
దేశంలోని ప్రముఖ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 కొత్త చట్టాలకు అనుగుణంగా తన రియల్ మనీ గేమింగ్ వ్యాపారాన్ని క్లోజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదంతో రియల్ మనీ గేమ్స్ పూర్తిగా నిషేధించబడ్డాయి. దీంతో ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీ, బెట్టింగ్-స్టైల్ యాప్‌లు నిలిచిపోతాయనే ఆందోళనలు యూజర్లలో పెరగటంతో వారు తమ డబ్బును వాలెట్ల నుంచి వెంటనే వెనక్కి తీసుకునేందుకు హడావిడి చెందుతున్నారు. ఈ వార్త ఇప్పుడు బీసీసీఐని ఇబ్బందుల్లోకి నెట్టింది.
బీసీసీఐ ప్రధాన స్పాన్సర్ డ్రీమ్ 11 నిషేధం విధించే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కు ఊహించని సమస్య ఎదురైంది. లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది చట్టంగా మారుతుంది. ఈ బిల్లులో ఆన్‌లైన్ మనీ గేమ్‌లను నిర్వహించడంపై నిషేధం విధించింది. అంతేకాదు వాటి ప్రకటనలను కూడా నిషేధిస్తుంది. ఈ కారణంగా భారత జట్టు ఇకపై ఆడబోయే మ్యాచ్ లకు జెర్సీ, కిట్‌పై డ్రీమ్ 11 లోగోను ఉపయోగించడానికి అనుమతించబడదు.
బీసీసీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తే, బిల్లులో జరిమానా విధించే రూల్ కూడా ఉంది. డ్రీమ్11 ప్రస్తుతం ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2023లో బీసీసీఐతో రూ. 358 కోట్ల రూపాయల ఒప్పందంతో BYJU నుండి స్పాన్సర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఒకవేళ చట్టంగా మారితే మాత్రం భారత జట్టు ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండా వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ లో ఆడనుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెప్టెంబర్ 14 నుండి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడబోయే సిరీస్ కు స్పాన్సర్ లేకుండా ఆడొచ్చు.
ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " ఈ చట్టంపై ఈ రోజు లోక్‌సభలో, నిన్న రాజ్యసభలో చర్చించారు. ఆ తర్వాత అది తుది రూపం తీసుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత 'నియామక తేదీ' ఉంటుంది. ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము. దేశంలోని ఏ చట్టం అనుమతించని ఏ పనిని BCCI చేయదు. దేశంలో అమలు చేయబడిన ఏ చట్టాలను BCCI ఉల్లంఘించదు. అది చాలా స్పష్టంగా ఉంది" అని అన్నారు.