నాగర్ కర్నూల్.వెలుగు : ఇటీవలి వర్షాలకు జిల్లాలోని చిన్నాచితక డొంకలు,పెద్ద వాగులకు వరద ప్రవాహం తగ్గడం లేదు. తాడూరు,మిడ్జిల్,కల్వకుర్తి, తెల్కపల్లి,ఉప్పునుంతల మండలాల్లో డిండి మీద రాకపోకలు నిలచిపోయి దాదాపు 10 రోజులు దాటుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో నల్లవాగు మెడికల్ కాలేజీ వెనక నుంచి కేసరిసముద్రంలోకి వెళ్తోంది.
కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం-నార్లాపూర్ వాగు,కోడేరు పస్పుల వాగు, లింగాల, బల్మూరు, అచ్చంపేట మీదుగా చంద్రవాగు ప్రవాహం శనివారం రాత్రి ఆమన్‌గల్, తలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వెల్దండ మండలంలోని గానుగగట్టు తండా- బైరాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డు మీదగా వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పోలీస్,రెవెన్యూ అధికారులు రాక పోకలను నిలిపివేశారు.
ప్రజలు వాగుల్లో చేపలు పట్టడం, ఫొటోలు దిగవద్దని హెచ్చరిస్తున్నారు.కోడేరు మండలం రాజాపురం గ్రామం నుంచి నాగులపల్లి వెళ్లే రోడ్డులో కల్టర్ట్ వద్ద లొంకోళ్ల వాగు తెగిపోయి రాకపోకలు ఆగిపోయాయి.
జారుడుబండలైన కాజ్‌వేలు
జిల్లాలోని ప్రధాన వాగుల మీద నిర్మించిన కాజ్‌వేలు ప్రమాదకరంగా మారుతున్నాయి.కాజ్‌వేల మీదుగా ప్రవహిస్తున్న వరద నీటితో కాజ్‌వేలు కనిపించకుండా పోతున్నాయి.రెవెన్యూ,పోలీస్ అధికారులు రాకపోకలు అడ్డుకుంటున్నా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.వరద తగ్గిన తర్వాత నాచుతో పాకర పట్టే కాజ్‌వేలపై జారిపోయే బైకులపై నుంచి పడి పలువురు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.