- వరద పరిహారం జాబితా రూపకల్పనలో తీవ్ర జాప్యం
- పక్క జిల్లాలో అందిన పరిహారం
- సీఎం సమీక్షించినా మారని ఆఫీసర్ల పనితీరు
- పరిహారం కోసం ఎదురు చూస్తున్న బాధితులు
- ఇవాళైనా అకౌంట్లో డబ్బులు పడేనా?
మహబూబాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన అత్యంత భారీ వర్షాలకు మహబూబాబాద్జిల్లాలో వరద నష్టం ఎక్కువగా జరిగింది. వరద బాధితులను ఆదుకోవడం కోసం స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 3న జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి పంట, ఆస్తి నష్టం, కూలిన, దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు, బ్రిడ్జిలు, పశువులతో సహా వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామ, మండల స్థాయి ఆఫీసర్లు అంచనాలను రూపొందించారు. అయినప్పటికీ జిల్లా స్థాయి ఆఫీసర్లు తుది జాబితా రూపకల్పనలో ఎడతెగని జాప్యం చేస్తున్నారు. సీఎం సమీక్షించినా ఆఫీసర్ల పనితీరు మారడం లేదు.
కలెక్టర్అనుమతి లేనిదే ఇవ్వరట!
పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో ఈ నెల 11న వరద నష్టం పరిహారం కింద ఒక్కో కుటుంబానికి రూ.16,500 తమ బ్యాంక్అకౌంట్లో జమయ్యాయి. మరోవైపు, మానుకోట ప్రజలకు ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలోని వివిధ శాఖల ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం వరద బాధిత ప్రజలకు శాపంగా మారుతోంది. మండల స్ధాయి అధికారులు పంపిన జాబితాను క్రోడికరించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. భారీ వర్షం కురిసి 10 రోజులు గడిచినా వరద నష్టం జాబితా అందించలేదు. ఏ శాఖ పరిధిలో ఎంత నష్టం జరిగిదని వివరాలను అడితే.. కలెక్టర్అనుమతి లేనిదే ఇవ్వలేమంటూ అధికారులు దాటవేస్తున్నారు.
రేపు మాపని నెట్టుకొస్తున్నరు
వరద సాయం అడిగితే రేపుమాపంటూ అధికారులు దాట వేస్తున్నారు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో బాధితులందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. వరద మూలంగా సర్వం కోల్పోయాం. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా పరిహారం అందండంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. - శివాజీ, సీతారాం తండా, మరిపెడ మండలం