మహానగరానికి తొలగని..తాగునీటి గోస!..ఏండ్లుగా తీరని సమస్య

మహానగరానికి తొలగని..తాగునీటి గోస!..ఏండ్లుగా తీరని సమస్య
  • రోజుకు 700 ఎంజీడీలు అవసరం 
  • సరఫరా చేస్తున్నది 550 ఎంజీడీలు
  • ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓఆర్ఆర్ వరకూ పైప్​లైన్లు విస్తరించలే
  • శివారు ప్రాంతాల్లో అధికంగా నీటి కొరత 
  • పరిష్కరించడంలో సర్కార్, అధికారులు ఫెయిల్

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​సిటీలో తాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చూపడంలేదు. రోజు రోజుకూ సిటీ విస్తరణతో పాటు పెరిగే జనాభాకు సరిపడా నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఫెయిల్ అవుతుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించామని చెబుతున్నప్పటికి  ఇప్పటికీ చాలా ఏరియాల్లో  పూర్తిస్థాయిలో  పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. గ్రేటర్ సిటీకి రోజుకు 700 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్ డే) నీటి డిమాండ్​ ఉంది. మెట్రోవాటర్​బోర్డు 550 ఎంజీడీలను మాత్రమే సరఫరా చేస్తుంది.

మహానగరంగా ఆవిర్భవించాక శివారు మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అదేవిధంగా ఔటర్​రింగ్​రోడ్​వరకూ విస్తరించిన గ్రామాలకు, మున్సిపాలిటీలకు, 30 గ్రామ పంచాయితీలకు సైతం మెట్రోవాటర్​బోర్డునే నీటిని సరఫరా చేస్తుంది. అయినా డిమాండ్​కు తగినట్టుగా చేయలేకపోతుండగా ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. 

పెరగని నీటి సరఫరా

గ్రేటర్ ​సిటీతో పాటు ఔటర్ వరకు విస్తరించిన గ్రామాలు, టౌన్​షిప్​లు, విల్లాలు, పంచాయితీలకు తాగునీటి సరఫరా బాధ్యత మెట్రోవాటర్​బోర్డుదే. ప్రస్తుతం రోజుకు 550 ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. కోర్​సిటీలో రోజు విడిచి రోజు నీరు వస్తుంది. శివారు ప్రాంతాలకు మూడ్రోజులకోసారి సరఫరా అవుతుంది. గ్రామాలు, టౌన్​షిప్​లు, పంచాయతీలు, విల్లాలకు కొన్నిసార్లు మూడు రోజులకోసారి, ఇంకొన్నిసార్లు వారం రోజులకోసారి నీటి సరఫరా అవుతున్నట్టు ఆయా ప్రాంతాల వాసులు ఫిర్యాదు చేస్తున్నారు.  నిజాం కాలం నీటి పైప్​లైన్​ వ్యవస్థనే ఇప్పటికీ ఉండగా కొన్ని ప్రాంతాల్లో కొత్త పైప్​లైన్​విస్తరించారు. ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో1,560 చ. కి.మీ. పరిధిలో పైప్​లైన్​వ్యవస్థ ఉంది.

ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా అన్ని ప్రాంతాలకు నీటిని అందించలేమని అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరాకు అవసరమైన నెట్​వర్క్​(పైప్​లైన్​వ్యవస్థ) ను మరింత పెంచాలనే ప్రతిపాదనలు చేసిన అధికారులు ఓఆర్ఆర్​ఫేజ్​–1 పేరుతో 2018లో పనులను ప్రారంభించారు. ఇందులో రూ. 613 కోట్లతో కొత్తగా 164 రిజర్వాయర్లను నిర్మించడంతో పాటు 1,571 కి.మీ. మేర పైప్​లైన్ పూర్తిచేశారు. ఇంకా 1,350 కి.మీ. మేర పైప్​లైన్​వ్యవస్థను నిర్మించాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆయా పనులు పూర్తయితేనే  మహానగరానికి తాగునీటి సమస్య కొంత తీరుతుందని పేర్కొంటున్నారు. 

పైప్​లైన్ ​వ్యవస్థ సరిపోదని..

గ్రేటర్​కు పూర్తిస్థాయిలో నీటి సరఫరా, రోజు విడిచి రోజు ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న పైప్​లైన్​ వ్యవస్థ సరిపోదని అధికారులు చెబుతున్నారు. మరిన్ని ప్రాంతాలకు పైప్​లైన్​వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్​సిస్టమ్​అభివృద్ధి చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం  మంజీరా, సింగూరు నుంచి 110 ఎంజీడీలు, కృష్ణా ప్రాజెక్ట్​ ద్వారా 275 ఎంజీడీలు, గోదావరి ప్రాజెక్ట్​ ద్వారా 165 ఎంజీడీలను సిటీకి తరలిస్తున్నారు. 

​రెండో దశకు ప్రతిపాదనలు

ఔటర్ వరకు విస్తరించిన గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి రెండో దశ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు మెట్రోవాటర్​బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా  రూ. 1,200 కోట్లతో వివిధ ప్రాంతాల్లో 73 రిజర్వాయర్లు,  మరో  2,988 కి.మీ. మేర కొత్త పైప్​లైన్​ వ్యవస్థను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవి పూర్తయితే ఔటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లోని నీటి సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు.