డిసెంబర్ 20న.. భూదాన్​ పోచంపల్లికి రానున్న ద్రౌపతిముర్ము

డిసెంబర్  20న.. భూదాన్​ పోచంపల్లికి రానున్న ద్రౌపతిముర్ము
  • యాదాద్రికి రాష్ట్రపతి
  •  నేత కార్మికులతో సమావేశం

యాదాద్రి, భూదాన్​ పోచంపల్లి, వెలుగు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు.  శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 18న హైదరాబాద్ కు రాష్ట్రపతి  వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇక్కత్ చీరలు, దేశంలో భూదానోద్యమానికి మూలమై, రెండేండ్ల క్రితం బెస్ట్​ టూరిజం విలేజ్​గా ఎంపికైన భూదాన్  పోచంపల్లిని సందర్శించబోతున్నారు.

పోచంపల్లికి వస్తున్న రాష్ట్రపతి ముర్ము గంటపాటు ఇక్కడే ఉండి చేనేత కళాకారులతో సమావేశం అవుతారు. వారి ప్రతిభతో పాటు ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని  వారితో ముచ్చటిస్తారు.  పద్మశ్రీ, సంత్ కబీర్ వంటి జాతీయ అవార్డుల గ్రహితలతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతారు.  ఇందుకోసం అధికారులు ఉమ్మడి నల్గొండలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. 

థీమ్‌‌ పెవిలియన్ ఏర్పాటు
అధికారులు తెలంగాణ చేనేతల ఔన్నత్యం ప్రతిబించే విధంగా థీమ్ పెవిలియన్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. అందులో పోచంపల్లి ఇక్కత్ చీరలు, పుట్టపాక తెలియా రుమాల్, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు , సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరల తో  ప్రత్యేక  స్టాళ్లను రెడీ చేస్తున్నారు.

వీటితోపాటు మరమగ్గాల ప్రదర్శన కూడా ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు. రాష్ట్రపతి పర్యటనను ఏర్పాట్లను కలెక్టర్​ హనుమంతు జెండగే, అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కర్​రావు, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. కాగా, గతేడాది డిసెంబర్​ 30న జిల్లాలోని యాదగిరిగుట్టకు వచ్చి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు.