
- ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటి టూర్
ఖమ్మం/ కూసుమంచి/ ముదిగొండ/ వెలుగు: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, రాష్ట్రాన్ని అన్నపూర్ణగా, విత్తన భాండాగారంగా మార్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మంత్రి పొంగులేటితో కలిసి పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ ఆయకట్టు రెండో జోన్‌కు నీటిని విడుదల చేశారు. ఆనంతరం భట్టి చింతకాని మండలంలో, పొంగులేటి తిరుమలాయపాలెంలో పర్యటించారు.
పాలేరులో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటా సాధించేందుకు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతేడాది వరదల కారణంగా పాలేరులోని సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ ప్రమాదానికి గురైందని, దాన్ని రూ.14.20 కోట్లతో రిపేరు చేశామన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, 5 రోజులలో పూర్తి సామర్థ్యంతో నీటి విడుదల చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ లోకి ముందుగానే వరద వస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సీపీ సునీల్ దత్ ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్ పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్న భట్టి
చింతకానిలో సోమవారం మధిర నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. మహిళలకు రుణాల చెక్కులను, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్స్‌ను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పని మహిళా సంఘాలకే ఇచ్చామని, తద్వారా మహిళలకు ఉపాధి కల్పించామని ఆయన చెప్పారు. మధిర నియోజకవర్గంలోని 4,590 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.5.93 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెర్ప్ సీఈఓ డి. దివ్య, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన పొంగులేటి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. రూ.2.50 కోట్లతో అజ్మీర తండా నుంచి రాకాసి తండా రోడ్డు , బ్రిడ్జి రిపేర్లకు, రూ.4.18 కోట్లతో జల్లేపల్లి నుంచి దేవుని గుట్ట వరకు, రూ. 1.65 కోట్లతో హైదర్‌సాయిపేట నుంచి సీరోలు వరకు, రూ.90 లక్షలతో హైదర్‌సాయిపేట నుంచి చిలక్కోయలపాడు వరకు నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ.33 కోట్లతో గోపాలపురం, జల్లెపల్లి రోడ్డు బ్రిడ్జి, రూ.20 కోట్లతో పాతర్లపాడు క్రాస్ రోడ్డు నుంచి రావి చెట్టు తండా రోడ్డు, రూ.27 కోట్లతో పాతర్లపాడు క్రాస్ రోడ్డు నుంచి జల్లెపల్లి రోడ్డు నిర్మాణాలకు, సుబ్లైడ్ గ్రామంలో రూ.2 .70 కోట్లతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్‌కు కుశంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎన్. విజయలక్ష్మి, ఆర్ అండ్ బి ఈఈ పవార్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ హరీశ్ కుమార్, విద్యా శాఖ ఈఈ విన్సెంట్ పాల్గొన్నారు.