- ఇప్పుడే మేల్కొనకపోతే కొత్తగూడెం పట్టణ వాసులకు మళ్లీ తప్పని నీటి తిప్పలు
- ఏడేండ్లుగా కొనసాగుతున్న రూ.40కోట్ల వాటర్ వర్క్స్
- టెండర్ల దశలోనే అమృత్ స్కీం
- నీటి వనరులు పుష్కలంగా ఉన్నా.. సరైన ప్రణాళికల్లేక ఈ పరిస్థితి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణవాసులకు తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వెంటనే ఆఫీసర్లు, పాలకవర్గం మేల్కొనకపోతే ఎండాకాలం మొదలు నుంచే తాగునీటి గోస తప్పేలా లేదు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా సరైన ప్రణాళికలు లేక ఈ పరిస్థితి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. అమృత్ స్కీం చేపట్టాల్సిన పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి.
పేరుకు ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ
కొత్తగూడెం పేరుకు ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినా నీటి ఎద్దడి నుంచి మాత్రం బయట పడడం లేదు. కిన్నెరసానితో పాటు మిషన్ భగీరథ, సింగరేణి నుంచి ప్రస్తుతం నీటి సరఫరా అవుతోంది. కిన్నెరసాని నీటి పథకం కింద రూ. కోట్లలో ఖర్చు పెడుతున్నా తాగునీరు రోజూ ఇచ్చిన దాఖలాలు లేవు. మిషన్ భగీరథ ద్వారా నీటిని తీసుకుంటున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సింగరేణి సప్లై చేసే నీళ్లు ఆగిపోతే పట్టణ ప్రజలు
ఆగమైపోవాల్సిందే.
సరైన ప్లాన్ లేక!
పట్టణంలోని 36 వార్డులకు నీటి సప్లై చేసేందుకు గానూ రైతు బజార్, రైటర్‌బస్తీ, ఎస్పీ ఆఫీస్ ఏరియా, రామవరం ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. పట్టణంలో దాదాపు 9,991 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్లపై పర్యవేక్షణ లేదు. 2011 జనాభా ప్రకారంగా ఉన్న 21,901 కుటుంబాలకు అవసరమైన నీటి సరఫరానే మున్సిపాలిటీ అధికారులు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఈ 13 ఏండ్లలో వందలాదిగా ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. జనాభా పెరిగింది. అందుకు అనుగుణంగా నీటి సప్లైకి సరైన ప్లాన్ లేదనే విమర్శలున్నాయి.
రోజుకు దాదాపు 9 ఎంఎల్డీ నీళ్లు అవసరం ఉన్నప్పటికీ 5 నుంచి 6 ఎంఎల్డీ మాత్రమే తీసుకుంటున్నారు. రికార్డుల్లో మాత్రం 6 నుంచి 8 ఎంఎల్‌డీగా చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. సప్లై అయ్యే నీటిలో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు లీకేజీలతో వృథాగా పోతున్నాయి. లీకేజీలను అరికట్టేందుకు ఏడాదికి రూ. 6లక్షల వరకు ఖర్చు పెడతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు.
ఏడాదిలో కావాల్సిన పనులు ఏడేండ్లైనా కాలే..
కిన్నెరసాని నీటి పథకాన్ని పక్కాగా అమలు చేసే క్రమంలో 2016లో దాదాపు రూ.40కోట్ల చేపట్టిన పనులు ఏడాది కాలంలో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఏడేండ్లు అవుతున్నా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు దాదాపు 25 ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన పైప్లైన్లు చాలా వరకు ఎక్కడికక్కడికి పగిలిపోతున్నాయి. నల్లా ఫీజు కింద నెలకు ఒక్కో కనెక్షన్‌కు రూ.100 వసూలు చేస్తున్నారు.. కానీ నీటి సరఫరాలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అలాగే పట్టణంలో తాగు నీటి ఎద్దడి నివారించేందుకు అమృత్ స్కీం కింద రూ. 135కోట్లతో పనులు చేపట్టేందుకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చి ఏడాది అవుతున్నా పనులు టెండర్ల దశలోనే ఉండడం గమనార్హం. అటు రూ. 40 కోట్లతో చేపడుతున్న పనులు, ఇటు అమృత్ స్కీం ద్వారా చేపట్టే పనులను ఆఫీసర్లు, పాలకులు స్పీడప్ చేస్తే తప్ప ఈ ఎండాకాలం నీటి తిప్పులు తప్పవని, త్వరగా ముందుస్తు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
చిన్న పనులు చేస్తే అందుబాటులోకి వస్తది.. కానీ...
పట్టణంలోని రామవరంలోని1000 కిలో లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్‌కు నాలుగు నెలల కింద ట్రయల్ రన్ నిర్వహించారు. చిన్న రిపేర్లు చేయకపోవడంతో ఇప్పుడు అది నిరుపయోగంగా మారింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని హడావుడిగా మూడేండ్ల కింద వేసిన పైప్లైన్ల నుంచి ఇప్పటికీ చుక్క నీరు రావడం లేదు.
చర్యలు చేపడుతున్నాం..
ఎండాకాలంలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నాం. రూ.22కోట్లతో పైప్లైన్లు వేస్తున్నాం. యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తున్నాం. రామవరంలోని ఓవర్ హెడ్ ట్యాంక్‌ను ఎండాకాలం ముందే వాడుకునేలా ప్లాన్ చేస్తున్నాం. అమృత్స్కీం కింద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తాగునీళ్ల పనులకు చర్యలు తీసుకుంటోంది.
రఘు, మున్సిపల్కమిషనర్, కొత్తగూడెం.