డీప్ వెబ్ వేదికగా డ్రగ్స్ దందా

డీప్ వెబ్ వేదికగా డ్రగ్స్ దందా

అక్రమ వ్యాపారాలు, ఇల్లీగల్ మార్కెట్ కి డార్క్ వెబ్ అడ్డాగా మారుతోంది. డ్రగ్స్, వెపన్స్ లాంటివి ఓపెన్ మార్కెట్ లో కొనాలంటే కష్టం. దీంతో టెక్నాలజీని అడ్డదారిలో వాడుతూ డీప్ వెబ్ లో ఆర్డర్స్ చేస్తూ ఈజీగా కొనుగోలు చేస్తున్నారు. డార్క్ వెబ్ మార్కెట్ ని చేధించడానికి పోలీసులకు కూడా కష్టంగా మారడంతో... అక్రమార్కులు తమకు కావాల్సినవన్నీ ఇక్కడే ఆర్డర్ చేస్తున్నారు. 

ఓ చీకటి ప్రపంచం..

డార్క్  వెబ్  అనేది ఓ చీకటి ప్రపంచం. అక్రమ వ్యాపారాలకు ప్లాట్ ఫామ్ గా నిలిచే వెబ్ సైట్స్ ని డార్క్ వెబ్ అంటారు. మనం సాధారణంగా ఉపయోగించే ఇంటర్నెట్ ని సర్ఫేస్ వెబ్ అంటారు. మొత్తం ఇంటర్నెట్ లో ఇదో చిన్న భాగం. కానీ పైకి కనిపించని మరో ఇంటర్నెట్ వ్యవస్థనే డీప్ వెబ్ అంటారు. ఈ డీప్ వెబ్ లో ఉండే వెబ్ సైట్స్, వెబ్ పేజీలను గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్స్ కనిపెట్టలేవు. సాధారణంగా ఎవరైనా గూగుల్  క్రోమ్ , మోజిల్లా ఫైర్  ఫాక్స్  లాంటి బ్రౌజర్లను వినియోగిస్తారు. ఈ బ్రౌజర్లలో డార్క్ వెబ్ లో ఉండే వెబ్ సైట్స్ యాక్సెస్ అవ్వవు. డార్క్  వెబ్  లో ఉండే వెబ్సైట్స్ టోర్  బ్రౌజర్ల ద్వారానే ఓపెన్ అవుతాయి.

అమెరిన్ ఆర్మీ అధికారులు ..

1990 లో అమెరిన్ ఆర్మీ అధికారులు తమ నిఘా సమాచారాన్ని ఎవరికి తెలియకుండా ఉండేందుకు డార్క్ వెబ్ ని ప్రారంభించారు. కానీ ఇదే డార్క్ వెబ్ ప్రపంచమంతా విస్తరించి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. అన్ని రకాల డ్రగ్స్, వెపన్స్, సైనైడ్ తో పాటు కిరాయి హంతకులు కూడా డార్క్ వెబ్ లో దొరుకుతారు. మన దేశంలో ఎక్కువగా డ్రగ్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ, పైరసీ లాంటి వాటి కోసం దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఎలాంటి డేటానైనా హ్యాక్ చేయగలిగే హ్యాకర్లు కూడా ఇందులో దొరుకుతారు.

స్పెషల్ గా బ్రౌజర్లు..

డార్క్ వెబ్ ని ఉపయోగించడానికి స్పెషల్ గా బ్రౌజర్లుంటాయి. అవి చాలా కట్టుదిట్టంగా పనిచేస్తాయి. ఈ వెబ్ సైట్స్ కూడా సాధారణ ఇంటర్నెట్ తోనే పనిచేసినా.. కొన్ని సాఫ్ట్ వేర్స్ ని ఉపయోగిస్తూ ఐపీ అడ్రెస్ లను కనబడకుండా చేస్తారు. దాంతో ఎవరు ఈ వెబ్ సైట్స్ ని రన్ చేస్తున్నారు.. ఎవరు ఏం కొంటున్నారని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఈ వ్యవస్థను నియంత్రించడం పోలీసులకు కూడా చాలా కష్టంగా మారుతుందంటున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. రీసెంట్ గా డార్క్ వెబ్ తో డ్రగ్స్ దందా సాగిస్తున్న మూడు గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కి చెందిన ఓ డ్రగ్ వినియోగదారుడిని పట్టుకుని అతని ద్వారా.. అసలు డ్రగ్స్ ఎలా కొంటున్నారు.. ఎక్కడ ఆర్డర్ చేస్తున్నారు.. ఎవరు అమ్ముతున్నారు అనే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ డార్క్ వెబ్ వ్యవహారం బయటపడింది.


 
ప్రత్యేకంగా చట్టం లేదు..

మన దేశంలో డార్క్ వెబ్ ని నియత్రించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేదు. సీఆర్పీసీ, ఐటీ చట్టాలే ఈ నేరాలకు వర్తిస్తాయి. డార్క్ వెబ్ సైట్స్ కి చాలా వేగంగా కోడ్స్ ని చేంజ్ చేస్తారు. టెక్నికల్ గా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతారు. అందుకే వీళ్లని రీచ్ అవ్వడం పోలీసులకు కష్టంగా మారుతోంది. టెక్నాలజీలో పోలీసులు చాలావరకు వెనుకబడినా కొన్ని కేసుల్లో వీరిని చేధించేందుకు ఇతర ప్రైవేట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఓ స్టూడెంట్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడ్ని విచారిస్తే మొత్తం డ్రగ్స్ అంతా డార్క్ వెబ్ లో ఆర్డర్ చేస్తూ తాను వినియోగిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం నగరానికి చెందిన ముప్పై మంది ప్రముఖులు డార్క్ వెబ్ లో ఆర్డర్ పెట్టి కొరియర్ ద్వారా ఇంటికి తెప్పించుకుని డ్రగ్స్ వినియోగిస్తూ సిటీ పోలీసులకు దొరికిపోయారు. వీరితో పాటు కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇదే మార్గం ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుని వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజురోజుకీ విస్తరిస్తున్న డార్క్ వెబ్ ని అరికట్టాలంటే పోలీసులు ప్రత్యేకంగా ఓ వింగ్ ని ఏర్పాటు చేసి.. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి టెక్నికల్ నాలెడ్జ్ పెంచితే ఎంతో కొంత అరికట్టవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. 

సీపీ సీవీ ఆనంద్ ఏమన్నారంటే.. 

ఈ మధ్య బయట జరిగే డ్రగ్స్ దందాపై పోలీసులు ఫోకస్ పెంచడంతో డార్క్ వెబ్ లో డ్రగ్స్ సప్లై జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. కోడ్ లాంగ్వేజ్ లో డార్క్ వెబ్ కి వెళ్లి డ్రగ్స్ ఆర్డర్ చేస్తే కొరియర్ లో ఇంటికే డ్రగ్స్ పంపుతున్నారన్నారు. అయితే పేమెంట్ మాత్రం ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కాకుండా బిట్ కాయిన్స్ ద్వారా చేస్తున్నట్లు తెలిపారు. డార్క్ వెబ్ లో డ్రగ్సే కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ వెపన్స్ దందా కూడా నడుస్తుందన్నారు సీపీ. హైదరాబాద్ పోలీసులకు డార్క్ వెబ్ పై మరింత శిక్షణ ఇప్పించి.. ఇలాంటి దందాలపై ఫోకస్ పెడతామన్నారు.