యూత్​కి డ్రీమ్​ బైక్​!

యూత్​కి డ్రీమ్​ బైక్​!

రాయల్​ ఎన్​ఫీల్డ్​ అంటే..ఇండియన్​ యూత్​కి బైక్​ మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్​. అందుకే చాలామంది యువకులు ఆ బైక్​ కొనడమే గోల్​గా పెట్టుకుంటారు. అంతెందుకు దాని సైలన్సర్​ నుంచి వచ్చే ‘డుగ్​.. డుగ్​​.. డుగ్​​..’ సౌండ్​కి కూడా ఎంతో మంది ఫ్యాన్స్​ ఉన్నారు. ఈ సౌండ్​ కోసమే దీన్ని కొనేవాళ్లు లేకపోలేదు. మౌంటెన్​ రైడర్ల నుంచి పల్లెల్లో మట్టి రోడ్డు మీద బైక్​లు నడిపేవాళ్ల వరకు ఎంతోమందికి ఇది డ్రీమ్​ బైక్​. ఇండియన్స్​ని ఇంతలా ఆకట్టుకున్న ఈ బైక్​ కంపెనీ ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయింది. ఆ పరిస్థితుల నుంచి రాయల్​ ఎన్​ఫీల్డ్​ని ఎవరెస్ట్​ అంత ఎత్తుకు ఎక్కించాడు ఆ కంపెనీ సీఈవో సిద్ధార్థ్​ లాల్​. 

వరల్డ్​ ఫేమస్​ ఇండియన్​ బైక్​గా రాయల్​ ఎన్​ఫీల్డ్​కి పేరుంది. కానీ.. వాస్తవానికి ఇది ఒకప్పుడు ఇండియాకు చెందింది​ కాదు. ప్రస్తుతం ఇది ఐషర్ మోటార్స్​లో భాగంగా ఉంది. బాబ్ వాకర్ స్మిత్, ఆల్బర్ట్ ఈడీ ఇంగ్లాండ్​లో సూదులు తయారుచేసే కంపెనీని నడిపేవాళ్లు. వీళ్లు 1893లో రాయల్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎన్‌ఫీల్డ్‌ అనే కంపెనీకి సైకిళ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్​ దక్కించుకున్నారు. దాంతో సూదులు తయారు చేయడం ఆపేసి తమ ఫ్యాక్టరీ పేరుని ‘ఎన్‌ఫీల్డ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌’గా మార్చారు. ‘ఎన్​ఫీల్డ్’ పేరుతో సైకిల్‌ తయారు చేసి మార్కెట్​ చేశారు. ఆ తర్వాత ఏడాదే వాళ్ల సైకిళ్ల పేరును ‘రాయల్ ఎన్‌ఫీల్డ్‌‌‌’గా మార్చారు. తర్వాత1900లో మొట్టమొదటి మోటరైజ్డ్​ వెహికల్​ తయారుచేశారు. ఇది రెండు సైకిళ్లను ఒకచోట చేర్చినట్టు ఉంటుంది. దీన్ని ‘క్వాడ్రి సైకిల్’​ అని పిలిచేవాళ్లు. మౌంటెడ్ ఇంజిన్‌తో  నడిచేది. 

ఈ వ్యాపారంలో లాభాలు బాగా రావడంతో బైక్స్​ తయారు చేయాలని డిసైడ్​ అయ్యారు.  దాంతో ఎన్‌ఫీల్డ్ 1901లో 297 సీసీ మోటోసాకోచె ఇంజిన్‌ని ఉపయోగించి మొదటి మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొన్నాళ్లకు 1924లో స్పోర్ట్స్ మోడల్ 351 ని ఫుట్ ఆపరేటెడ్ గేర్​తో తీసుకొచ్చింది. దాని తర్వాత మరో ఎనిమిది మోడళ్లు రిలీజ్​ అయ్యాయి. 

బుల్లెట్ బండి

ఇప్పుడు ఇండియాతోపాటు ఎన్నో దేశాల్లో ఆదరణ పొందిన  ‘‘బుల్లెట్” బండి 1932లో పుట్టింది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కంపెనీ బుల్లెట్​ బైక్​ని తయారుచేశాక మొదటిసారిగా లండన్‌లో జరిగిన ఒలింపియా మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించారు. మొదటగా 250, 350, 500 సీసీల కెపాసిటీతో మూడు మోడళ్లను రిలీజ్​ చేశారు. అన్నింటికీ వంపు తిరిగిన ‘స్లోపర్’ ఇంజిన్లు ఉండేవి. ట్విన్- పోర్టెడ్ సిలిండర్ హెడ్‌లు, ఫుట్ ఆపరేటెడ్ గేర్ ఛేంజ్, హై కంప్రెషన్ పిస్టన్‌లతో వీటిని తయారుచేశారు. తర్వాత 1936లో 500సీసీ బుల్లెట్​ని చాలావరకు మార్చేశారు. ఇది 4-వాల్వ్ సిలిండర్ హెడ్‌తో నిటారుగా ఉండే ఇంజిన్‌తో వచ్చింది. ఆ తర్వాత అనేక దశల్లో మారుతూ ప్రస్తుతం మనం చూస్తున్న బుల్లెట్​ రూపానికి వచ్చింది. 

ఇండియన్​ మార్కెట్​లోకి 

కేఆర్​ సుందరం అయ్యర్ అనే బిజినెస్​ మ్యాన్​ రాయల్ ఎన్‌ఫీల్డ్​తో సహా బ్రిటిష్ మోటార్‌సైకిళ్లను ఇండియాలోకి దిగుమతి చేసుకునేందుకు ‘మద్రాస్ మోటార్స్‌’ని 1949లో స్థాపించాడు. అలా ఎన్‌ఫీల్డ్ ఆ ఏడాది నుంచి ఇండియన్​ మార్కెట్​లో మోటార్‌సైకిళ్లను అమ్మడం మొదలుపెట్టింది. ముఖ్యంగా మన దగ్గర బుల్లెట్​ మోడల్​కు ఆదరణ బాగా వచ్చింది. అందుకే ఇండియన్​ ఆర్మీ కూడా ఈ బైక్​లు వాడాలి అనుకుంది.1952లో మద్రాస్​ మోటార్స్​కి 500, 350సీసీ బుల్లెట్ల కోసం ఇండియన్ ఆర్మీ నుండి ఆర్డర్ వచ్చింది. దాదాపు ఎనిమిది వందల బైక్స్​ ఆర్మీ కోసం కొన్నారు. అప్పట్లో పెట్రోలింగ్ చేయడానికి వీటినే వాడేవాళ్లు. తర్వాత కొన్నాళ్లకు ఇంగ్లాండ్​లో  కంపెనీకి బాగా నష్టాలు వచ్చాయి. 1990లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇండియాలో అప్పటికే ఫేమస్​ అయిన ఆటోమోటివ్ కంపెనీ ఐషర్ గ్రూప్‌తో కలిసి బైక్స్​ తెచ్చింది. తర్వాత మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. దాంతో 1994లో ఐషర్​లో విలీనమైంది.

నష్టాలతోనే...

ఐషర్​ కంపెనీ కొన్నాక కూడా రాయల్​ ఎన్​ఫీల్డ్​కు విపరీతమైన నష్టాలు వచ్చాయి. 2000 సంవత్సరంలో నెలకు 2000 యూనిట్ల కంటే తక్కువగా అమ్ముడయ్యాయి. బైక్స్​ క్వాలిటీ బాగా తగ్గింది. ఇతర కంపెనీలు బాగా పోటీ ఇచ్చాయి. కాలం చెల్లిన డిజైన్ వల్ల కంపెనీకి నష్టాలు తప్పలేదు. దాంతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ పని అయిపోయింది అనుకున్నారు అంతా. కంపెనీ మూసేయాలని చాలామంది సలహా ఇచ్చారు కూడా.

 సక్సెస్​కు అంబాసిడర్​

ఐషర్​ కంపెనీని విక్రమ్​ లాల్ స్థాపించాడు. కష్టపడి వ్యాపారాన్ని విస్తరించాడు. ఒకప్పుడు ఐషర్​ కంపెనీ ట్రాక్టర్ల తయారీలో రారాజు. అంతటి వ్యాపార వేత్త అయిన విక్రమ్​ కూడా రాయల్​ ఎన్​ఫీల్డ్​ని లాభాల వైపు నడిపించలేకపోయాడు. అదే టైంలో అతని కొడుకు సిద్ధార్థ లాల్​ బిజినెస్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బాధ్యతలు పూర్తిగా ఆయనే తీసుకున్నాడు. కొన్నేండ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్​ను ప్రపంచవ్యాప్తంగా సేల్​ చేసే సూపర్​ బైక్‌గా మార్చగలిగాడు. 

ఎన్​ఫీల్డ్​ కోసం 13 కంపెనీలు 

లాల్​కు చిన్నప్పటినుంచి రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే దాన్ని కాపాడుకోవాలి అనుకున్నాడు. 2000లో ఇండస్ట్రీకి వచ్చిన లాల్​ ముందుగా ఎన్​ఫీల్డ్​ నష్టాలకు కారణాలు తెలుసుకున్నాడు. అప్పటికే ఐషర్​ కంపెనీ ట్రాక్టర్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్ళు, విడి భాగాలు... ఇలా 15 వ్యాపారాలు చేసేది. కానీ.. ఎందులోనూ మార్కెట్​ లీడర్​గా లేదు. అందుకే లాల్​ 13 బిజెనెస్​లు మూసేసి, రెండింటి పైనే ఫోకస్​ పెట్టాలి అనుకున్నాడు. దాంతో అన్నింటిని అమ్మేశాడు. ఆ డబ్బుని రాయల్ ఎన్‌ఫీల్డ్, ట్రక్కుల తయారీలో పెట్టాడు. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. నష్టాల్లో ఉన్న ఎన్​ఫీల్డ్​ మీద ఖర్చు చేస్తే.. కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ.. ఆ మాటలు పట్టించుకోలేదు ఆయన. అంతెందుకు వాళ్ల నాన్న విక్రమ్ లాల్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్​ను మూసేయమని సలహా ఇచ్చాడు. అయినా.. వినకుండా సిద్ధార్థ లాల్ పగలు, రాత్రి కష్టపడి రాయల్​ ఎన్​ఫీల్డ్​ని మార్కెట్​లో నిలదొక్కుకునేలా చేశాడు. అందుకోసం ఆయనే స్వయంగా వేల కిలోమీటర్లు బైక్​ రైడ్ చేసి, బైకర్ల ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాడు. యూత్​ ఎలాంటి బైక్స్​ఇష్టపడుతున్నారో ఆయనకు అర్థమైంది. రాయల్ ఎన్​ఫీల్డ్​లో ఉన్న లోపాల గురించి కూడా తెలుసుకున్నాడు. తర్వాత మోడళ్లలో అనేక మార్పులు చేసి ఆ లోపాలను సరిచేశాడు. చివరికి సిద్ధార్థ్ కష్టానికి ఫలితం దక్కింది. కొన్నేండ్లలోనే బుల్లెట్ బండి రోడ్డుపై ‘రయ్​.. రయ్​..’ అంటూ పరుగులు పెట్టింది. సేల్స్​ బాగా పెరిగాయి. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదు అనుకున్న బైక్​.. ఇప్పుడు లక్షలమందికి డ్రీమ్​ బైక్​ అయింది. 

ఒక్కసారిగా రాలేదు

సిద్ధార్థ్​ కష్టపడినా ఆయనకు ఒక్కసారిగా సక్సెస్​ రాలేదు. అందుకు చాలా టైం పట్టింది. 2005 నాటికి కంపెనీ ప్రతి ఏడాది దాదాపు 25,000 బైక్‌లు మాత్రమే అమ్మేది. సిద్ధార్థ లాల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల్లో ఉన్న ఇంజినీరింగ్ లోపాలు సరిచేయడంతో బైక్​ల క్వాలిటీ పెరిగింది. దాంతో బైక్​ మెయింటెనెన్స్​ తగ్గింది. సిద్ధార్థ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ‘హంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, క్లాసిక్ 350, మీటోర్ 350, 350 సీసీ బుల్లెట్ ఎలక్ట్రా, థండర్‌బర్డ్‌’ మోడల్స్​ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఈ బైక్‌ల రాకతో అప్పటివరకు రైడర్స్​ బైక్​గా పేరున్న ఎన్​ఫీల్డ్​ని అందరూ వాడడం మొదలుపెట్టారు. పైగా లాల్​ మోటార్‌ సైక్లింగ్ కల్చర్​ని డెవలప్​ చేశాక సేల్స్​ పెరిగాయి. 2010లో కంపెనీ 50,000 బైక్స్​ అమ్మింది. 2014లో అమ్మకాలు ఏకంగా 5,89,293కి పెరిగాయి. దాంతో ఐషర్ మోటార్స్​కి 8,738 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో 702 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ లాభాల్లో 80% రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచే వచ్చాయి. కంపెనీని మూసేయమని సలహా ఇచ్చినవాళ్లలో చాలామంది ఐషర్​ షేర్స్​ కొన్నారు. అంతేకాదు.. 2015లో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా హార్లే డేవిడ్‌సన్ బైక్​ల కంటే రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. దాంతో ఐషర్ మోటార్స్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఆటోమొబైల్ స్టాక్‌ల్లో ఒకటిగా మారింది. 

రెండో ప్రపంచ యుద్ధంలో ...

రాయల్ ఎన్​ఫీల్డ్​కు రెండో ప్రపంచ యుద్ధం టైంలో భారీగా సైనిక మోటార్ సైకిళ్ళ ఆర్డర్లు వచ్చాయి. ఈ బైక్​లు యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. ఎన్​ఫీల్డ్​ కంపెనీ సైకిళ్ళు, జనరేటర్లు, యాంట్-ఎయిర్‌క్రాఫ్ట్ గన్ ప్రెడిక్టర్లు కూడా యుద్ధ సైనికులకు సరఫరా చేసింది. ముఖ్యంగా అప్పట్లో బాగా ఫేమస్​ అయిన  ‘ఎయిర్‌బోర్న్’ 125 సీసీ మోటార్‌సైకిల్‌ను ఫ్లయింగ్ ఫ్లీ అని పిలిచేవాళ్లు. దీన్ని2-స్ట్రోక్‌ ఇంజిన్​తో ప్రత్యేకంగా తయారుచేశారు. దీన్ని పారాచూట్ క్రెడిల్స్​లోకి కూడా లోడ్ చేసే అవకాశం ఉండేది.