V6 News

మత్తు కోరల్లో యాదాద్రి.. యువతే లక్ష్యంగా యథేచ్ఛగా గంజాయి దందా

మత్తు కోరల్లో యాదాద్రి.. యువతే లక్ష్యంగా యథేచ్ఛగా గంజాయి దందా
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో ఉండడం సులువుగా విక్రయాలు.. 
  • చిన్న ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో సరఫరా 
  • స్టూడెంట్స్​ను బానిసలుగా మారుస్తున్న వైనం
  • పేరెంట్స్ తో పాటు ఫ్రెండ్స్​పైనే దాడి
  • ఇటీవల రాయగిరి మధు హత్యతో స్థానికుల్లో కలవరం
  • కేసులు నమోదు చేస్తున్నా ఆగని దందా

యాదాద్రి, వెలుగు :   యాద్రాద్రి జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. యువత, స్టూడెంట్స్​ లక్ష్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల బిజినెస్​ సాగుతోంది. సిగరెట్​తో మొదలైన వ్యసనం.. చివరకు గంజాయి.. హాష్​ ఆయిల్​ పీల్చేస్తూ మత్తుకు బానిస అవుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్​కు సమీపంలో ఉన్న యాదాద్రి జిల్లాలో గంజాయి సేల్స్ పెరిగిపోతోంది.

గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున కాకుండా.. 50 గ్రాములు అంతకంటే తక్కువగా గంజాయి తెచ్చుకొని వాడడంతో పాటు అమ్మకాలు కూడా చేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్​ చేసి కేసులు నమోదు చేసినా దందా మాత్రం ఆగడం లేదు. 

ఇదీ పరిస్థితి..

యాదాద్రి జిల్లా హైదరాబాద్​కు దగ్గరగా ఉండడం, రెండు జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు ఉన్నాయి. దీంతో గంజాయి రవాణా సులువుగా జరుగుతోంది. ఏవోబీ (ఆంధ్ర ఓడిశా బోర్డర్​) నుంచి విజయవాడ హైవే మీదుగా వెహికల్స్​లో రవాణా జరుగుతోంది. పలు ట్రైన్లలో గంజాయి రవాణా జరుగుతోంది. హైదరాబాద్​కు వెళ్లిన తర్వాత బస్సుల్లో చిన్న చిన్న ప్యాకెట్లలో తిరిగి గంజాయి జిల్లాకు చేరుతోంది. దీంతో విక్రయాలు పెరిగిపోతున్నాయి.

జిల్లాలోని భువనగిరి, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ లో  ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు, పలు కంపెనీలు ఉన్నాయి.  కాలేజీల్లో స్థానిక విద్యార్థులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్​ చదువుకుంటున్నారు. కంపెనీల్లో ఎక్కువగా ఒడిశా, బిహార్​,  బెంగాల్​ నుంచి వచ్చిన వారు పని చేస్తున్నారు. గంజాయి సేల్స్​ చేసేవారు వీరినే ఎంచుకొని విక్రయిస్తున్నారు. 

చిన్న చిన్న ప్యాకెట్లలో..

గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున కాకుండా సోంపు ప్యాకెట్ల సైజులో  అమ్మకాలు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్లు తెప్పించి సేల్స్​ చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. గంజాయి నుంచి తయారు చేసే హాష్​ ఆయిల్,​ చరాస్​ పేస్ట్ కూడా అమ్ముతున్నారు.  అయితే వీటికి అలవాటుపడిన వారు ఎక్కువగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి తాగుతున్నారు. రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో జనం ఉండరు కాబట్టి ఆ ప్రాంతాలను ఎన్నుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని హోటళ్లలో ఏర్పాటు చేసిన స్మోకింగ్​ జోన్స్​లోనూ గంజాయి కూర్చిన సిగరెట్లను యువత పీలుస్తున్నట్టు తెలుస్తోంది. 

పట్టుబడుతున్నా ఆగని దందా..

జిల్లా మీదుగా రవాణా చేస్తున్న గంజాయి, గంజాయి నుంచి తీసిన హాష్​ ఆయిల్​తో పాటు గంజాయి చాకెట్లు పలుమార్లు పట్టుబడ్డాయి. కానీ దందా మాత్రం ఆదడం లేదు. 2020 నుంచి ఇప్పటి వరకూ 165 కేసులు నమోదు చేసి, 253 మందిని అరెస్ట్​ చేశారు.  7,740 కిలోల గంజాయి, 52 లీటర్ల హాష్​ ఆయిల్​, చరాస్​ పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు.  కాగా ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ గంజాయి సేల్స్​ చేస్తున్న 31 మందిపై కేసులు నమోదు చేసింది. 14 వెహికల్స్​ను సీజ్​ చేసింది. వారివద్ద నుంచి రెండు లీటర్ల హాష్​ ఆయిల్​, 71 కిలోల గంజాయితో పాటు 4,557 చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది. 

ఇటీవల మత్తులో దాడులు, హత్య..

గంజాయికి బానిస అయిన వ్యక్తులు ఆ మత్తులో వీరంగం సృష్టిస్తూ దాడులకు తెగబడుతున్నారు.  గంజాయి మత్తులో పెద్ద కత్తి పట్టుకొని చంపుతా అంటూ తిరుగుతుంటే భయంతో ఎవరూ దగ్గరికి పోలేకపోయారు. ఆమత్తులో పేరెంట్స్​పై దాడులు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. 

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మేడిపల్లిలో ముగ్గురు యువకులు గంజాయికి బానిస అయ్యారు. వీరు ముగ్గురు కలిసి ఈ నెల 21న రాత్రి గ్రామ శివారులో గంజాయి పీలుస్తూ గడిపారు. ఈ ముగ్గురి మధ్య 22న తెల్లవారుజామున గొడవ జరగడంతో ఇద్దరు కలిసి రాయగిరి మధును  హత్య చేసి పారిపోయి.. అనంతరం వచ్చి లొంగిపోయారు.

తాము ఎలా హత్య చేశామో పోలీసులకు ఎలాంటి జంకు లేకుండా వివరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హత్యకు గురైన యువకుడు రాయగిరి మధు తండ్రి భిక్షపతి గంజాయి విషయంలో పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. 

యాదాద్రి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ గంజాయికి బానిస అయ్యాడు. ఆ మత్తులో మటన్​ కొట్టే కత్తి చేతిలో పట్టుకొని 'చంపుతా.. నరుకుతా' అని వీధిలో వీరంగం సృష్టించాడు. కాలనీవాసులు భయంతో అతడి వద్దకు వెళ్లలేక పోయారు. చివరకు పోలీసులకు సమాచారం అందించడం, వాళ్లు వచ్చి అతడిని తీసుకెళ్లి కౌన్సిలింగ్​ ఇచ్చారు. 

తుర్కపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు గంజాయి మత్తుకు అలవాటయ్యాడు. ఆ మత్తులో తోటివారిని దూషించడం మొదలుపెట్టాడు. సదరు యువకుడి తండ్రి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా.. నెట్టి వేశాడు. దీంతో అతడి తండ్రి చేయి విరిగింది.