భూసేకరణకు సహకరించాలి..గోదావరి జలాలను నియోజకవర్గానికి తీసుకొస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భూసేకరణకు సహకరించాలి..గోదావరి జలాలను నియోజకవర్గానికి తీసుకొస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • చెరువులన్నీ రిపేర్లు చేయిస్తాం 
  • తుంగతుర్తి కాంగ్రెస్​కు కంచుకోట
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ౦లోని తిరుమలగిరిలో సీ‌ఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కోరినట్టుగా దేవాదుల నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గంతోపాటు పాలకుర్తి,స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాతంలోని చెరువులను రిపేర్లు చేయిస్తానని చెప్పారు. కేతిరెడ్డి ఫీడర్ చానల్ పూడికతీత పనులు చేపట్టి 2 వేల ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని వెల్లడించారు. నల్గొండ జిల్లాలో మూసీ జలాలు సంపూర్ణంగా పారడానికి, బునాదిగాని కాలువ రివైవ్ చేయడానికి రూ.200 కోట్లు ముంజూరు చేసినట్లు తెలిపారు.  

తుంగతుర్తి కాంగ్రెస్ కు కంచుకోట..

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. నాడు జిల్లాలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఒక్కరే పార్టీకి అండగా ఉన్నారని, ఆ తర్వాత అద్దంకి దయాకర్ ఓడిపోయినప్పటికీ.. తను ఎంపీగా, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి సహకారంతో జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మోత్కూరు, బిక్కేరి వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆర్ అండ్ బీ శాఖ ద్వారా అర్వపల్లి, నాగారం పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి రూ.11 కోట్లను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అడ్డగూరు, మగొని, గొల్లపల్లి గ్రామాలకు రోడ్లను శాంక్షన్ చేశామని తెలిపారు. 

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి..

తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మందుల సామేల్.. సీ‌ఎం రేవంత్ రెడ్డిని కోరారు. నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ఎస్సారెస్పీ, భూనాదిగాని కాల్వలను పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తారని.. కానీ కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి అనుక్షణం ప్రజల మధ్య ఉంటున్నారని తెలిపారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. 

సీ‌ఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.70  కోట్లతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నాగారం, అడ్డగూడూరులో గోదాముల నిర్మాణం, తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసులు, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్,  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మురళినాయక్, యశస్వినిరెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.