పరదాలు.. ఫ్లెక్సీల చాటున..   గుడిసెవాసుల బతుకులు

పరదాలు.. ఫ్లెక్సీల చాటున..   గుడిసెవాసుల బతుకులు
  • సీఎం మాటిచ్చినా మారని  దుస్థితి
  • డబుల్​ ఇండ్లు కట్టినా పంపిణీ చేయని లీడర్లు
  • ఓరుగల్లులో డబుల్‍ బెడ్‍రూం లబ్ధిదారుల అవస్థలు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍, హనుమకొండ జిల్లాల్లో వందల డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు నిర్మించి మూన్నాలుగేండ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించలేదు. ఏడాదిన్నర క్రితం మంత్రి కేటీఆర్‍   అర్భాటంగా ప్రారంభించినా ఇప్పటికీ అర్హులకు ఇవ్వలేదు. దీంతో కట్టిన ఇండ్లు నిరుపయోగంగా మారగా.. పేదలు మాత్రం పరదాలు, ఫ్లెక్సీల చాటున తలదాచుకుంటున్నారు. మరోవైపు డబుల్​ ఇండ్ల కాంప్లెక్స్​లలో తుమ్మలు, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. కిటికీలు, తలుపులు ఊడిపోతున్నాయి. అయినా  వాటిని తమకు కేటాయించకపోవడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 

రెండు   జిల్లాల్లో ఇలా..

హనుమకొండ జిల్లాలో రెండు విడతల్లో 4,480 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 4309 ఇండ్లకు అనుమతులు రాగా.. 2 వేలకు డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కేవలం 329 ఇండ్లను మాత్రమే ఆయా చోట్ల ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. గ్రేటర్‍ వరంగల్‍ జిల్లా పరిధిలో మొదటి విడతలో 600 ఇండ్లు, రెండో విడతలో 1500 ఇండ్లు కేటాయించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని చెన్నారంలో స్థల వివాదం కారణంగా పనులకు బ్రేక్‍ పడగా.. మిగతా గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు.  నర్సంపేటలో 1160 మందికి డబుల్‍ ఇండ్లు కట్టనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి హామీ ఇచ్చారు. పనులకు శంకుస్థాపన చేశారు తప్పా.. ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. 

వరంగల్‍ పశ్చిమలో.. ఇండ్లుకట్టి 3 ఏండ్లు

వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంబేడ్కర్‍ కాలనీలో 592 డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు నిర్మించి 3 ఏండ్లు దాటింది. వాటిని లబ్ధిదారులకు కేటాయించట్లేదు. దీంతో సిటీ నడిబొడ్డున ఉండే ఈ ఏరియా కళకళలాడాల్సి ఉండగా చెట్లు, పొదలతో అడవిని తలపిస్తోంది. తూర్పులో ప్రజల ఎదిరి చూపులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేశాయిపేట లక్ష్మి మెగా టౌన్‍షిప్‍ వద్ద 250 డబుల్‍ బెడ్‍రూం ఇండ్లను నిర్మించారు. రెండు నెలల క్రితం కేటీఆర్‍ వీటికి రిబ్బన్‍ కట్‍ చేసినా ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదు.

అర్హులైన పేదలకు ఇండ్లు పంచాలని  అపొజిషన్‍ పార్టీలు పలుమార్లు ధర్నాలకు దిగినా.. ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించినా కనీస స్పందన లేదు. ఈ నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉన్నారు. 100 నుంచి 130 వరకు స్లమ్‍ ఏరియాలు ఉన్నాయి. దాదాపు 1 లక్ష 25 వేల వరకు బీపీఎల్‍ కుటుంబాలు ఉన్నట్లు అధికారులు చెబుతారు. వీరిలో 30 వేల మందికి సొంతిండ్లు లేవు. 15 వేల మందికి పైగా వివిధ ప్రాంతాల్లో గుడిసెల్లో బతుకుతున్నారు. ఈ క్రమంలో 2016లో మొదటి విడత, 2019లో రెండో విడతలో సిటీకి దగ్గర్లోని దూపకుంటలో మొదలు పెట్టిన ఇండ్లు ఇంకా పూర్తి చేయలేదు.

చిరిగిన కవర్లతో గుడిసెలు.. చీరలతో బాత్రూంలు 

2015లో సీఎం కేసీఆర్‍ వరంగల్‍ పర్యటనకు వచ్చారు. శ్రీదేవి ఏషియన్‍ మాల్‍ పక్కనే ఉండే జితేందర్‍ నగర్‍ కాలనీలో తిరిగారు. ఒక్కొక్కరి ఇండ్లకు వెళ్లి డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. దాదాపు 350 నుంచి 400 కుటుంబాల వరకు ఈ ప్రాంతంలోని గుడిసెల్లో ఉండగా.. ఈకాలనీ వాసుల కోసమే అని 592 డబుల్‍ ఇండ్లు నిర్మించారు. నిర్మాణం పూర్తయినా ఇండ్లను ఇవ్వకపోవడంతో వీరికి ఎదురుచూపులు తప్పడం లేదు. కవర్లు, ఫ్లెక్సీలు గుడిసెలపై కప్పుకొని జీవనం సాగిస్తున్నారు.