దళితబంధు ఎంపికకు కమీషన్లు తీసుకుంటున్న రూలింగ్ ​పార్టీ లీడర్లు

దళితబంధు ఎంపికకు కమీషన్లు తీసుకుంటున్న రూలింగ్ ​పార్టీ లీడర్లు
  •     ఆఫీసర్లకు, సిబ్బందికి పర్సెంటేజీలు
  •     యూనిట్లు గ్రౌండింగ్​చేయకుండానే ఖాతాలు ఖాళీ 
  •     సర్వేకు వెళ్లిన కార్యదర్శులకు కనిపించని యూనిట్లు
  •     యాప్​తో నిజాలు బయటకు..

హనుమకొండ, వెలుగు: అవినీతి ఆఫీసర్లు, లీడర్ల పుణ్యమా అని దళితబంధు స్కీం అసలు లక్ష్యం నీరుగారుతోంది. రూలింగ్​పార్టీ లీడర్లు అర్హులను పక్కనపెట్టి తమ అనుచరులను, అనర్హులను ఎంపిక చేయడంతో యూనిట్లు గ్రౌండింగ్ చేయకుండానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కో యూనిట్​కు రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తుండటంతో ఆఫీసర్లు, లీడర్లు, బ్రోకర్లకు లక్ష నుంచి రెండు లక్షల దాకా కమీషన్​ఇచ్చి, మిగిలిన సొమ్ము కాజేస్తున్నారు. కొద్దిరోజుల కింద ప్రభుత్వం దళితబంధు యాప్ ​తీసుకొచ్చి, అందులో యూనిట్ల వివరాలను ఫొటోలతో సహా ఎంటర్​ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఒకే యూనిట్​పై మూడు, నాలుగు క్లెయిమ్స్ ​చేసినట్లు తేలడం, ఇంకొన్నిచోట్ల అసలు యూనిట్లే లేకున్నా ఫండ్స్​ మింగేసినట్లు గుర్తించిన కార్యదర్శులు అవాక్కవుతున్నారు. అలాగే స్థానిక లీడర్లు, ఆఫీసర్లు సెక్రెటరీలను బెదిరిస్తూ యాప్​లో వివరాలు ఎంట్రీ చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సర్వే చేయలేమంటూ శనివారం కమలాపూర్​ మండలానికి చెందిన కార్యదర్శులు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్​తో పాటు సంబంధిత శాఖల అధికారులు, మంత్రులకు లెటర్లు కూడా పంపించారు. విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బ్రోకర్లు, ఆఫీసర్ల దందా

హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దళితబంధు స్కీం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నచ్చిన వ్యాపారం చేసుకునేందుకు వీలుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తామన్నారు. 2021 ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గాన్ని పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 లక్షల దళిత కుటుంబాలు ఉండగా, దశల వారీగా 1.80లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈక్రమంలో గతేడాది హుజూరాబాద్‌‌, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో  పూర్తిస్థాయిలో స్కీంను అమలుచేసిన సర్కారు,  మిగతా నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున ఎంపిక చేసి ఫండ్స్​ కేటాయించింది. ఇప్పటివరకు  38 వేల మందికి యూనిట్లు గ్రౌండ్ చేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. కాగా, నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంతా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరిగింది. ఎమ్మెల్యేలు ముందుగా అనుచరులకు, బీఆర్ఎస్​ లీడర్లకు అవకాశమిచ్చారు. తర్వాత గ్రామాలు, వార్డుల్లో ఒకటి, రెండు పేర్లను సూచించే బాధ్యతను లోకల్​బీఆర్ఎస్​ లీడర్లకు అప్పగించారు. ఆశావహులు ఎక్కువగా, యూనిట్లు తక్కువగా ఉండడంతో నేతలు అక్రమాలకు తెరలేపారు. ఆఫీసర్లతో కలిసి ఒక్కో యూనిట్​కు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల దాకా కమీషన్లు తీసుకొని అనర్హులను ఎంపిక చేశారు. యూనిట్ ​సాంక్షన్​ అయ్యాక చెల్లించేలా అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట వేలం పాటలు కూడా నిర్వహించారు. ఎంపీడీఓ ఆఫీస్​ నుంచి లబ్ధిదారుల దరఖాస్తు చేసిన తర్వాత మిగతా ప్రాసెస్​ఎస్సీ కార్పొరేషన్​ఈడీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. ఈ మేరకు వెరిఫికేషన్, ఆడిటింగ్, గ్రౌండింగ్​అంతా అదే డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు చూసుకుంటుండగా..కొంతమంది బ్రోకర్లు ఆడిటింగ్ సిబ్బందిని, ఎస్సీ కార్పొరేషన్​ ఆఫీసర్లను మేనేజ్​ చేస్తూ దందా మొదలుపెట్టారు. 

బండ్లన్నీ అమ్మేస్తున్నరు

స్కీంలో భాగంగా చాలామంది లబ్ధిదారులు మినీ డెయిరీలు, సెంట్రింగ్, వివిధ రకాలు షాపులు, హార్వెస్టర్లు , ట్రాక్టర్లు, కార్లు ఇలా తమకు నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. అయితే స్కీం కింద వాహనాలు అందుకున్న చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్మేశారు. జిల్లాలో మొదటి విడతగా హుజూరాబాద్​ నియోజకవర్గంలోని కమలాపూర్​ మండలానికి యూనిట్లు శాంక్షన్ ​కాగా.. అందులో చాలావరకు చేతులు మారాయి. ట్రాక్టర్లు, కార్లను అమ్మేసి.. ఒకవేళ ఎవరైనా ఎంక్వైరీకి వస్తే ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో లీజ్​అగ్రిమెంట్ రాసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఫీల్డ్ ​లెవెల్​లో లబ్ధిదారుల చేతుల్లో యూనిట్లు ఉండడం లేదు. 

హనుమకొండ జిల్లాలో అక్రమాలు ఇలా.. 

హనుమకొండ జిల్లాకు 4,182 యూనిట్లు మంజూరు కాగా.. మొదటి విడతలో గ్రౌండింగ్​అయిన యూనిట్లకు సంబంధించిన ఫొటోలు అప్​లోడ్​చేసి రెండు, మూడో, విడత లబ్ధిదారులకు చెందినవిగా ఎంటర్ చేసి ఆ యూనిట్ కు సంబంధించిన మొత్తాన్ని డ్రా చేశారు. కొన్నిచోట్ల వారికి మంజూరైన యూనిట్లకు ఇతరుల మినీ డెయిరీలు, సెంట్రింగ్, కిరాణాషాపుల ఫొటోలు అప్​ లోడ్​చేసి ఫ్రాడ్​ చేశారు. కమలాపూర్​మండలానికి 3,930 యూనిట్లు గ్రౌండింగ్​ కాగా దాదాపు 80 శాతం వరకు ఫ్రాడ్​ జరిగినట్లు తెలుస్తోంది. మర్రిపెల్లిగూడెంలో 40 మందికి మినీ డెయిరీ యూనిట్లు శాంక్షన్ ​కాగా, 15 మంది షెడ్లు ఏర్పాటు చేయకుండానే యూనిట్ మొత్తాన్ని తీసేసుకున్నారు.  హసన్​పర్తి మండలంలోని ఓ వ్యక్తి దళితబంధుకు అప్లికేషన్​ పెట్టుకుంటే అధికారులు మినీ డెయిరీ శాంక్షన్​ చేశారు. లంపిస్కిన్ ​వ్యాధితో పశువులు చనిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మళ్లీ సెంట్రింగ్​యూనిట్​కు మార్చుకున్నాడు. తన బంధువుకు ఆల్రెడీ ఉన్న షాపునే కొత్త యూనిట్​గా చూపించి దళితబంధు నిధులు డ్రా చేశాడు. ఇందులో ఆడిటింగ్ ​సిబ్బంది, ఎస్సీ కార్పొరేషన్​ఆఫీసర్లకు వాటాలు పంచారనే ఆరోపణలున్నాయి.  

సూర్యాపేట జిల్లాలో...

సూర్యాపేటలో దళిత బంధు కింద ఎంపికైన జనరల్ స్టోర్స్ ను మంత్రి జగదీశ్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించారు. నెల రోజులు మాత్రమే స్టోర్ నడిపించి దుకాణాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో వెహికిల్స్ కోసం అప్లికేషన్​ పెట్టుకుంటున్న లబ్ధిదారులు షోరూమ్ నుంచి కొనకుండా జీఎస్టీ కట్ చేసుకొని మిగిలిన డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్క తిరుమలగిరి మండలంలో దాదాపు 20 వెహికిల్స్ ..షోరూం నుంచి బయటకు రాకుండానే లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపించారు. తిరుమలగిరి మండలంలో డైరీ యూనిట్ కోసం అప్లయ్ చేసుకున్న లబ్ధిదారులు అసలు డైరీ యూనిట్ నెలకొల్పకుండానే కొంతమంది నాయకులతో కలిసి ఫిఫ్టీ–ఫిఫ్టీ తీసుకొని చేతులు దులుపుకొన్నట్లు తెలిసింది.  రాష్ట్రంలో ప్రతిచోటా ఇలాగే జరుగుతున్నట్టు తెలుస్తోంది.