55 రోజులు వర్షపు నీళ్లే తాగి బతికారు

55 రోజులు వర్షపు నీళ్లే తాగి బతికారు

చెన్నై: మనుగడ సాగించడానికి ఏటికైనా ఎదురీదాల్సిందేనని పెద్దలు అంటుంటారు. ఈ మత్స్యకారుల గురించి వింటే అది నిజమేననిపిస్తోంది. తమిళనాడుకు చెందిన 9 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు. దాదాపు 55 రోజుల పాటు సముద్రంలోనే ఇరుక్కున్నారు. తాగడానికి నీళ్లు లేకపోవడంతో వర్షపు నీళ్లను తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నారు.

‘మా సముద్రయానంలో నాలుగో రోజు పడవ బ్యాటరీ మెళ్లిగా నడవడం మొదలైంది. సాయం కోసం దగ్గర్లోని బోట్లను సంప్రదించడానికి యత్నించాం. వాళ్లు చెప్పింది ట్రాన్స్‌‌మీటర్ ద్వారా విన్నాం. కానీ మేం చెప్పింది మాత్రం వారికి వినబడలేదు. దీంతో మాకు ఎలాంటి దారి లేకపోయింది. అయితే గాలి వీస్తున్న దిశలో ప్రయాణాన్ని మొదలుపెట్టాం. రోజులు గడుస్తున్న కొద్దీ మేం బతుకుతామన్న ఆశను కోల్పోయాం. అందరమూ చనిపోతామనే అనుకున్నాం. నీళ్లలోని చేపలను పట్టుకొని ఎలాగోలా వండుకొని తిన్నాం. మా దగ్గర తాగడానికి నీళ్లు కూడా లేవు. దీంతో వర్షపు నీళ్లనే తాగాం. ఆకలి మమ్మల్ని చంపేయసాగింది. దీంతోపాటు గమ్యంపై స్పష్టత లేకపోవడంతో ఏమీ తోచలేదు. మా కుటుంబాల గురించి ఆలోచించుకొని ఏడ్వసాగాం. నా భార్య గర్భిణి. ఆమె గురించి చాలా దిగులుపడ్డా’ అని సదరు బోటులో ప్రయాణించిన దేసపన్ అనే ఫిషర్‌‌మెన్ చెప్పాడు. వీళ్ల పడవను గుర్తించిన మయన్మార్ సర్కార్ భారత ఎంబసీకి ఈ విషయాన్ని తెలియజేసింది. మత్స్యకారులకు భోజనాన్ని అందజేసింది. దేసపన్‌‌తోపాటు మరో 7 మంది మత్స్యకారులు అక్టోబర్ 8న చెన్నైకి తిరిగొచ్చారు. వీరిలో ఒకరు మాత్రం సముద్రంలో తప్పిపోయాడు.