
- గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిన ఆదాయం
- నెలకు సగటున రూ.3 వేల కోట్ల ఆమ్దానీ
- ఇదే సమయంలో రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ అమ్మకాల్లో రాష్ట్ర సర్కారు రికార్డులు బ్రేక్ చేస్తున్నది. ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు పెట్టి మరీ సేల్స్ చేయిస్తున్నది. దీంతో తాగి రోడ్డెక్కుతున్న వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే రాష్ట్ర సర్కారుకు 30 శాతం లిక్కర్ ఆదాయం పెరగ్గా.. ఇదే సమయంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు అన్ని పోలీస్ కమిషనరేట్లలో దాదాపు డబుల్ అయ్యాయి. ఈ ఏడాది ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 57 వేల కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 9 నెలల్లో లిక్కర్ అమ్మకాలు రూ.25,147 కోట్లు దాటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.21,763 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. అంటే గతంలో కంటే రూ.3,384 కోట్ల విలువైన లిక్కర్ ఎక్కువగా అమ్ముడైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.5,841 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా, రూ.2,720 కోట్లతో హైదరాబాద్ జిల్లా, రూ.2,552 కోట్లతో నల్గొండ జిల్లా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఏటేటా పెరుగుడే
రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా వస్తున్న డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. దీంతో మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. తర్వాతి నుంచి లిక్కర్ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. 2014–15లో రూ. 10.88 వేల కోట్లు రాగా.. 2018–19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్ అయింది. 2020–21లో లిక్కర్ ఆమ్దానీ రూ.27.28 వేల కోట్లకు చేరుకుంది.
నిరుడు (2021–22) సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆదాయం వస్తే.. ఈ ఏడాది సగటున రూ.3 వేల కోట్లు సమకూరుతున్నది. కిందటేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు రూ.21,763 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 2.65 కోట్ల ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 2.36 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు రూ.25,147 కోట్ల మద్యం సరఫరా కాగా, ఇందులో 2.52 కోట్ల ఐఎంఎల్ కేసులు, 3.48 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కోటి 12 లక్షల బీర్ కేసులు ఎక్కువగా అమ్ముడుపోయాయి. 2021– 22 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ఏకంగా రూ.30 వేల కోట్లు క్రాస్ కాగా, ఈ సారి రాబోయే డిసెంబర్ 31 వేడుల్లో వచ్చే డిమాండ్, మూడు నెలల రెగ్యులర్ ఇన్‌కమ్‌ను కలిపితే మొత్తంగా రూ.40 వేల కోట్లు క్రాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
వరంగల్ కమిషనరేట్‌లో ఎక్కువ జైలు శిక్షలు
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో తాగిన లెవల్స్ ను బట్టి కోర్టుల్లో ఫైన్లు, శిక్షలు విధిస్తున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారిలో బీఏసీ లెవల్ 150 నుంచి 200 వరకు ఉంటున్నది. ఈ స్థాయిలో బీఏసీ ఉన్న వాళ్లకు ఫైన్లు విధిస్తున్నారు. సోయి తప్పేట్లుగా పూటుగా తాగడంతో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లెవల్ కొందరిలో 200 దాటి 300 వరకు చూపిస్తున్నది. ఇలా తాగి ప్రమాదకరంగా వెహికల్స్ నడిపేవాళ్లను, రెండోసారి, మూడోసారి పట్టుబడిన వాళ్లను జైలుకు పంపుతున్నారు. రోజుకు సగటున 20 మంది జైలుకు పోతున్నారు. ఈ ఏడాది అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,838 మందిని జైలుకు పంపగా, సైబరాబాద్ పరిధిలో 979 మందిని, రాచకొండ పరిధిలో 460 మందిని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 237 మందిని జైలుకు పంపారు.
సైబరాబాద్ పరిధిలో 57 వేల కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అన్ని పోలీస్ కమిషనరేట్లలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు డబుల్ అయ్యాయి. తాగి వెహికల్స్ నడిపేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే గత ఏడాది 36 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏకంగా 57 వేల కేసులు వచ్చాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గత ఏడాది 21,077 మంది పట్టుబడితే.. ఈ సారి 42,637 మంది పట్టుబడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 6,226 కేసులు, ఈ ఏడాది 14,512 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 11,980 మంది పట్టుబడగా, ఈ ఏడాది 14,845 మంది తాగి వెహికల్స్ నడుపుతూ పోలీసులకు చిక్కారు.