న్యాయం కోసం మున్సిపల్ ఆఫీస్ ఎదుట బాధితుల దీక్ష

న్యాయం కోసం మున్సిపల్ ఆఫీస్ ఎదుట బాధితుల దీక్ష

కామారెడ్డి , వెలుగు: జిల్లా కేంద్రం కామారెడ్డిలో కొత్త మాస్టర్​ప్లాన్ ముసాయిదా రగడ మొదలైంది. విలీన గ్రామాల్లోని రైతులతో ఎలాంటి సంప్రతింపులు చేయకుండా1200 ఎకరాలను ఇండస్ర్టియల్ జోన్ గా ప్రతిపాదించడంతో బాధితులు రోడ్డెక్కారు. ఆయా గ్రామాలకు చెందిన వందలాది రైతులు ‘ఐక్య కార్య చరణ కమిటీ’ ఆధ్వర్యంలో శుక్రవారం  మున్సిపల్​ ఆఫీసుకు తరలివచ్చి నిరసన దీక్షలు చేపట్టారు.

తమ అనుమతి లేకుండా పచ్చని పంట భూములను  ఇండ స్ర్టియల్​ జోన్​గా ఎలా చూపుతారని, దీని వల్ల తమ  భూముల విలువ పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్​లో ఇండ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని, వెంటనే ఇండస్ట్రియల్​ జోన్​ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. 

ఇదీ మాస్టర్​ ప్లాన్.. 

రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్​ మాస్టర్​ ప్లాన్ ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారుచేయించారు.  కామారెడ్డి టౌన్​తో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్​, టెకిర్యాల్​, ఇల్చిపూర్​, దేవునిపల్లి, లింగాపూర్​, సరంపల్లి,  పాతరాజంపేట,  రామేశ్వర్​పల్లిని కలుపుకొని  61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్​ ప్లాన్​ముసాయిదా రెడీ చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ర్టియల్, గ్రీన్​, కమర్షియల్​, రెసిడెన్సియల్​జోన్లుగా విభజించి, ఆ వివరాలను ఈమధ్యే రిలీజ్​చేశారు. 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు.

ఇండస్ట్రియల్​జోన్​కోసం 8.5 శాతం(1200 ఎకరాలు) ప్రతిపాదించారు.  ఇందులో నేషనల్​ హైవే పక్కన  పచ్చని పంటలు పండే  అడ్లూర్​, ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి రైతులను చెందిన900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్​కు పనికిరావని చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్​ పడిపోయింది. భవిష్యత్​లోనూ ఇండస్ర్టియల్​ జోన్​లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్​రాదని,  నిర్మాణాలకు   బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని రైతులు ఆందోలన చెందుతున్నారు. మరోవైపు కామారెడ్డి టౌన్​లో జనాభాకు  అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టని ఆఫీసర్లు, విలీన గ్రామాలైన  లింగాపూర్​, దేవునిపల్లి, టెకిర్యాల్ లో మాత్రం మూడు100 ఫీట్ల  రోడ్లను ప్రతిపాదించారు.  వీటిని రూలింగ్​పార్టీ లీడర్లు చేసిన వెంచర్లకు అనుకూలంగా ఉండేలా ఏకపక్షంగా ప్రపోజ్​చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

దీంతో విలీన గ్రామాల రైతులు ఐక్య కార్యచరణ కమిటీగా  ఏర్పడి ఇప్పటికే 300కు పైగా అభ్యంతరాలు అందజేశారు. కలెక్టరేట్​, మున్సిపల్​ ఆఫీసుల ఎదుట ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ఇంటిని ముట్టడించారు.  ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం  నుంచి   మున్సిపల్​ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. తొలిరోజు వందల మంది రైతులు వచ్చి, తమ డిమాండ్లు వినిపించారు.  బీజీపీ నియోజక వర్గ ఇన్​చార్జీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి,  డీసీసీ ప్రసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు తదితరలు  శిబిరాన్ని సందర్శించి  మద్దతు తెలిపారు.

మా భూములు ఎవరు కొంటరు?

నాకు నలుగురు పిల్లలు. నాలుగున్నర ఎకరాల​ వ్యవసాయ భూమి ఉంది.  టౌన్​లో కలిపితే భూమి విలువ పెరుగుతుందని ఆశపడ్డ. కానీ నా భూమిని ఇప్పుడు ఇండస్ర్టియల్​ జోన్​లో చూపుతున్నరు.   రేపొద్దున అవసరాలకు ఓ గుంట భూమి అమ్ముకుందామన్నా ఎవరు కొంటరు. ఇట్లయితే మేం బతికేదెట్ల?  గిన్నెలు సర్దుకొని  నెత్తిమీద పెట్టుకొని ఊరు వదిలి పోవుడే అయితెట్టుంది. – లోలపు లింగం, అడ్లూర్

మమ్ముల అడగకుండనే 100 ఫీట్ల రోడ్లకు ప్రపోజల్​

మా ఊరు మున్సిపాల్టీలో విలీనమైంది. మమ్మల్ని అడగకుండానే  మా భూముల్లో 100 ఫీట్ల రోడ్లను వేయనున్నట్లు మాస్టర్​ ప్లాన్​లో చూపిన్రు.  ప్రజలు తిరిగే కామారెడ్డిలోని 80 ఫీట్ల రోడ్డును 60కి కుదిస్తరట. కానీ మా దగ్గర మాత్రం 100 ఫీట్లు తీస్తరట. గింత అన్యాయం ఉంటదా?  – రాజేందర్​, లింగాపూర్