పాలమూరుకు డ్రై పోర్ట్ .. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటుకు భూమి పరిశీలన

పాలమూరుకు డ్రై పోర్ట్ .. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటుకు భూమి పరిశీలన
  • నేషనల్ హైవే - 44పై గుడిబండ వద్ద నిర్మాణానికి చర్యలు
  • రాష్ట్రంతో పాటు ఏపీ, కర్నాటకకు అనువుగా రోడ్డు, రైలు కనెక్టివిటీ
  • సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో స్థలాన్ని పరిశీలించిన టీఎస్ఐఐసీ ఆఫీసర్లు

మహబూబ్​నగర్/అడ్డాకుల, వెలుగు : పాలమూరుకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. సీ పోర్టుకు అనుసంధానంగా తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పోర్టును మహబూబ్​నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ భావించింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ ​వద్ద ఒక డ్రై పోర్ట్​ ఏర్పాటు కానుండగా.. తాజాగా మహబూబ్​నగర్​ జిల్లాలో మరో డ్రై పోర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 

రాష్ట్రంలో రెండోది..

ఈ ఏడాది మొదట్లో దావోస్​లో పర్యటించిన సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణలో డ్రై పోర్టుల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయా కంపెనీలను కోరారు. దీంతో గత ఫిబ్రవరిలో ఉమ్మడి మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​ మండలం పరికిబండ వద్ద దాదాపు 350 ఎకరాల్లో మల్టీమోడల్​ లాజిస్టిక్​ పార్క్ తో పాటు డ్రై పోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. భూసేకరణ పూర్తి చేసి.. రైతులకు పరిహారం కూడా అందించారు. మరో ప్రాజెక్టును ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది తెలిసిన  దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​రెడ్డి సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబుతో భేటీ అయ్యారు. 

దేవరదక్ర ప్రాంతం డ్రై పోర్టుకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని వివరించారు. ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. దీనిపై సీఎం, ఐటీ మంత్రి సానుకూలంగా స్పందించారు. స్థల పరిశీలనకు ఇటీవల స్టేట్ఇండస్ర్టియల్​ఇన్​ఫ్రాస్ర్టక్చర్​కార్పొరేషన్​(టీఎస్​ఐఐసీ) ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో ఆ శాఖ అధికారులు మంగళవారం దేవరకద్ర పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడి ప్రభుత్వ భూములను స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్​తో కలిసి పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎంత భూమి ఉందనే వివరాలను రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా తెలుసుకున్నారు. నేషనల్​హైవే- –44కు సమీపంలో భూములు ఉండడంతో ఆఫీసర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

రెండు రాష్ట్రాలతో రోడ్డు, రైలు కనెక్టివిటీ

జిల్లాలోని దేవరకద్ర సెగ్మెంట్ లో 70 కిలోమీటర్ల  ఎన్​హెచ్​-– 44 విస్తరించి ఉండి ఏపీలోని ప్రాంతాలను కలుపుతుంది. దీనికి అనుసంధానంగా ఎన్​హెచ్​-–167 కూడా వెళ్తుంది. ఇది కర్నాటక వరకు విస్తరించి ఉంది. ఈ రెండు హైవేల వెంట షాద్​నగర్​, కొత్తూరు, మహబూబ్​నగర్​, జడ్చర్ల, దేవరకద్ర, కౌకుంట్ల, మదనాపురం (వనపర్తి రోడ్డు,  కౌకుంట్ల, గద్వాల వరకు రైల్వే కనెక్టివిటీ ఉంది. ఈ మార్గంలో తెలంగాణ, ఏపీ, కర్నాటకకు మెరుగైన రవాణా వ్యవస్థ ఉంది. అలాగే శంషాబాద్​ఎయిర్​ పోర్టుకు కూడా ఈ ప్రాంతం కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ అంశాలను  పరిగణలోకి తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం ఏపీలోని మచిలీపట్నం సీ పోర్టుకు అనుసంధానంగా ఇక్కడ డ్రై పోర్టు ఏర్పాటుకు సిద్ధమైంది.  

సీ పోర్టులపై భారం తగ్గించేందుకు.. 

సీ పోర్టులపై భారం, రద్దీని తగ్గించేందుకు డ్రై పోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణలో సీ పోర్టులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో డ్రై పోర్టులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీ పోర్టు తరహాలోనే ఇక్కడా కస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది. తనిఖీలు, పేపర్ వర్క్, ఇతర పనులన్నీ ఇక్కడే చేస్తారు. డ్రై పోర్ట్ కు అనుసంధానించిన సీ పోర్ట్ ద్వారా నేరుగా వస్తువుల ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. మచిలీపట్నంలోని సీ పోర్టులో ప్రస్తుతం కార్గో సర్వీసులు, ఫెర్టిలైజర్స్​, బొగ్గు, వంట నూనెలు, ఆయా కంపెనీల కంటైనర్లు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్​ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి. 

డ్రై పోర్టు గురించి అసెంబ్లీలో చర్చించా..

దేవరకద్ర సెగ్మెంట్ లో డ్రై పోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చించా. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రితో మాట్లాడాను. ఇందుకు సానుకూలంగా స్పందించారు.  డ్రై పోర్ట్ ఏర్పాటుకు ఆఫీసర్లు గుడిబండ వద్ద భూమిని పరిశీలించారు.  హైదరాబాద్, కర్నూలు, రాయచూర్​ ప్రాంతాలకు కనెక్టివిటీగా ఉండి.. డ్రై పోర్ట్ ఏర్పాటుకు సరిపడా ప్రభుత్వ స్థలం కూడా అందుబాటులో ఉంది. వెనకబడిన  ప్రాంతానికి పరిశ్రమలు వస్తే యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది. 

జి.మధుసూదన్​రెడ్డి, పాలమూరు డీసీసీ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే దేవరకద్ర