గొర్రెలు వద్దు..పైసలియ్యండి

గొర్రెలు వద్దు..పైసలియ్యండి

ఖానాపూర్, వెలుగు: తమకు బక్కచిక్కిన గొర్రెలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు తమను గొర్రెల కోసం ఆంధ్రాకు తీసుకువెళ్లి పరేషాన్​చేశారని  ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన గొల్ల కురుమలు శుక్రవారం వెటర్నరీ ఆఫీసర్​దీప్తిని నిలదీశారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంక్షేమ సంబరాల కార్యక్రమంలో అధికారులు తమను పరేషాన్​చేశారని బాధలు చెప్పుకున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కింద గ్రామానికి మొత్తం 18 యూనిట్లు మంజూరయ్యాయని, దీనికోసం ఒక్కొక్కరం ఆగస్టు 2022 లో రూ.43 వేల750 డీడీలు కట్టామన్నారు. 

అధికారులు తమను ఆరు రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్ల, నెల్లూరు, నాగర్జున సాగర్ లకు తీసుకువెళ్లారని, అక్కడ బక్క చిక్కిన గొర్రెలను ఎంపిక చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. అధికారులు గొర్రెల ఎంపిక విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని, వారంతా లాడ్జీల్లో రెస్ట్ తీసుకుంటే తాము మాత్రం గొర్రెల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి గాను ఒక్కొక్కరికి రూ.5వేల ఖర్చయ్యిందని చెప్పారు. గొర్రెల కొనుగోళ్లలో అధికారుల తీరు సరిగ్గా లేదని, తమకు గొర్రెలకు బదులుగా డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎమ్మెల్యే  రేఖా నాయక్ కు  ఫిర్యాదు చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమస్యను పరిష్కరిస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు.