ఎనిమిది ఏండ్లయినా డ్రైవర్ల బతుకులు మారలే

ఎనిమిది ఏండ్లయినా డ్రైవర్ల బతుకులు మారలే

ఎల్బీనగర్(హైదరాబాద్), వెలుగు: రాష్ట్రం వచ్చి 8 ఏండ్లయినా డ్రైవర్ల బతుకులు మాత్రం మారలేదని డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేటలోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్​లో ఆవేదన సభ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డ్రైవర్లు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ 8 ఏండ్లలో ట్యాక్సీ డ్రైవర్లు వేల కోట్ల రూపాయల పన్నులు కట్టినా.. తమకు ఏ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం తేలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు. యాప్ బేస్డ్ ఆధారిత కంపెనీల వల్ల డ్రైవర్ల బ్రతుకులు ఆగమవుతున్నాయని, ప్రమాదాల్లో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కరోనా సమయంలో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, ఇప్పటికీ పరిస్థితులు మారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వెహికల్స్, ఇతర రాష్ట్రాల వాహనాలు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవట్లేదంటే ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ ఉన్నాడా లేడా అనే అనుమానం కలుగుతోందన్నారు. 

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డిజిటల్ మీటర్ ట్యాక్సీ  విధానం తేవాలని, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వెహికల్స్​ను కట్టడి చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఐటీ సెక్టార్లో కి.మీ.కు రూ.25 చొప్పున ఇవ్వాలని, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్న అద్దె వాహనాలకు చార్జీలు పెంచాలని కోరారు. టాక్సీలకు నగరంలో ఉచితంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. రాపిడో, ఓలా, ఉబర్ లాంటి బైక్ టాక్సీ లపై చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక క్యాంపుల ద్వారా డ్రైవర్లకు బ్యాడ్జి నెంబర్లు ఇచ్చి నామమాత్రపు ఫీజుతో రెన్యువల్ చేయాలన్నారు. డ్రైవర్లపై జరుగుతున్న దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సభలో మోటర్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బైరగోని రాజు గౌడ్, అన్ని జిల్లాల డ్రైవర్లు  పాల్గొన్నారు.