కరెంటు ఇవ్వొద్దని విద్యుత్​ శాఖకు ఆదేశాలు

కరెంటు ఇవ్వొద్దని విద్యుత్​ శాఖకు ఆదేశాలు
  • ఐటీడీఏ పర్మిషన్ ఇచ్చినా అడ్డుపడుతున్న అటవీశాఖ
  • కరెంటు ఇవ్వొద్దని విద్యుత్​ శాఖకు ఆదేశాలు 
  • పోడు భూముల్లో బోర్లు వేయనివ్వని ఫారెస్ట్​ ఆఫీసర్లు

కొణిజర్ల మండలం విక్రమ్​ నగర్​కు చెందిన బోడ శంకర్​ పేరు మీద ఐదు ఎకరాల పోడు భూమి ఉంది. దీనికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టా కూడా మంజూరు చేసింది. ఈ భూమిలో వ్యవసాయ బోరు వేసుకునేందుకు గిరి వికాస్​ పథకం కింద అప్లై చేసుకోగా, పోడు పట్టా సహా పేపర్లను పరిశీలించిన ఐటీడీఏ ఆఫీసర్లు బోరు మంజూరు చేశారు. అయితే ఫారెస్ట్  ఆఫీసర్లు మాత్రం అటవీశాఖ పరిధిలో ఉందని బోరు వేయనీయకుండా అడ్డుపడుతున్నారు. ఇలా విక్రమ్ నగర్ కు చెందిన 36 మంది రైతులకు 18 వ్యవసాయ బోర్లు మంజూరు కాగా, అన్నింటిదీ ఇదే పరిస్థితి. ప్రభుత్వంలోని ఒక డిపార్ట్ మెంట్ ఇచ్చిన అనుమతులను, మరో డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం, వెలుగు: గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరి వికాస్​ పథకానికి అటవీశాఖ ఆఫీసర్లు బ్రేకులు వేస్తున్నారు. అన్ని పేపర్లు, పట్టాలను పరిశీలించి ఐటీడీఏ అధికారులు మంజూరు చేసిన వ్యవసాయ బోర్లు వేయనీయకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు. తమకు పోడు పట్టాలున్నాయని చెబుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అది తమ శాఖకు చెందిన భూమేనంటూ వాదిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరి వికాస్​ పథకం కింద ఈ ఏడాది రూ.35.58 కోట్లు కేటాయించగా, అందులో ఇప్పటి వరకు రూ.22 కోట్లు ఖర్చు చేశారు. దీని ద్వారా 3,737 మంది రైతులకు చెందిన 10,628 ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 564 మంది లబ్ధిదారులకు చెందిన 1,669 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు రూ.3.61 కోట్లు కేటాయించగా, రూ.2.97 కోట్లు ఖర్చు చేశారు. దీనిలో భాగంగానే కొణిజర్ల మండలం విక్రమ్​నగర్​లో 36 మందికి 18 బోర్లు మంజూరయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆఫీసర్లే బోరు వేసి, మోటారు బిగిస్తారు. ఆ తర్వాత విద్యుత్​ అధికారులు కరెంట్​ కనెక్షన్​ఇస్తారు. అయితే మంజూరైన బోర్లు వేయకుండా అటవీశాఖ ఆఫీసర్లు కొర్రీలు పెడుతుండడంతో పనులు ముందుకు పడడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గతంలో మాదిరిగానే వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. తమ గ్రామ సమీపంలో కొంత మంది కొత్తగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్నా, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్  కింది స్థాయి సిబ్బంది మామూళ్లు తీసుకొని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.  విక్రమ్​నగర్​ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది మంది పోడు రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. తమకు మంజూరైన బోర్లను వేయించి పంటల సాగుకు సహకరించాలని కోరుతున్నారు.

బోరు మంజూరైనా ఉపయోగం లేదు

మా ఊరు విక్రమ్​ నగర్.​ తల్లాడ ఫారెస్ట్ రేంజ్​ పరిధిలోని ఆరికాయలపాడు ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉంది. 4.10 ఎకరాల కు పోడు పట్టాలను ఇచ్చారు. గిరి వికాస్ పథకం​ ద్వారా బోరు మంజూరైంది.​ మూడు నాలుగు నెలల నుంచి బోరు వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం న్యాయం చేయాలి.  

- బోడ లోక్య, విక్రమ్​నగర్