తెగుతున్న రోడ్లు.. మునుగుతున్న ఊర్లు

తెగుతున్న రోడ్లు.. మునుగుతున్న ఊర్లు
  • రికాంలేని వాన.. తెగుతున్న రోడ్లు.. మునుగుతున్న ఊర్లు
  • సిటీల్లో కాలనీలు జలమయం.. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
  • భయం భయంగా బతుకుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు
  • వేల ఎకరాల్లో పంటలు మునక.. అలుగు పోస్తున్న చెరువులు
  • ఏడేండ్లలో ఇదే అత్యధిక వర్షపాతం

నెట్​వర్క్​/హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల నుంచి రికాం లేకుండా వానలు కురుస్తున్నాయి. ముసురు వదలడం లేదు. జనజీవనం అతలాకుతలమవుతోంది. ఇండ్లల్లోకి వరద నీళ్లు వచ్చి జనం తిప్పలు పడుతున్నారు. వాగులు, వంకలు ఉప్పొండంతో చాలా చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్సారెస్పీ సహా గోదావరి, దాని ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న ఊర్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దని ఊళ్లలో చాటింపు వేశారు. నిర్మల్, కరీంనగర్​, వరంగల్​​టౌన్లలోని చాలా కాలనీలు నీటమునిగాయి. బయటకు వెళ్లే దారి లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్​ను వరద నీరు ముంచెత్తింది. సిద్దిపేటలోని డబుల్​ బెడ్రూం ఇండ్లు  ఉరుస్తున్నాయి. వానల వల్ల సింగరేణి ఓపెన్​కాస్ట్​లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.


వాంకిడిలో 30 సెం.మీ. వర్షపాతం
గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని వాంకిడిలో  30 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ ఆఫీసర్లు తెలిపారు. నిర్మల్‌లోని నర్సాపూర్‌లో 24.5, వనాల్‌పహడ్‌లో 23.6, తాండ్రలో 21.8, జామ్‌లో 21.4, కుంటాలలో 18.5, జగిత్యాలోని రాయ్‌కల్‌లో 20, నిజామాబాద్‌లోని కమ్మరపల్లిలో 19.3, మెండోరలో 19.2, నిర్మల్‌లోని కుంటాలలో 18.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌  ప్రకటించింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం  సిద్ధంగా ఉండాలని సూచించింది.

అంచనా వేసిన దానికంటే ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకగా, అప్పట్నుంచి జోరుగా వానలు పడుతున్నాయి. ఏడేండ్లలో ఇంత ఎక్కువ వానలు పడలేదని వాతావరణ శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ నాగరత్న చెప్పారు. జులైలో ఇప్పటివరకు సాధారణం కంటే 25 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 2020లో 17 శాతం అధికంగా కురవగా.. అంతకు ముందు ఐదేండ్లు లోటు వర్షపాతం నమోదైంది. ఇక ఈ సీజన్​లో ఓవరాల్​గా చూస్తే జూన్​ ఫస్ట్​ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 73 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 282 మి.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా.. 487 మి.మీ. రికార్డయింది.

హైదరాబాద్​లో లోతట్టు ప్రాంతాల్లో భయం భయం
హైదరాబాద్​లోనూ ముసురు వదలడం లేదు. మొన్నటి భారీ వర్షాలకు నీటమునిగిన కాలనీల్లో ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ముసురుతో పాటు అప్పుడప్పుడు జోరుగా వాన కురుస్తుండటంతో జనం భయపడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలనీలు నీట మునిగాయి. జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.  ట్యాంక్​బండ్​ అలుగు పారుతుండటంతో నాలాలో ఉధృతి పెరిగింది.

మోకాళ్లలోతు నీటిలో సిరిసిల్ల కలెక్టరేట్​
ఇటీవలే సీఎం కేసీఆర్​ ప్రారంభించిన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​ నీట మునిగింది. కలెక్టరేట్​ ప్రాంగణంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. లోపలికి వెళ్లలేక, బయటికి రాలేక ఉద్యోగులు, జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్​లోని సీలింగ్​ నుంచి నీళ్లు కారుతున్నాయి. స్లాబ్​ల జాయింట్ల వద్ద వర్షపు నీరు లీకై గదుల్లోకి నీళ్లు చేరాయి. గోడలకు చెమ్మ వస్తోంది. ఒక వైపు కొత్త కలెక్టరేట్లను సెక్రటేరియెట్ల మాదిరిగా కట్టించామని కేసీఆర్​ చెప్తుండగా.. మరోవైపు ఇలా ఉరుస్తుండటంతో క్వాలిటీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సిరిసిల్ల కలెక్టరేట్​ భవనాన్ని రూ. 65 కోట్లతో రగుడు జంక్షన్​లోని చెరువు శిఖంలో నిర్మించారు. 

వరంగల్​లో ఇండ్లల్లోకి వరద
వరంగల్​ సిటీలో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి  చెరువులు నిండాయి. ట్రైసిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ఏరియాల్లో ఇండ్లలోకి వరద నీళ్లు చేరాయి.  గతంలో సీఎం కేసీఆర్ పర్యటించిన దీన్‌దయాల్ నగర్,  శ్రీరామ్ కాలనీ, వరంగల్ ఎస్సార్ నగర్, గాంధీ నగర్ లో ఇండ్లలోకి నీళ్లు నిండగా, ఎత్తి పోసుకోవాల్సివచ్చింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో జీడబ్ల్యూఎంసీ ఆఫీస్​లో కంట్రోల్​ రూం ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు మండలాలలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా లోని  అన్నారం-, కాళేశ్వరం మధ్య చంద్రుపల్లి వాగు బ్యాక్​ వాటర్ వల్ల రాకపొకలు బందయ్యాయి. పలిమెల మండలం మోదేడు వద్ద బండల వాగు ఉప్పొంగి దారి బందయింది. 


పలు చోట్ల రాకపోకలు బంద్​
సిద్దిపేట జిల్లాలోని మోయ తుమ్మెద వాగు పొంగి పొర్లుతుండటంతో సిద్దిపేట, హన్మకొండల మధ్య రాకపోకలను నిలిచిపోయాయి. మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద కూడవెల్లి వాగు పొంగడంతో ముందు జాగ్రత్త గా రాకపోకలను నిలిపివేశారు.  
మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లో వాగు ఉప్పొంగి వడ్డెమాను వద్ద రాకపోకల నిలిచిపోయాయి. అడ్డాకుల మండలంలో రోడ్లు కోతకు గురయ్యాయి.  వర్షాల ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టోల్​ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేసింది. 

కరీంనగర్​లో కాలనీలు జలమయం
కరీంనగర్ సిటీలోని విద్యానగర్, జ్యోతినగర్, ముకరంపుర, తీగలగుట్టపల్లి, గణేశ్ నగర్, సరస్వతీ నగర్, చంద్రపురి కాలనీ, హుసేనిపూర, కోతి రాంపూర్, రాంనగర్, ఆదర్శ నగర్, దుర్గమ్మ గడ్డ, అశోక్ నగర్  ఏరియాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో  పంట పొలాలు నీట మునిగాయి.  చొప్పదండి పట్టణంలో ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. లోయర్ మానేరు డ్యామ్ కు ఇన్ ఫ్లో పెరగడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు 60 వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్​చేశారు. పెద్దపల్లి  జిల్లా ముత్తారం మండలంలోని మానేరు వాగు పొంగిపొర్లడంతో ముత్తారం, పారుపల్లి, శాత్రాజుపల్లి గ్రామాల నడుమ రాకపోకలు నిలిచాయి. జగిత్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ధర్మపురి రూట్​లో గుల్లపేట, సారంగాపూర్ వెళ్లే రూటులో హైదర్​పల్లి వద్ద, కొడిమ్యాల మండలం నాచుపల్లి వద్ద రోడ్డుపై వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచాయి. సిరిసిల్లలోని పలు కాలనీల్లో నీళ్లు వచ్చి చేరాయి. చేపలు పట్టేందుకు వెళ్లిన 14 మంది వేములవాడ ఎల్లమ్మ గుడి దగ్గర మూలవాగులో  చిక్కుకుపోయారు. గజ ఈతగాళ్ల సహాయంతో వారిని కాపాడారు.  మూలవాగులో వరద ఉధృతి పెరిగినందువల్ల ఎవరూ అటువైపు రావద్దని  డీఎస్పీ చంద్రకాంత్ సూచించారు.  


నిజామాబాద్​లో 40% పంటలు మునక
నిజామాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.  దాదాపు 40 శాతం పంటలు నీట మునిగాయి. బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్దాపూర్, కొప్పర్గ, బిక్ నెల్లి, హంగర్గ, బండార్ పల్లి, హున్సా గ్రామాల్లో వరి, సోయాబీన్​ పంటలు దెబ్బతిన్నాయి.  సిరికొండ మండలంలోని  కప్పలవాగు  పొంగి పొర్లుతుండటంతో కమ్మర్ పల్లి, భీమ్ గల్,సిరికొండ మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో దాదాపు 600 చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. బీర్కూర్, నస్రుల్లాబాద్, ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. కామారెడ్డి, రాజంపేటల మధ్య  లింగాయపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకల ఇబ్బంది ఏర్పడింది. తాడ్వాయి మండలం బ్రహ్మనపల్లి, కామారెడ్డి మండలం టెకిర్యాల్ మధ్య కూడా రాకపోకలు నిలిచాయి. భారీవానల వల్ల కామారెడ్డి టౌన్, ఇల్చిపూర్​లలో ఐదు  మట్టి ఇళ్లు 
కూలిపోయాయి. 

పర్ణశాల మునిగింది
ఖమ్మం సిటీలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, వినోదా థియేటర్ ఏరియాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. భద్రాచలంలో పర్ణశాలలోకి నీళ్లు చేరి సీతమ్మ విగ్రహం సగం మునిగింది. వైరా రిజర్వాయర్  అలుగు పారుతుండడంతో స్నానాల లక్ష్మీపురం, కేజీ సిరిపురం మధ్య రాకపోకలు బందయ్యాయి. వాగులు, ఏర్లు పొంగిపొర్లడంవల్ల చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.  కామేపల్లి మండలం ‌‌‌‌‌‌‌‌బండిపాడు, డోర్నకల్ హైవేమీద బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లే వెహికల్స్​ నిలిచిపోయాయి. పలు మండలాల్లో మిర్చి, పత్తి చేలు నీట మునిగాయి. అశ్వారావుపేట, ఒడ్డుగూడెం బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోయాయి.  

ఉట్నూర్​ ఏజెన్సీ అతలాకుతలం
ఎడతెగని వానలతో ఉట్నూర్​ఏజెన్సీ అతలాకుతలమవుతోంది. ఆసిఫాబాద్​ టౌన్​లోని లోతట్టు ప్రాంతాలు,  కౌటాలలోని పలు కాలనీలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి జనం ఇబ్బందులు పడ్డారు. వందల ఎకరాల్లో పంట పొలాలు మునిగిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తిర్యాణి, కెరమెరి, జైనూరు, బెజ్జూరు, ఆసిఫాబాద్​  మండలాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్ వాగు దగ్గర భారీ వానలవల్ల 33 కేవీ సబ్​స్టేషన్​ పోల్​ విరిగిపడడంతో చాలా ఊళ్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.