కరోనా టెస్టుకు లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్ 

 కరోనా టెస్టుకు లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్ 
  • పాజిటివ్ వస్తే తిరిగి చెల్లిస్తానంటూ వసూలు చేసిన డాక్టర్ క్రాంతి కుమార్ 

సూర్యాపేట: పెన్ పహాడ్ మండల కేంరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టుకు 500 రూపాయలు వసూలు చేస్తున్న డాక్టర్ క్రాంతి కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారు టెస్టుల కోసం వస్తే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ క్రాంతి కుమార్ 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. ఒక వేళ పాజిటివ్ వస్తే తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నాడు. నెగటివ్ వస్తే మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. దీనిపై కొందరు రోగులు వాగ్వాదం చేసి.. సదరు వీడియోను ఉన్నతాధికారులకు పంపారు. 
వీ6 న్యూస్ లో వార్త చూసి వెంటనే విచారణ.. ఆపై సప్పెన్షన్ ప్రకటన
కరోనా టెస్టుకోసం వచ్చే వారి నుండి 500 రూపాయలను వసూలు చేస్తున్నట్లు వీ6 న్యూస్ ఛానెల్ లో వచ్చిన వార్తకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం హుటాహుటిన సందర్శించి స్వయంగా విచారణ జరిపారు. ఈ విచారణలో డాక్టర్ క్రాంతి కుమార్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని నిర్ధారణ కావడంతో క్రాంతి కుమార్ ను విధులనుండి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ కోటాచలం ప్రకటించారు.