పొత్తులు, పోటీపై టీడీపీ నేతల్లో సందిగ్ధత.. నేడు రాజమండ్రికి తెలుగు తమ్ముళ్లు

పొత్తులు, పోటీపై టీడీపీ నేతల్లో సందిగ్ధత.. నేడు రాజమండ్రికి తెలుగు తమ్ముళ్లు
  • నేడు రాజమండ్రికి తెలుగు తమ్ముళ్లు
  • జైలులో ములాఖత్ కోసం ప్రయత్నాలు
  • మూడు రోజుల పాటు అక్కడే ఉండే ఆలోచన
  • బాబు ఓకే అంటేనే అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: టీడీపీ తెలంగాణ నేతల రాజకీయ భవితవ్యం ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేతుల్లో ఉంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నందున టీడీపీ నేతలు పొత్తులు, పోటీపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. దీంతో తమ భవిష్యత్తు ఏంటని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు తెలంగాణ నాయకత్వం బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని రాజమండ్రికి బయలుదేరి వెళ్లనుంది. బుధ, గురు, శుక్రవారం అక్కడే ఉండి చంద్రబాబుతో ములాఖత్ కోసం ప్రయత్నాలు చేయనున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో క్యాండిడేట్ల నుంచి అప్లికేషన్లు తీసుకొని, 87 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ సిద్ధం చేసి, చంద్రబాబు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. మరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడంతో ఇంటింటికి తెలుగుదేశంతో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు, ఇందిరా పార్కు వద్ద ధర్నా ఇలా పలు కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చులు చేసి, తెలంగాణలో పచ్చ జెండా రెపరెపలాడేలా చేయడానికి ప్రయత్నించారు.

బీఫామ్ ట్విస్ట్..

చంద్రబాబు ఓకే చేస్తేనే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్ ఇవ్వనుంది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వాలంటే జైలులో ఉన్న చంద్రబాబు సిగ్నేచర్ అథారిటీ వేరే నేతకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నేత ఏ ఫామ్ ఇస్తేనే తెలంగాణ నాయకత్వం ఇక్కడ పోటీలో దిగే అభ్యర్థులకు బీ ఫామ్ ఇచ్చే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీపై చంద్రబాబు నిర్ణయమే ఇప్పుడు కీలకంగా మారనుంది.

చంద్రబాబుతోనే తేల్చుకునేది..

ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై టీడీపీ వెనకడుగు వేసే అవకాశం ఉందనే సంకేతాలు అందడంతో తెలంగాణ నాయకత్వం ఆందోళనలో పడింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌‌‌‌తో కాకుండా ఏకంగా చంద్రబాబుతోనే సమావేశమై, తమ భవిష్యత్తుపై తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ నాయకత్వం సిద్ధమైంది. బాలకృష్ణ ఇటీవల నిర్వహించిన కీలక నేతల సమావేశంలో ఎన్నికలపై మాట్లాడినా, నాయకులకు మాత్రం కచ్చిమైన భరోసా ఇవ్వలేక పోయారు. ఇప్పటికే ఎన్నికల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి బరిలో లేకపోతే ఎలా అని తెలంగాణ నాయకత్వం కొంత ఆగ్రహంతో ఉంది. ప్రస్తుతం పార్టీ మారే పరిస్థితులు లేకపోవడంతో టీడీపీ నుంచి ఎలాగై నా పోటీలో ఉండేలా బాబుపై ఒత్తిడి తేవడానికి సిద్ధమవుతున్నారు.

వీడని డైలమా..

చంద్రబాబు అరెస్టయిన తర్వాత రాజకీయ సమీకరణలు ఇరు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీలో జనసేననతో జత కట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇటీవల అక్కడ రెండు పార్టీల నాయకత్వం సమావేశం కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కనీసం చర్చించకపోవడం తెలుగు తమ్మళ్లను డైలమాలో పడేసింది. దీనికి తోడు ఇటీవల ఢిల్లీలో అమిత్‌‌‌‌ షాతో లోకేష్ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌‌‌రెడ్డి ఉండడం, హైదరాబాద్‌‌‌‌లో పవన్ కల్యాణ్‌‌‌‌తో కిషన్‌‌‌‌ రెడ్డి, లక్ష్మణ్ సమావేశమై రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉండాలని జనసేనని కోరడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ స్టేట్‌‌‌‌ లీడర్లలో గుబులు పుట్టిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు పార్టీ అధినాయకత్వం స్పందించక పోవడంతో తెలంగాణ నాయకత్వం ఆందోళనలో పడింది. చంద్రబాబు ములాఖత్ లభించి అభ్యర్థులను ఫైనల్‌‌‌‌ చేస్తే గానీ, ఈ డైలమా వీడేలా లేదు.