80 ఫేక్ సరోగసీలు..చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌‌‌‌తో లింకులు!

80 ఫేక్ సరోగసీలు..చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌‌‌‌తో లింకులు!

 

  • సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో అంగీకరించిన డాక్టర్​ నమత్ర 
  • కస్టడీ విచారణ పూర్తి.. చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలింపు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ సృష్టి టెస్ట్​ట్యూబ్​సెంటర్​ కేంద్రంగా చైల్డ్​ట్రాఫికింగ్, సరోగసీ మోసాల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న  డాక్టర్ నమ్రత పోలీసు కస్టడీ విచారణ పూర్తయింది. కోర్టు ఇచ్చిన ఐదు రోజుల కస్టడీ గడువు మంగళవారంతో ముగియగా..ఆమెను  గాంధీ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి, అక్కడి నుంచి చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు. 5 రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు నమ్రత నుంచి అనేక కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. దాదాపు 80 ఫేక్​ సరోగసీలు చేసినట్లు డాక్టర్​ నమ్రత అంగీకరించినట్లు సమాచారం.

ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఏ-3 గా ఉన్న కల్యాణితో పాటు ఏ-6 సంతోషిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల గోపాలపురం పోలీస్ స్టేషన్ లో బాధితుల సంఖ్య పెరగడంతో కేసులు నమోదు చేసిన పోలీసులు.. సృష్టి కేసు వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తుల పాత్రను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి కేసులో మరింత దర్యాప్తు అవసరమని భావిస్తున్న పోలీసులు లోతైన విచారణ జరిపేందుకు నమ్రత విషయంలో మరోసారి కస్టడీకి అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

కీలక విషయాలు వెలుగులోకి...

నమ్రత 5 రోజుల కస్టడీలో  కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం.  పిల్లల్ని అమ్మే గ్యాంగులతో లింకులు పెట్టుకున్న డాక్టర్ నమ్రత.. అనేక దారుణాలకు పాల్పడినట్లు గుర్తించారు. అస్సాం, బిహార్,  మహారాష్ట్ర, రాజస్థాన్, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన చైల్డ్​ ట్రాఫికింగ్​ గ్యాంగ్స్‌‌‌‌తో నమ్రతకు లింకులు ఉన్నట్లు తెలిసింది.  పిల్లల్ని కొని అమ్ముతున్న నందిని, హర్ష, పవన్‌‌‌‌తో  సంబంధాలు ఉన్నాయి.  

గతంలోనూ పిల్లల్ని అమ్ముతూ అరెస్టయిన నందిని, హర్ష, పవన్ నుంచి ఒక్కొక్క శిశువుకు  రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇచ్చి డాక్టర్​ నమ్రత కొనుగోలు చేసినట్లు సమాచారం.  ఐవీఎఫ్​కోసం వచ్చే దంపతులను సరోగోసీ వైపు మళ్లించిన  నమ్రత అనేక ​అక్రమాలకు పాల్పడింది.   హైదరాబాద్‌‌‌‌లో మరో 4 సెంటర్లు కూడా పిల్లల్ని అమ్మినట్టు గుర్తించారు. ఇందులో పెట్టి కేర్, హెడ్జ్, ఒయాసిస్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లకు పిల్లల  అమ్మకాలను సాగించారు.  హైదరాబాద్, సికింద్రాబాద్‌‌‌‌లో ఉన్న పలు ఫెర్టిలిటీ సెంటర్లతో గ్యాంగుకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.