డబుల్​ ఇండ్లు​ అమ్ముకుంటున్రు..

డబుల్​ ఇండ్లు​ అమ్ముకుంటున్రు..
  •     సౌలతులు లేవని విక్రయాలు 

వనపర్తి, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు పొందిన వారు కొందరు చిన్నచిన్న కారణాలు చూపుతూ వాటిని అమ్ముకుంటున్నారు. ఇలా ఇప్పటికే వనపర్తిలో మార్పిడి పేరుతో పదుల సంఖ్యలో ఇండ్లు అమ్ముకున్నట్లు  తెలిసింది. ఓ వైపు నిరుపేదలు ఇల్లు కట్టుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, డబుల్​ ఇల్లు దక్కించుకున్న వారు సౌలతులు లేవని, పట్టణానికి దూరంగా ఉన్నాయని, వాస్తు ప్రకారం కట్టలేదని చెబుతూ వాటిని అమ్ముకోవడం చర్చనీయాంశంగా మారింది.

వనపర్తి జిల్లాకు మొదటి విడతలో 3,860 డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు మంజూరయ్యాయి. అందులో 2,284 ఇండ్లు పూర్తి చేశారు. గత ఏడాది మే నెలలో జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో, పెద్దగూడెం శివారు, రాజపేట శివారు, పీర్లగుట్ట ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లను లక్కీ డిప్​ ద్వారా ఇండ్లను కేటాయించారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకొని రెవెన్యూ ఆఫీసర్లు విచారణ జరిపి అందించారు.

పేదలతో పాటు  జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణలో ఇండ్లు, స్థిరాస్తులు కోల్పోయిన వారికి ఇండ్లను పంపిణీ చేశారు. లక్కీ డిప్​లో ఇండ్లు రాకపోవడంతో తమ అదృష్టం ఇంతేనని కొందరు సర్దుకుపోతే, వచ్చిన వారిలో కొందరు వాటిని అమ్ముకోవడం గమనార్హం. 

సౌలతులు లేవని..

లబ్ధిదారులకు డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు కేటాయించగా, కొందరు ఇల్లు వచ్చిన సంతోషంలో వెంటనే గృహ ప్రవేశాలు చేశారు. అయితే కొన్ని డబుల్​ ఇండ్ల వద్ద తాగునీరు, స్ట్రీట్​లైట్లు ఏర్పాటు చేయలేదు. ఇండ్లలో సౌలతులు సరిగా లేవని కొందరు మార్పులుచేర్పులు చేసుకుంటున్నారు.

కొన్ని ఇండ్లలో ఇంకా కరెంట్​​మీటర్లు పెట్టుకోలేదు. ఇదిలాఉంటే అప్పట్లో బీఆర్ఎస్​ లీడర్లు, ధనవంతులకే ఇండ్లు కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. అర్హులమైనా తమకు ఇండ్లు రాలేదని కొందరు పేదలు ఆందోళనలు కూడా చేశారు.  

ఫ్లోర్​కో రేట్..

జిల్లా కేంద్రం శివారులో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు పొందిన లబ్ధిదారులు బదిలీ పేరుతో అమ్ముతున్నారు. మూడు నెలలుగా వనపర్తిలో ఇండ్ల అమ్మకాలు లోలోపల సాగుతున్నాయి.  కేటాయించిన ఇండ్లను అమ్ముకోవడం, బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిసినా, కొందరు లబ్ధిదారులు తమ అవసరాల నిమిత్తమంటూ కుదువపెట్టినట్లుగా బాండ్​ పేపర్లు రాసుకొని అమ్ముతున్నారు.

ఇండ్లు రాని వారు రాలేదని బాధపడుతుంటే, వచ్చిన వారు చిన్నచిన్న కారణాలు చూపుతూ అమ్ముకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఒక్కో ఫ్లోర్​కి ఒక్కో రేటుచొప్పున అమ్ముకోవడం గమనార్హం. గ్రౌండ్​ ఫ్లోర్​కు రూ.5లక్షలు, ఫస్ట్​ ఫ్లోర్​కు రూ.4లక్షలు, సెకండ్​ ఫ్లోర్​కు రూ.3 లక్షల చొప్పున ధర పెట్టి అమ్ముతున్నారని సమాచారం.

అమ్మినా, కొన్నా చెల్లదు..

అర్హులైన వారికే డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను మంజూరు చేశాం.  ఇండ్లను ఏ రూపంలో అమ్మకున్నా, కొన్నా అవి చెల్లవు. అమ్మినా, కొన్నా నేరమే. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

-  నగేశ్, అడిషనల్​ కలెక్టర్