విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..మందు బాబుల పరేషాన్

విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..మందు బాబుల పరేషాన్

మద్యం మత్తులో కో ప్యాసింజర్పై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన మరువకముందే అలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సైతం ఎయిర్‌ ఇండియా ఫ్లైట్ లోనే జరిగింది. గతేడాది డిసెంబర్‌ 6న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. పారిస్‌ నుంచి -ఢిల్లీ వస్తున్న ఫ్లైట్ లో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు.. తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. 

డిసెంబర్ 6న జరిగిన ఘటనకు సంబంధించి పైలెట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. దీంతో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత బాధితురాలు ఈ ఘటనపై కంప్లైంట్ చేసినా, నిందితుడు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేందుకు నిరాకరించింది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం  అతన్ని అక్కడి నుంచి పంపేశారు.

గత ఏడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలోని ఎగ్జిక్యూటివ్‌ క్లాసులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కో ప్యాసింజర్ అయిన 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే పారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో మూత్ర విసర్జన ఘటన బయటకు వచ్చింది.