జిల్లా ఆస్పత్రిలో తాగునీటి తిప్పలు

జిల్లా ఆస్పత్రిలో తాగునీటి తిప్పలు

కామారెడ్డి, వెలుగు: రానున్నది ఎండాకాలం. ఇంకా అది రాకముందే జిల్లా కేంద్రంలోని హాస్పిటల్​లో తాగునీటి సమస్య మొదలైంది. రోగులు, వారి సంబంధీకులు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు.   బయటి నుంచి బాటిల్స్​లో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్​లో ఉన్న వాటర్​ఫిల్టర్​ చెడిపోవడంతో. 
కొద్ది రోజులుగా మూలకు పెట్టారు. నాలుగు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డి జిల్లా హాస్పిటల్​కు  ప్రతి రోజు ఆవుట్ పేషెంట్లు 500 నుంచి 600 మంది వరకు వచ్చిపోతుంటారు.  ఇన్​పేషెంట్లు 150  నుంచి 180  మంది ఉంటారు. వారితోపాటు వందల మంది వచ్చిపోతుంటారు. సాధారణంగా రోగులతోపాటు, గర్భిణులు చెకప్, డెలివరీలు, యాక్సిడెంట్ల కేసులు అధికంగా వస్తాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే జిల్లా హాస్పిటల్​లో మాత్రం తాగునీటి సమస్య రోగులను, వారి సంబంధీకులను వేధిస్తోంది. బోరు, నల్లా కనెక్షన్​ఉంది.  వార్డుల్లో వివిధ అవసరాలతోపాటు డయాలసిస్​ పేషెంట్ల కోసం ఆ నీటిని వినియోగిస్తారు. తాగునీటి కోసం ఫిల్టర్ మిషన్​ఏర్పాటు చేశారు. కొందరు దాతలు కూలింగ్​వాటర్​ మిషన్​ కూడా అందించారు. ఇప్పుడు అవేవి వినియోగించకుండా మూలన పెట్టారు. డాక్టర్లు, సిబ్బంది కోసం మినరల్​వాటర్​ బయటి నుంచి తెప్పిస్తున్నారు. రోగులకు తాగునీటి వసతి కల్పించే విషయంలో  మాత్రం యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. 

బయటి వారిపైనే ఆధారం...

హాస్పిటల్​లో సరైన మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్న రోగులు, వారి సంబంధికులకు కనీసం తాగునీటి వసతి కూడా  యంత్రాంగం కల్పించడం లేదు. హాస్పిటల్​కు సమీపంలో ఓ బట్టల షాపు ఓనర్​ ఏర్పాటు చేసిన ఫిల్టర్​ వాటర్​సెంటర్​ నుంచి రోగుల బంధువులు నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొందరు బాటిళ్లను కొనుక్కుంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడే నీటి కొరత ఇంత తీవ్రంగా ఉంటే ఇక ఎండలు ముదిరాక ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా హాస్పిటల్​లో తాగునీటి  సమస్యను పరిష్కరించాల్సిన అవసరముందని రోగుల బంధువులు, అవుట్​పేషెంట్లు కోరుతున్నారు. 

నీళ్ల బాటిల్​పట్టుకొని వస్తున్న ఈమె పేరు మణెమ్మ. ఈమె తల్లి అనారోగ్యంతో రెండు రోజులుగా హాస్పిటల్​లో ఉంటోంది. ఇక్కడ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో సమస్య మరింత ఎక్కువవుతోంది.   ‘హాస్పిటల్​లో తాగేందుకు నీళ్లు లేక రోజుకు నాలుగైదు సార్లు బయటకు పోయి బాటిల్ నింపుకుంటున్నాం’ అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది.

ఇక్కడే ఉంటే తిప్పలుండయ్

నేను కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నా. వారానికి 3 రోజులపాటు డయాలసిస్​కోసం ఇక్కడికి వస్త. తాగేందుకు నీళ్లు లేవు. బయటికెళ్లి బాటిల్​లో నీళ్లు తెచ్చుకుంటున్న. వచ్చినప్పుడు బయట బట్టల షాపు వద్ద ఉన్న ఫిల్టర్ నల్లా నుంచి తీసుకొస్తా. హాస్పిటల్​లోనే తాగేనీళ్లు ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావు. 
-జావ్లా నాయక్, రోగి, ఎల్లారెడ్డి

సమస్య లేకుండా చూస్తున్నాం..

హాస్పిటల్​లో వాటర్​ప్రాబ్లమ్​లేకుండా చూస్తున్నాం. బిల్డింగ్​పైన పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఫిల్టర్​మిషన్ ఆపేశారు. నల్లాల ద్వారా నీటి సప్లయ్​అవుతోంది. కొందరు పేషెంట్ల బంధువులు బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారు.  
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డాక్టర్​విజయలక్ష్మి, సూపరింటెండెంట్​