త్వరలో డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

త్వరలో డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు పంపిణీ చేస్తారని  కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం దౌదర్ పల్లి దర్గా వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పని చేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కరెంట్, నీటికి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. 

ఇందిరమ్మ ఇండ్లపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఇండ్ల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితర అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల వారీగా సాధించిన ప్రగతిని తెలుసుకున్నారు. 

జిల్లాలో 7 వేల ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటివరకు 1,078 ఇండ్లు బేస్​మెంట్, 3,850 ఇండ్లు మార్క్​అవుట్ దశకు చేరుకున్నాయని చెప్పారు. కొంతమంది అధికారులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ మరికొందరు వెనకబడ్డారన్నారు. లబ్ధిదారుల వివరాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, హౌసింగ్ డీఈ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

డే కేర్ సెంటర్ ను ఆదర్శంగా నిలపాలి

జిల్లాలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. ఈ సెంటర్ ను ఇండియన్ రెడ్​ క్రాస్ సొసైటీ నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. కలెక్టర్ సమక్షంలో జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ ఆఫీసర్ సునంద, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రమేశ్​సంతకాలు చేశారు.

యూరియా స్టాక్​లో తేడా వస్తే చర్యలు

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా సరఫరా చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్ములమ్మ, శివశంకర్ ఆగ్రో ట్రేడర్స్, ఫర్టిలైజర్స్ గోదాంలను ఆయన తనిఖీ చేశారు. స్టాక్ లెక్కల్లో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రైతు వద్ద ఆధార్ కార్డు వివరాలు సేకరించి, ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రి నాయక్ తదితరులున్నారు.