విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు: సీపీ సీవీ ఆనంద్

విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు: సీపీ సీవీ ఆనంద్
  • త్వరలో సర్కార్ తీసుకొస్తుంది: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: డ్రగ్స్ స్మగ్లింగ్, దందా, వినియోగాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు వేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణంగా ఉంటున్నాయని.. వాటిని కట్టడి చేయడం కోసం త్వరలో కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో నార్కోటిక్స్ ఫ్రీ క్యాంపస్ కార్యక్రమంలో సీపీ ఆనంద్ పాల్గొని యాంటీ డ్రగ్స్ కమిటీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సీవీ ఆనంద్  డ్రగ్స్ స్మగ్లర్లు ఎక్కడున్నా.. ఎవరైనా విడిచిపెట్టడం లేదని తెలిపారు. హైదరాబాద్ లేదా తెలంగాణ వైపు కన్నెత్తి చూసిన బడాబడా అంతర్జాతీయ స్మగ్లర్లు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు పంపించామని సీపీ ఆనంద్ చెప్పారు.

డ్రగ్స్ రాకెట్ల మూలాలను వెతికితే డ్రగ్స్ కు గోవా కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు గుర్తించామని, ఎక్కడో ఉంటూ హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు.  ఇకపై విద్యాసంస్థల్లో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. అలాగే అమ్మాయిల మీద అఘాయిత్యాలపై సర్కార్  ప్రత్యేక చట్టం తీసుకు రాబోతుందని సీపీ ఆనంద్ వివరించారు.