
- రైతులకు కరెంట్ రంది!
- వానాకాలంలో త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వక ఎండిన పొలాలు
- బోర్లలో నీళ్లు మస్తున్నా.. కరెంట్ సప్లై లేకనే కష్టాలు
- యాసంగి సాగుపై జిల్లా రైతుల్లో టెన్షన్
మెదక్/పాపన్నపేట, వెలుగు: జిల్లాలో యాసంగి సాగుకు రైతులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు తుకాలు పోయగా.. మరికొందరు పొలాలు దున్నుతున్నారు. వానాకాలంలో వానలు దంచి కొట్టడంతో భూగర్భ జలాలు బాగా పెరిగి బోర్లు ఫుల్పోస్తున్నాయి. దీంతో బోర్లున్న రైతులందరూ వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. అయితే సర్కారు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్తున్నా.. వానాకాలంలో త్రీఫేజ్కరెంట్సరిగా ఇవ్వక బోర్ల కింద వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో ఈ యాసంగిల కరెంట్ఎన్ని గంటలిస్తరో.. త్రీఫేజ్ఇస్తరో ఇవ్వరోనని రైతులు రంది పడుతున్నారు.
ఎక్కువ మందికి బోర్లే ఆధారం..
పెద్ద సాగునీటి ప్రాజెక్ట్‌లు లేని జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు పంటలు సాగు చేసేందుకు బోర్ల మీదనే ఆధారపడుతున్నారు. ఒకే ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ‘వనదుర్గా’ ఆయకట్టు రైతులు, చెరువుల కింద పొలాలు ఉన్న మెజారిటీ రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బోర్లే వేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో లక్షకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వాటి కింద దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. బోరు సౌలత్ఉన్న రైతులు ఎక్కువ శాతం మంది వరి నే సాగు చేస్తారు. గడిచిన వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా బోర్ల కింద లక్షా 20 వేల ఎకరాలకు పైగా వరినాట్లేశారు. అయితే చాలా ప్రాంతాల్లో 10 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట సప్లై కాక, సరిపోను నీటి తడులు అందక పొట్టకొచ్చిన దశలో వరిచేన్లు ఎండిపోయాయి.
భూగర్భ జలాలు పెరగడంతో..
వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడడం, ఎగువ నుంచి భారీ వరద రావడంతో మంజీరా నది, హల్దీవాగు, పుష్పాల వాగు, పసుపులేరు వాగు, గుండువాగు ఉధృతంగా ప్రవహించాయి. వాటి మీద నిర్మించిన చెక్ డ్యాంలు పూర్తిగా నిండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు బాగా పెరిగాయి. దీంతో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్, పాపన్నపేట, మెదక్, హవేలి ఘనపూర్ మండలాల్లో భూగర్భ జల మట్టం పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో బోర్లు పుష్కలంగా నీళ్లు పోస్తున్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా 12 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట్సప్లై కావడం లేదు. ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా నాట్లు వేసేటపుడు, ఆ తరువాత విడవక నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఆ సమయంలో కరెంట్ సరఫరా ఇలాగే ఉంటే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం త్రీఫేజ్ కరెంట్ సరఫరా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు
సప్లై తగ్గిస్తే పంటలు దెబ్బతింటయ్
సర్కారు వ్యవసాయానికి 24 గంటలు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నామని చెప్తోంది కానీ ఇప్పుడు 12 గంటలే సప్లై చేస్తోంది. నాట్లు వేసినంక కూడా కరెంట్ సప్లై గిట్లనే ఉంటే కష్టమైతది. తడులు అందక బోర్ల కింద వేసిన పంటలు ఎండుతాయి. 24 గంటలు త్రీఫేజ్ సప్లై ఇచ్చేటట్లు సర్కార్చర్యలు తీస్కోవాలి.
షాహిద్ పాషా, రైతు, రాంతీర్థం
ప్రస్తుతం 12 గంటలు ఇస్తున్నాం
ప్రస్తుతం వ్యవసాయానికి12 గంటల పాటు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేజ్ సప్లై చేస్తున్నాం. యాసంగి తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ని గంటలు ఇవ్వ మంటే అన్నిగంటలు త్రీఫేజ్ ఇస్తాం.
- నర్సింలు, ఏఈ, పాపన్నపేట