గ్రేటర్​లో కొనసాగని నాలాల పూడికతీత పనులు

గ్రేటర్​లో కొనసాగని నాలాల పూడికతీత పనులు
  • ఎక్కడికక్కడ పేరుకుపోతున్న మట్టి, చెత్త
  • మొక్కలు, చెట్లు పెరగడంతో ముందుకు సాగని మురుగు
  • రెండేళ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇదీ పరిస్థితి
  • ఏడాదంతా పనులు చేస్తామన్న మంత్రుల మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావట్లే

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో నాలాల పూడికతీత పనులు కొనసాగట్లేదు. వానా కాలంలో నాలాలు పొంగిపొర్లి కాలనీలు మునుగుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వరదల టైంలో అలా చేస్తాం.. ఇలా చేస్తాం.. అని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పి తర్వాత గాలికి వదిలేశారు. రెండేళ్లుగా నాలాల క్లీనింగ్​అరకొరగానే సాగుతోంది. చాలాచోట్ల చెత్త, మట్టితో నిండిపోయి కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలు, చెట్లు ఏపుగా పెరగడంతో మురుగు ముందుకు కదలట్లేదు. పూడికతీత నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఎక్కడా పనులు జరగడం లేదు. నాలాల నిర్మాణంపై ఫోకస్ పెట్టామంటూ పూడికతీతను పూర్తిగా పక్కన పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు వెయ్యి కిలో మీట‌‌‌‌ర్ల మేర వాన నీటి కాలువలు ఉన్నాయి. ఇందులో మేజ‌‌‌‌ర్ నాలాలు 398 కిలోమీట‌‌‌‌ర్లు, పైప్​లైన్ డ్రైన్లు, చిన్న సైజు కాలువలు 600 కిలోమీట‌‌‌‌ర్లకు పైగా ఉన్నాయి. వీటిలో పూడికతీత కోసం బల్దియా ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కిందటేడు నాలాల్లో పూడిక తీయడంలో నిర్లక్ష్యం వహించారని కమిషనర్​38మంది అధికారుల జీతాల్లో కోత విధించారు. 2021లో రూ.44 కోట్లతో నాలాల్లో పూడిక తీశామని అధికారులు చెప్పగా, సగానికిపైగా నాలాల్లో పూడికతీత పనులు చేయలేదని విజిలెన్స్​అధికారులు గుర్తించారు. చర్యల్లో భాగంగా ఇటీవల15 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అడుగడుగునా నిర్లక్ష్యమే

నాలాల పూడిక తీత పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. అన్ని నాలాల్లో కలిపి పూడిక 5 ల‌‌‌‌క్షల క్యూబిక్ మీటర్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. గతంలో ఏటా జనవరి తర్వాత పనులు మొదలుపెట్టేవారు. కానీ రెండేళ్లుగా పెద్దగా చేయకపోవడంతో ఎక్కడ చూసినా పూడికే కనిపిస్తోంది. టోలిచౌకి, బంజారాహిల్స్, అంబర్ పేట, లంగర్ హౌస్ ఇలా చాలాచోట్ల నాలాలు పూర్తిగా చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. వరద నీరు వెళ్లే దారి కనిపించడం లేదు. ఎప్పుడో నిర్మించిన పురాతన నాలాల పరిస్థితిని అధికారులు పరిశీలించడం లేదు. చాలాచోట్ల కింగి పోయి ఉన్నాయి. గతేడాది గోషామహల్ లో ఉన్నట్టుండి నాలా కుంగిపోవడానికి ఇదే కారణం. హిమాయత్ నగర్​లోనూ ఇలాగే ఓ డ్రైనేజీ లైన్ కుంగిపోయింది. సర్కిళ్లు, జోన్ల వారీగా పురాతన నాలాలను గుర్తించి రిపేర్లు చేయాలని, అవసరమైన చోట కొత్తవి నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్నేండ్లుగా ఇక్కడ పూడిక తీయట్లే

సిటీలో ఎక్కడెక్కడ, ఎన్ని నాలాలు ఉన్నాయో జీహెచ్ఎంసీ అధికారులకు తెలుసా. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని బస్టాపు పక్కన నిలబడలేకపోతున్నాం. ఏండ్లుగా నాలాల్లో పూడిక తీయట్లేదు. క్షేత్రస్థాయిలో పనులు చేయకపోతే ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నాలాల్లో పూర్తిగా చెత్త, మట్టి పేరుకుపోవడంతో మొక్కలు మొలుస్తున్నాయి. మురుగు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఫలితంగా వర్షాలు కురిసిన టైంలో వరద రోడ్డెక్కుతోంది. 

-  మహేశ్, బంజారాహిల్స్