50 శాతం డిస్కౌంట్ ఇచ్చినా ఆన్‌లైన్‌‌లో డ్రెస్సులు కొంటలేరు

50 శాతం డిస్కౌంట్ ఇచ్చినా ఆన్‌లైన్‌‌లో డ్రెస్సులు కొంటలేరు
  • ఆన్‌లైన్‌లో డ్రెస్సులు కొంటలేరు
  • కరోనాతో పడుతున్న బ్రాండ్ల అమ్మకాలు
  • షాపింగ్ కంటే సేఫ్లీ, హెల్త్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న కస్టమర్లు
  • భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న జాక్ అండ్ జోన్స్, ఏసిక్స్, సెలియో వంటి బ్రాండ్లు

న్యూఢిల్లీ: ఇప్పటికే సేల్స్ పడిపోయి ఇబ్బందుల్లో ఉన్న ఫ్యాషన్ బ్రాండ్లకు, కరోనాతో కొత్త తలనొప్పి వచ్చి పడింది. కిందటేడాది లాక్‌‌‌‌డౌన్‌‌ టైమ్‌‌లో ఫిజికల్ స్టోర్లలో సేల్స్‌‌ పడిపోయినప్పటికీ, ఆన్‌‌లైన్‌‌లో అమ్మకాలు పర్వాలేదనిపించాయి. కానీ, ఈ సారి ఆ పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌‌లో ఆన్‌లైన్‌ సేల్స్‌‌ 20–30 శాతం తగ్గాయని ఫ్యాషన్ బ్రాండ్లను అమ్మే ప్లాట్‌‌ఫామ్‌‌లు చెబుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో  ప్రజలు క్లాత్స్‌‌, లైఫ్‌‌స్టైల్‌‌ ప్రొడక్ట్‌‌ల కొనుగోలుకు పెద్ద ఆసక్తి చూపించడం లేదని వాపోతున్నాయి. ‘కరోనా సంక్షోభం ఇప్పట్లో విడిచిపోదని ప్రజలు అనుకుంటున్నారు’ అని ఫరెవర్‌‌‌‌ న్యూ  కంట్రీ మేనేజర్‌‌‌‌ ద్రువ్‌‌ బోగ్రా అన్నారు. తమ బ్రాండ్‌‌ సేల్స్‌‌ ఈ ఏడాది మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌‌లో 30‌‌‌‌ శాతం తగ్గాయని చెప్పారు. కరోనా సెకెండ్ వేవ్‌‌ ముందు కంటే ఎక్కువ అనిశ్చితిని క్రియేట్ చేస్తోందని అభిప్రాయపడ్డారు. కిందటేడాది కరోనా సంక్షోభం టైమ్‌‌లో కొన్ని ఫ్యాషన్ బ్రాండ్ల ఆన్‌‌లైన్ అమ్మకాలు రెండింతలు పెరిగాయని చెప్పొచ్చు. కానీ, ఈ సారి ఆన్‌‌లైన్‌‌లో కూడా సేల్స్‌‌ పడుతున్నాయి. ‘ప్రజలు తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌ సేఫ్టీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీంతో షాపింగ్‌‌ను పక్కన పెట్టేస్తున్నారు’ అని బెనెటన్‌‌ ఇండియా  సీఈఓ సందీప్‌‌ చగ్‌‌ అన్నారు. ఆన్‌‌లైన్‌‌లో ఫ్యాషన్‌‌ బ్రాండ్స్‌‌ను అమ్ముతున్న అతిపెద్ద కంపెనీలలో బెనెటన్ ఒకటి. ఈ నెల మొదటి వారంలో తమ ఆన్‌‌లైన్ సేల్స్‌‌ 15–20 శాతం పడ్డాయని సందీప్‌‌ పేర్కొన్నారు.

ఫ్లాట్‌‌ 50 శాతం డిస్కౌంట్‌‌ ఫ్లస్‌‌ అదనపు ఆఫర్లు.. 
ఫాసిల్‌‌, రేబాన్‌‌, లైఫ్‌‌స్టైల్‌‌, స్కెచర్స్‌‌, టామీ హిల్‌‌ఫిగర్‌‌‌‌  వంటి బ్రాండ్లకు ఆన్‌‌లైన్‌‌ మార్కెటింగ్ సొల్యూషన్లను అందిస్తున్న ఏస్‌‌ టర్టల్‌‌ కరోనా వలన తమ బ్రాండ్ల సేల్స్ పడిపోయాయని తెలిపింది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరితో పోలిస్తే మార్చి–ఏప్రిల్ టైమ్‌‌లో కంపెనీ హ్యాండిల్ చేస్తున్న బ్రాండ్ల సేల్స్‌‌ 12–14 శాతం తగ్గాయని పేర్కొంది. ఈ నెల 18 న కంపెనీ హ్యాండిల్‌‌ చేస్తున్న బ్రాండ్ల అమ్మకాలు 20 శాతం తగ్గాయని ఏఎన్‌‌ఎస్‌‌ కామర్స్‌‌ పేర్కొంది. ఈ సంస్థ జాక్‌‌ అండ్ జోన్స్‌‌, బాత్‌‌ అండ్‌‌ బాడీ వర్క్స్‌‌, సెలియో, అల్డో వంటి బ్రాండ్లకు ఆన్‌‌లైన్ సర్వీస్‌‌లను అందిస్తోంది. సేల్స్‌‌ను పెంచుకునేందుకు కొన్ని బ్రాండ్లు భారీగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. టెక్స్ట్‌‌ మెసేజ్‌‌ లేదా సోషల్‌‌ మీడియా ద్వారా ఆఫర్లను ప్రమోట్ చేస్తున్నాయి. మార్క్స్‌‌ అండ్ స్పెన్సర్‌‌‌‌ 50 శాతం వరకు డిస్కౌంట్‌‌ను ప్రకటించింది.  ఏసిక్స్‌‌ ఫ్లాట్‌‌ 40 శాతం ప్లస్‌‌15 శాతం వరకు అదనపు డిస్కౌంట్‌‌ను ఆఫర్ చేస్తోంది. జాక్‌‌ అండ్ జోన్స్‌‌ ఫ్లాట్‌‌ 50‌‌‌‌ శాతం డిస్కౌంట్‌‌ను ఇస్తుండగా, సెలియో ఫ్లాట్‌‌ 40 శాతంతో పాటు ముందుగానే చేసుకున్న ఆర్డర్లపై 10 శాతం క్యాష్ బ్యాక్  ఆఫర్ చేస్తోంది. కొన్ని పెద్ద సిటీలలో మాల్స్‌‌ మూతపడ్డాయని, కన్జూమర్లు కూడా ఆన్‌‌లైన్లో బట్టలు కొనుక్కోవడం తగ్గించేశారని కొన్ని బ్రాండ్లు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫర్లను ప్రకటించినా పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నాయి. ‘మార్కెట్లు క్లోజయినప్పడు, స్టోర్లకు వచ్చే వాళ్లు  70 శాతం తగ్గినప్పుడు సేల్‌‌కు వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు’ అని బెనెటన్‌‌ ఇండియా సీఈఓ సందీప్ అభిప్రాయపడ్డారు.