.

సరిపడా నీళ్లు.. నిద్ర

ప్రతి రోజు పది నుంచి పన్నెండు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఆహారం తినడం తగ్గుతుంది. బాగా నిద్రపోతే కణజాలం బాగుంటుంది. మెదడుపైనా ఒత్తిడి ఉండదు. అదే నిద్ర సరిగా పోకపోతే ఒత్తిడి పెరిగి ఆహారం ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంది. 

తగినంత వ్యాయామం

తీసుకున్న ఆహారానికి తగినంత శ్రమ లేకపోతే శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి, అధిక బరువు, నెలసరి క్రమం తప్పడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అలా అని మితిమీరి వ్యాయామం చేయడం. కూడా మంచిది కాదు. తిన్న ఆహారం, ఆరోగ్యానికి ఎంతమేరకు అవసరమో దానికి తగ్గట్టుగా ఎక్సర్ సైజులు ఉండాలి. ప్రతి రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఎనర్జిటిక్  గా ఉంటుంది.

మైండ్ లెస్ ఈటింగ్

చాలామంది టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఎంత తింటున్నాం. ఏం తింటున్నాం అనే స్పృహ ఉండదు. దీనివల్ల అదనపు క్యాలరీలు లోపలికి వెళ్లిపోతాయి. మనసు అదుపులో లేకుండా తినడం (మైండ్స్ ఈటింగ్) వల్ల తీసుకున్నది కొప్పుగా మారుతుంది. అందుకే తినేప్పుడు టీవీ చూడటం, ఫోన్లు మాట్లాడటం.. లాంటివి మంచిది కాదు.