శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత

నాగర్​కర్నూల్, ​వెలుగు : ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా శ్రీశైలం రిజర్వాయర్​లో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం వరకు రెండు గేట్లు ఎత్తిన అధికారులు తర్వాత ఐదు గేట్లను 10 అడుగుల వరకు ఎత్తారు. సాయంత్రం 8వ గేట్​ ఎత్తి నీటిని దిగువకు విడిచారు. కృష్ణా, తుంగభద్ర నదులతో పాటు వాటి ఉపనదులు, వాగుల నుంచి ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది.  శ్రీశైలం రిజర్వాయర్​లోకి ఇన్ ఫ్లో  2,43,789  క్యూసెక్కులు వస్తుండగా 2,59,271 క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. రిజర్వాయర్​ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా  ప్రస్తుతం 884.90 అడుగుల వరకు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం  215.8070 టీఎంసీలకు ప్రస్తుతం 215.3263 టీఎంసీల నీరు ఉంది. ఏపీ, తెలంగాణలోని కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్​ ఉత్పత్తి కొనసాగుతోంది. 

ఇయ్యాల, రేపు భారీ వర్షాలు!
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. కాగా ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో అత్యధికంగా 15 సెం.మీ. వర్షపాతం రికార్డయింది.