భీంగల్ ఆర్టీసీ బస్ డిపో పునరుద్ధరణపై నీలినీడలు

భీంగల్ ఆర్టీసీ బస్ డిపో పునరుద్ధరణపై నీలినీడలు

నిజామాబాద్,  వెలుగు : నిజామాబాద్‌ జిల్లా భీంగల్ ఆర్టీసీ బస్ డిపో పునరుద్ధరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. డిపో రీఓపెన్ సమస్యపై రాజకీయ పార్టీలు ఎన్నికల్లో రచ్చ చేస్తున్నా తరువాత ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆర్టీసీ చైర్మన్‌గా, మరో ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి మంత్రిగా ఉండడంతో డిపోపై స్పెషల్‌ ఫోకస్‌ చేస్తారని అంతా భావించారు. కానీ ఎడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ ఊసేలేకపోవడం ఈ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిదేళ్లుగా పట్టించుకుంటలే...

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రవాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 1994లో భీంగల్‌లో బస్ డిపోను ఏర్పాటు చేశారు. ఆరు బస్సులతో  ప్రారంభించి భీంగల్‌ పరిధిలోని 150 గ్రామాలకు బస్సు రవాణా మెరుగుపడింది. కానీ డిపో నష్టాల్లో నడుస్తుందని 2006 ఏప్రిల్4న మూసివేశారు. దీంతో భీంగల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్, కమ్మరపల్లి, మోర్తాడ్ మండలాలతో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీంతో ఇక్కడి వారు ఏ పని ఉన్నా ఆర్మూర్, మోర్తాడ్ గ్రామాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. బస్ కంటే డబుల్ రేటు చార్జీలు చెల్లించాల్సిరావడంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో బస్ డిపో తెరిపిస్తామని హామీ ఇచ్చి గెలిచిన ప్రశాంత్‌రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కానీ 8 ఏళ్లుగా డిపోను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

తెరపైకి రీఓపెన్ ఉద్యమం

బస్ డిపో రీఓపెన్ చేయాలని 16 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా భీంగల్ డిపో పరిధిలో ఆటోలు, ప్రైవేట్ వెహికల్స్​ తిరగకుండా రెండు నెలల పాటు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది కానీ డిపో మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో అప్పటి భీంగల్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాలు, యువకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరించారు. దీంతో ఆఫీసర్లు డిపో తేరుస్తామని హామీతో ఇచ్చి దీక్ష విరమింపచేశారు. కానీ తెరిచిన 24 గంటల్లోనే డిపోను తిరిగి మూసివేశారు. అప్పటి నుంచి బస్ డిపో రీఓపెన్‌కు ఇస్తున్న వినతి పత్రాలు చెత్తబుట్టలకే పరిమితం అయ్యాయి.

హామీలు మరిచారు..

ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడే భీంగల్‌ బస్ డిపోను తెరిపిస్తామని చెబుతున్నారు. తర్వాత దానిని పట్టించుకోవడం లేదు. 150 గ్రామాల ప్రజలు 16 ఏళ్ల నుంచి తిప్పలు పడుతున్నరు. - వాకా శివప్రసాద్, భీంగల్ 

డిపో రీఓపెన్ చేయాలె

భీంగల్ బస్ డిపోను మూసివేసిన నాటి నుంచి రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం. ఆర్టీసీ బస్ సర్వీస్‌ల అవసరంపై ఆఫీసర్లు సర్వే జరపాలి. డిపో రీఓపెన్‌ చేస్తే అందరికీ బాగుంటుంది. - మహిపాల్, భీంగల్‌