సిద్దిపేటలో విచిత్రం.. ఆఫీసర్ల తనిఖీల్లో బట్టబయలు

సిద్దిపేటలో విచిత్రం.. ఆఫీసర్ల తనిఖీల్లో బట్టబయలు
  • అనర్హులకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు
  • తాజాగా276 మందికి నోటీసులు
  •  సంజాయిషీ ఇవ్వకుంటే రద్దు చేస్తామంటున్న ఆఫీసర్లు

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రమంతటా డబుల్​బెడ్​రూం ఇండ్ల కోసం పేదలు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండగా, సిద్దిపేటలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ‘కేసీఆర్ నగర్’ ​పేరుతో రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్​బెడ్ రూం ఇండ్లు నిర్మించి, పంపిణీ చేయగా.. చాలామంది లబ్ధిదారులు వాటిని అద్దెకు ఇచ్చారు. మరికొందరు ఆ ఇండ్లకు తాళాలు వేసి, వేరే చోటుకు వెళ్లిపోయారు. ఇటీవల ఆఫీసర్ల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. రాజకీయ నేతల పైరవీల వల్ల అనర్హులకు ఇండ్లు కేటాయించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ సంగతి..

సిద్దిపేట పట్టణంలో ఇండ్లు లేని పేదలకు నర్సాపూర్ పంచాయతీ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 2,460 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. దీనికి కేసీఆర్ నగర్ అని పేరు పెట్టింది. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1950 మందికి వీటిని కేటాయించింది. అర్హులను ఎంపిక చేసే సమయంలో అన్ని రూల్స్ పాటించామని ఆఫీసర్లు చెప్పగా.. లీడర్ల అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలకే కేటాయించారని ఇంకొందరు ఆరోపించారు. మొత్తానికి 1950 ఇండ్లను పంపిణీ చేయగా.. ఆయా ఇండ్లను కొందరు అద్దెకు ఇస్తున్నారని, మరికొందరు తాళాలు వేసుకుని వెళ్లిపోయారని ఇటీవల కలెక్టర్ కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను కలెక్టర్​ ఆదేశించారు. దీంతో వారంతా కేసీఆర్ నగర్​ను జల్లెడ పట్టారు. వచ్చిన కంప్లయింట్లు నిజమని తేల్చారు.

276 మందికి నోటీసులు..

కేసీఆర్ నగర్ లో ఇటీవల జరిపిన సర్వేలో.. కొన్ని ఇండ్లు అద్దెకు ఇవ్వడంతో పాటు మరికొన్ని ఇండ్లు తాళాలు వేసి ఉండడం గమనించారు. మొత్తం 276 మందికి నోటీసులు జారీ చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఎందుకు నివాసం ఉండడం లేదో పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సరైన సమాధానం ఇవ్వని లబ్ధిదారుల ఇండ్లను రద్దు చేసి, అసలైన వారికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డబుల్ బెడ్ రూం ఇండ్లకు తాళాలు వేసిన వాటిలో కొందరు వ్యక్తులు తాళాలు పగలకొట్టి నివాసం ఉంటున్నట్లు కూడా ఆఫీసర్లు గుర్తించారు.

పైరవీలతో అనర్హులకు ఇండ్లు!

కేసీఆర్ నగర్​లోని డబుల్ బెడ్ రూం ఇండ్లను నాలుగు విడతల్లో పంపిణీ చేశారు. మంత్రి హరీశ్​రావు సారథ్యంలో మొదటి విడతలో అసలైన లబ్ధిదారులకే ఇండ్లు దక్కగా.. ఆ తర్వాతి మూడు విడతల్లో మాత్రం టౌన్ కు చెందిన టీఆర్ఎస్ లీడర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఇది నిజమేనని ఆఫీసర్ల సర్వేలో తేటతెల్లమైంది. కేసీఆర్ నగర్ సిద్దిపేటకు దూరం ఉందనే ఉద్దేశంతోనే ఇండ్లు ఖాళీ చేశామని కొందరు సాకులు చెబుతుండగా.. తమకు దక్కిన డబుల్ బెడ్ రూం ఆస్తి రూపంలో పనికొస్తుందని ఇంకొందరు తాళాలు వేసుకుని, తమకు అనువైన ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా.. 276 మంది లబ్ధిదారుల నుంచి సరైన సమాధానం రాకుంటే వాటిని రద్దు చేసే చాన్స్ ఉండగా... సిద్దిపేటలో సుమారు 6‌‌‌‌00 మందికి పైగా పేదలు డబుల్ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు.

సమాధానం ఇవ్వకుంటే ఇండ్లు రద్దు..

కేసీఆర్ నగర్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు రెంట్ కు ఇచ్చినట్లు, తాళం వేసుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి, లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశాం. పది రోజుల్లోపు సరైన కారణాలు చెప్పకుంటే వాటిని రద్దు చేసి, అసలైన వారికి ఇస్తాం. అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తే, వాటిలో నివాసం ఉండకపోవడం కరెక్ట్ కాదు.
- కె.మంజుల రాజనర్సు, మున్సిపల్ చైర్ పర్సన్