
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: అమీన్పూర్ పరిధిలో కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అమీన్‌పూర్‌లోని నవ్య కాలనీలో మిషన్ భగీరథలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటింటికి నల్ల కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు మంచినీటి కొరతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అమీన్పూర్లో నేడు తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపామన్నారు.
పదేళ్లుగా పదుల సంఖ్యలో నీటి రిజర్వాయర్లను నిర్మించి ప్రతి ఇంటికి నీటిని అందిస్తున్నామని త్వరలోనే బంధంకొమ్ము రిజర్వాయర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్చైర్మన్పాండురంగా రెడ్డి, కమిషనర్జ్యోతిరెడ్డి, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపాలిటీ లిమిట్స్‌లోని పాటిలో రూ. 50 లక్షలతో నిర్మించిన కల్వర్టును స్థానిక నాయకులు రామచంద్రారెడ్డి, భాస్కరరావుతో కలిసి ప్రారంభించారు. తర్వాత బీహెచ్ఈఎల్పెద్దమ్మ గుడి వద్ద జరిగిన ఆషాఢ బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిగాచి ప్రమాదంపై ఎమ్మెల్యే ఆగ్రహం
పటాన్చెరు, వెలుగు: సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ప్రమాదంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిపుణులైన సిబ్బంది స్థానంలో అనుభవం లేని దినసరి కార్మికులతో బాయిలర్లు, ఎయిర్ డ్రైయర్ల వద్ద ప్రమాదకర పనులు చేయించడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. ప్రమాదంలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు, మరో 30 మంది గాయపడ్డారని గుర్తుచేస్తూ, ఇది పరిశ్రమ యాజమాన్యం, కాంట్రాక్టర్ల అత్యాశకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన శిక్ష విధించాలని సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.