విదేశీ మంత్రి సమర్థతే దేశానికి భద్రత

విదేశీ మంత్రి సమర్థతే దేశానికి భద్రత

దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అంటే,  ఇద్దరు మంత్రుల నియామక విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలి.  వారిలో ఒకరు విదేశాంగ మంత్రి,  మరొకరు ఆర్థిక మంత్రి. వారిద్దరూ సమర్ధవంతులైతే దేశం ఖచ్చితంగా తన సవాళ్లను ఎదుర్కోగలుగుతుంది. ఖచ్చితమైన ఆర్థిక విధానాలతో పాటు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు దృఢంగా ఉంటేనే ఆ దేశ సరిహద్దుల పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ విధానాన్ని అనుసరిస్తూ 2019లో రిటైర్డ్‌‌ ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారి జైశంకర్‌‌‌‌కు విదేశాంగ మంత్రి పదవి ఇచ్చి   మెరుగైన మన విదేశీ నీతికి ప్రధాని మోడీ  ఊతమిచ్చారు. పదవి చేపట్టాక జై శంకర్‌‌‌‌ ఎదుర్కొన్న సవాళ్లు ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయి.‘యుద్ధానికి వెళ్లకుండానే యుద్ధాన్ని గెలవడం’ అనే సూత్రానికి  నిదర్శనంగా జై శంకర్‌‌‌‌ తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు ఫలించి దేశం అనేక సవాళ్లను పటిష్టంగా ఎదుర్కొన్నది. ఆయన పదవిలోకి వచ్చేటప్పటకి మన సరిహద్దు భూతమైన చైనా బలగాలు  ఎంతటి అలజడి సృష్టించాయో తెలియని విషయం కాదు.

దౌత్య నీతిలో దిట్ట

2020లో లడఖ్‌‌పై చైనా దాడి సంక్షోభాన్ని జై శంకర్ ఎదుర్కోవలసి వచ్చింది. చైనా 1989లో సంతకం చేసిన అన్ని శాంతి ఒప్పందాలను,  వాటితో ఏర్పడ్డ శాంతిని విచ్ఛిన్నం చేసింది. ఈ చర్యతో కాశ్మీర్‌‌ భూభాగాన్ని లాక్కోవడానికి చైనా పాకిస్థాన్‌‌తో కుమ్మక్కయ్యిందని స్పష్టమైంది. అయితే ఈ రెండు దేశాల పన్నాగాలను జైశంకర్​ తన దౌత్యనీతితో ఎదుర్కొన్నారు. మనదేశం కంటే చైనా సైనిక పరంగా బలంగా ఉంటుందని, యుద్ధంలో ఓడిపోయే అవకాశం ఉందని కూడా ఆయనకు తెలుసు, అయినా తెలివిగా, ఏ మాత్రం భయం లేకుండా మేం పోరాటానికి సిద్ధమని మెసేజ్‌‌ పంపడంలోనే ఆయన దౌత్యనీతి అర్థమవుతోంది. చైనాను నిలువరించేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, అనేక యూరోపియన్ దేశాలు, జపాన్‌‌తో  భారత్‌‌ ఒప్పందం కుదుర్చుకుంది. దౌత్యపరంగా ఇండియా ఇంత వేగంగా ముందుకు వెళ్తుందని చైనా ఎప్పుడూ అనుకొని ఉండదు. కానీ  ఇది చైనాకు షాక్ గా మారింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు అందరూ  ఇండియా, ఉక్రెయిన్ వైపే నిలబడుతుంది అనుకున్నారు. కానీ రష్యాతో మనకు ఉండే మిత్రత్వం కారణంగా తటస్థ వైఖరిని అవలంబించింది. కానీ చెప్పలేం, రష్యా ప్రమాదకరమైన శత్రువుగా మారవచ్చు మన సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌‌లతో కలిసి ముఠాగా మారవచ్చు. కాబట్టి రష్యాను శత్రువుగా మార్చుకోకుండా , చైనా , పాకిస్థాన్​ల వ్యూహానికి జైశంకర్​ చెక్​ పెట్టారని చెప్పాలి.

ప్రపంచ చరిత్రలో అనేకులు..

ప్రపంచంలోని గొప్ప విదేశాంగ మంత్రుల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే మనదేశంలో 10వ శతాబ్దానికి చెందిన చాణక్య, చోళ చక్రవర్తి రాజుల పాలన వరకే  గొప్ప రాజనీతిజ్ఞులు ఉన్నారు. ఆస్ట్రియా దేశానికి 1809–1848 వరకూ ఉన్న మెట్టెర్నిచ్‌‌ విదేశాంగ విధానంలో దేశం ఎంతో పటిష్టంగా ఉండేది. అలాగే 1789 నుంచి 1838 వరకు ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి నాయకత్వం వహించిన  ఫ్రెంచ్ స్టేట్స్‌‌మన్ చార్లెస్ టాలీరాండ్ ఈ లిస్ట్‌‌లో ఉన్నారు. తర్వాత చౌ ఎన్ లై  చైనా పీఎం 1949 నుంచి 1976 వరకు చైనాకు నాయకత్వం వహించారు. రష్యాకు చెందిన ఆండ్రీ గ్రోమికో 1957- –85 వరకు రష్యన్ విదేశాంగ విధానానికి నాయకత్వం వహించారు. ఇండోనేషియాకు చెందిన ఆడమ్ మాలిక్ 1949- –1989 వరకు విదేశాంగ విధానాన్ని నియంత్రించారు. పోర్చుగల్‌‌కు చెందిన ఆంటోనియా సలాజర్ 1928–68 నుంచి పోర్చుగీస్ విదేశాంగ విధానానికి నాయకత్వం వహించారు. భుట్టో 1963-–1979 వరకూ పాకిస్తాన్ విదేశాంగ విధానానికి నాయకత్వం వహించారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఇతర దేశాల్లో వారి పదవీ బాధ్యతలు నెరవేర్చడానికి వారు చాలా కాలం పాటు పదవుల్లో కొనసాగే వారు. కానీ మనదేశంలో, విదేశాంగ మంత్రులకు గరిష్టంగా 5 ఏండ్లు,   లేదా ప్రధానమంత్రి ఇష్టపడకపోతే వెంటనే పదవిని నుంచి తొలగిపోవాల్సి వస్తుంది. అందుకే వారు తమ విదేశీ సహచరుల వలె ఎదగలేరు. ప్రభుత్వాలు మారినా  తమ సమర్థ దౌత్యనీతి కోసం సమర్థ విదేశాంగ మంత్రులను ఎంత కాలమైనా కొనసాగించుకున్నారు.  ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి టాలీరాండ్ 50 సంవత్సరాల పాటు 5 ప్రభుత్వాలకు పనిచేశారు.
కాంగ్రెస్‌‌ హయాంలో ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారులు నట్వర్‌‌సింగ్‌‌, మణిశంకర్‌‌ అయ్యర్‌‌ మంత్రులుగా ఉండి విఫలమయ్యారు. అదేవిధంగా, చాలా మంది ఐఏఎస్ అధికారులు మంత్రులు లేదా రాజకీయ నాయకులకు సన్నిహిత సలహాదారులు అవుతారు. అయినప్పటికీ, వారి సహకారం శూన్యం. సాధారణంగా వారు తమ రాజకీయ నాయకులను చెడు సలహాల ద్వారా నాశనం చేస్తారు.
 మన్మోహన్ సింగ్ లేదా జై శంకర్ వంటి గొప్ప మంత్రిగా ఉండాలంటే, నాలెడ్జ్‌‌ అవసరమే, కానీ అంతకంటే ముఖ్యమైంది దౌత్యనీతి ఉండాలి, మన్మోహన్ సింగ్,  జై శంకర్ ఇద్దరూ తెలివితేటలు ప్రదర్శించడంలో ప్రతిభావంతులు. జైశంకర్ వంటి విజయవంతమైన విదేశాంగ మంత్రులు లేదా మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక మంత్రులు ఎక్కువ కాలం పదవీకాలం ఉండేలా మనదేశం నిర్ధారించుకోవాలి.

ఒక విదేశాంగ మంత్రి సుదీర్ఘకాలం ఉద్యోగంలో ఉన్నప్పుడు, అతను ఇతర ప్రభుత్వాల గురించి సరైన సమాచారాన్ని రాబట్టగలిగే నేర్పు సంపాదిస్తాడు. అయితే  జై శంకర్ చాలా మంచి విదేశాంగ మంత్రి కావచ్చు. కానీ మన సంప్రదాయాల్లో ప్రభుత్వం మారినప్పుడు అలాంటి మంత్రులను తొలగిస్తారు. 1991-–96 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్‌‌ను 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు తొలగించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, దీర్ఘకాలం పాటు కొనసాగడానికి మనకు మంచి విదేశాంగ మంత్రులు ఉండాలి. భారతదేశానికి ప్రధాన శత్రువు అయిన చైనాలో, అదే వ్యక్తులు దశాబ్దాలుగా విదేశాంగ విధానాన్ని రూపొందించారు. పాకిస్తాన్‌‌లో, ఐఎస్‌‌ఐ (పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) విదేశాంగ విధానంపై ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాగే వారి అధికారులు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. - డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​​