వాంతులు, విరేచనాలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. వాటిని పెద్ద అనారోగ్య సమస్యగా పరిగణించరు. వైద్యులను కూడా ఆశ్రయించకుండా మెడికల్ షాపుకెళ్లి ట్యాబ్లెట్లు తెచ్చుకుని సరిపెడుతుంటారు. అయితే, వేసవి కాలంలో వచ్చే వాంతులు, విరేచనాలను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సమ్మర్లో వాంతులు, విరేచనాలను తేలిగ్గా తీసుకుంటే శరీరం లోపల అవయవాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని.. చివరకు ప్రాణాంతకం కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరీ ఈ పరిస్థితిలో ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
సమ్మర్లో అధిక వేడి, వడగాలుల వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంటుంది. ఈ పరిస్థితిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ల వేగంగా క్షీణిస్తాయి. తద్వారా వాంతులు, విరేచనాల వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. దీనికి వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోకపోతే చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు.
వేడి వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెంది ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, తీవ్రమైన వేడి మన శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, నీరసం వంటివి కలుగుతాయి. నీటితో పాటు శరీరం సోడియం, పొటాషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం, తీవ్రమైన బలహీనత ఏర్పడవచ్చు. మరీ శరీరం డీహైడ్రేషన్కు గురైనట్లు ఎలా గుర్తించాలి..? డీహైడ్రేషన్ లక్షణాలు ఏంటీ..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
డీహైడ్రేషన్ ను ఎలా చెక్ చేసుకోవాలి..?
స్కిన్ టర్గర్ టెస్ట్ ద్వారా.. మీ చేతి వెనుక భాగంలో ఉన్న చర్మాన్ని రెండు వేళ్లతో పట్టుకుని కొంచెం పైకి లాగి వదలండి. చర్మం వెంటనే యథాస్థానానికి వెళ్తే మీరు హైడ్రేటెడ్గా ఉన్నట్లు. చర్మం నెమ్మదిగా వెనక్కి వెళ్తే లేదా అలాగే నిలబడి ఉంటే మీ శరీరంలో నీటి శాతం చాలా తగ్గిందని అర్థం. డీహైడ్రేషన్కు గురైనట్లు గుర్తించాలి.
ALSO READ : ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే స్పెషల్ 'చక్కెర కేళి మిల్క్‌షేక్'..
డీహైడ్రేషన్ ప్రధాన లక్షణాలు
మీరు ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఈ క్రింది మార్పులను గమనించండి.. తీవ్రమైన దాహం, నోరు ఎండిపోవడం, మూత్రం రంగు మారడం, తలతిరగడం, చర్మ పొడిబారిపోవడం, అలసట, నీరసం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.
తీవ్రమైన దాహం: నీళ్లు తాగినా దాహం తీరకపోవడం
నోరు ఎండిపోవడం: నోరు, నాలుక జిగటగా లేదా పొడిగా మారడం.
మూత్రం రంగు మారడం: మూత్రం తక్కువగా రావడం, అది ముదురు పసుపు రంగులో ఉండటం డీహైడ్రేషన్‌కి అతిపెద్ద సంకేతం.
తల తిరగడం లేదా తలనొప్పి: మెదడుకు అందాల్సిన నీరు అందకపోతే తల భారంగా అనిపిస్తుంది.
చర్మం పొడిబారడం: చెమట పట్టడం ఆగిపోయి, చర్మం వేడిగా ఉండటం.
అలసట, నీరసం: ఏ పని చేయలేనంతగా శరీరం సహకరించకపోవడం.
గుండె వేగం పెరగడం: శ్వాస వేగంగా తీసుకోవడం లేదా గుండె కొట్టుకునే వేగం పెరగడం.
తక్షణమే ఏం చేయాలి..?
ఒకవేళ మీరు డీహైడ్రేషన్కు గురైనట్లు అనిపిస్తే.. కేవలం మామూలు నీళ్లు కాకుండా ORS కలిపిన నీటిని తాగండి. కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను తక్షణమే అందిస్తుంది. మజ్జిగ తాగితే శరీర వేడిని తగ్గించి హైడ్రేట్ చేయడానికి ఉత్తమ మార్గం. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి. ఒకవేళ వాంతులు అవుతున్నా, స్పృహ కోల్పోయినట్లు అనిపించినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలి.
