బంగారానికి డిమాండ్​

బంగారానికి డిమాండ్​

వెలుగు బిజినెస్​ డెస్క్​: దేశంలో బంగారం డిమాండ్​ కొవిడ్​ ముందు లెవెల్స్​కు చేరింది. జులై–సెప్టెంబర్​ మధ్య కాలంలో బంగారం డిమాండ్​ 191.7 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్​ కౌన్సిల్​ (డబ్ల్యూజీసీ) రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది బంగారం గిరాకీలో 14 శాతం గ్రోత్​ కనిపిస్తోందని పేర్కొంది. గోల్డ్​ డిమాండ్​ ట్రెండ్స్​ క్యూ3 2022 పేరుతో ఒక రిపోర్టును డబ్ల్యూజీసీ ప్రకటించింది. అంతకు ముందు ఏడాది జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో గోల్డ్​ డిమాండ్​ 168 టన్నులు. కన్జూమర్ల ఆసక్తి వల్ల దేశంలో బంగారం డిమాండ్​ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుంజుకున్నట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. ఇదే కాలంలో దేశంలో జ్యుయెలరీ డిమాండ్​ 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా రికార్డయింది. ఈ డిమాండ్​ 2021 జులై–సెప్టెంబర్​ మధ్యలో 125.1 టన్నులే. విలువపరంగా చూస్తే జ్యుయెలరీ డిమాండ్​ దేశంలో 22 శాతం ఎక్కువై రూ. 64,860 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో ఇది రూ. 53,330 కోట్లే.  ఇండియాలో బంగారపు కడ్డీలు, కాయిన్స్​ డిమాండ్​ కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ డిమాండ్​ 6 శాతం ఎక్కువై 45.4 టన్నులకు చేరినట్లు డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. ఈక్విటీ మార్కెట్ల జోరు తగ్గడంతోపాటు, గోల్డ్​ రేట్లు తక్కువగా ఉండటం రిటెయిల్​ ఇన్వెస్టర్లను ఆకర్షించినట్లు పేర్కొంది. కొవిడ్​ వల్ల గత రెండేళ్లలో పండగలను కూడా పూర్తి స్థాయిలో ఎవరూ జరుపుకోలేదు. ఈ ఏడాది అందరూ పండగలను ఘనంగా జరుపుకునేందుకు ఇష్టపడ్డారని కూడా డబ్ల్యూజీసీ ఈ రిపోర్టులో వివరించింది. దీని ఫలితంగానే బంగారానికి డిమాండ్​ పెరిగిందని తెలిపింది. రాబోయే రోజుల్లోనూ దేశంలో రిటెయిల్​ ఇన్వెస్టర్ల నుంచి బంగారానికి డిమాండ్​ పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  దీపావళితోపాటు, పెళ్లిళ్లూ జోరందుకోవడంతో తర్వాతి నెలల్లో గోల్డ్​ గిరాకీ ఇదే లెవెల్లో కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కానీ, కిందటేడాది పెర్​ఫార్మెన్స్​ ఈ ఏడాది ఉండకపోవచ్చని చెబుతూ, ఈ ఏడాది గోల్డ్​ డిమాండ్​ 750–800 టన్నుల దాకా ఉండొచ్చని పేర్కొంది. 2021లో దేశంలోకి 1,003 టన్నుల బంగారం దిగుమతయింది. ఈసారి కూడా దానిని దాటకపోవచ్చని డబ్ల్యూజీసీ రిపోర్టు  అంచనా వేసింది. 

బ్యాంకులు ఇచ్చే అప్పులు పెరగడం వల్ల బంగారం డిమాండ్ బాగా​ పుంజుకుంది. బ్యాంకుల అప్పులు ఈ క్వార్టర్​ చివరి 9 ఏళ్ల గరిష్టానికి చేరాయి. బంగారం డిమాండ్​ పట్టణ ప్రాంతాలలో, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాలలో బంగారం డిమాండ్​ ఇంకా పుంజుకోలేదు. రుతుపవనాలు, ఇన్​ఫ్లేషన్​ ఎఫెక్ట్​ అక్కడ కనబడుతోంది. - పీఆర్​ సోమసుందరం, సీఈఓ, డబ్ల్యూజీసీ ఇండియా